విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం | General Meeting MPTCs and Sarpanch in Peda kottapalli | Sakshi
Sakshi News home page

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

Sep 1 2015 4:35 PM | Updated on Sep 3 2017 8:33 AM

విద్యుత్ అధికారుల పనితీరుపై పెద్దకొత్తపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెద్దకొత్తపల్లి (మహబూబ్‌నగర్ జిల్లా) : విద్యుత్ అధికారుల పనితీరుపై పెద్దకొత్తపల్లి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీపీ వెంకటేశ్వర్‌రావు అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో సర్పంచ్‌లు సత్యం, సురేష్‌రావు, వెంకటస్వామి, సుల్తానమ్మ, సులోచనమ్మలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు విద్యుత్ స్తంభాలను సరఫరా చేయక పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామాలకు మంజూరైన స్తంభాలను సరఫరా చేసి కొత్తగా లైన్లు వేస్తామని తెలిపారు. కరువు మండలంగా ప్రకటించాలని సభ్యులంతా సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. పాఠశాలలో వంట గదుల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి. వాటి నిర్మాణాలను వెంటనే చేపట్టాలని గంట్రావుపల్లి సర్పంచ్ సులోచనమ్మ సభ దృష్టికి తెచ్చారు.

ముష్టిపల్లి గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు గుడ్లు అందించకుండా అమ్ముకుంటున్నారని సర్పంచ్ సురేష్‌రావు సభ దృష్టికి తెచ్చారు. ఎంఈఓ శ్రీనివాసులు మాట్లాడుతూ.. పాఠశాలలో ఎస్‌ఎంసీ కమిటీ సమావేశం నిర్వహించి మధ్యాహ్న భోజనంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ పథకంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని సభ్యులు కోరగా టెక్నికల్ అసిస్టెంట్లతో మాట్లాడి చెల్లిస్తామని ఏపీఓ అలీమోద్దీన్ తెలిపారు. పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా ఉన్నాయి. జిల్లా పరిషత్ నిధుల నుంచి నిధులు మంజూరు చేయించాలని జడ్పీటీసీ వెంకటయ్యకు దేవల్‌తిర్మలాపూర్ సర్పంచ్ సత్యం సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ విజయ్‌కుమార్‌శర్మ, తహశీల్దార్ అశోక్, వైస్ ఎంపీపీ రాముడు, ఏఓ మధుశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement