ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు మొండిచెయ్యి
ఎన్నికలప్పుడు పెంచుతామంటూ చంద్రబాబు, పవన్ హామీ
అధికారంలోకి వచ్చాక నిధులివ్వని టీడీపీ కూటమి సర్కారు
ఎంపీటీసీలకు రూ.56 కోట్లు,, జెడ్పీటీసీలకు రూ.11 కోట్లు బాకీ
19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సిన పరిస్థితి
ప్రతిపక్ష ప్రజాప్రతినిధులని అధికార పార్టీ నేతల కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: సర్పంచ్‌ల నుంచి జెడ్పీ చైర్మన్ల వరకు గ్రామీణ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాన్ని పెంచుతామంటూ 2024 ఎన్నికలప్పుడు ఊదరగొట్టిన టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక వారికి మొండిచెయ్యి చూపించాయి. కనీసం వేతనాలు కూడా చెల్లించలేదు. ఫలితంగా రూ.కోట్లలో వారి బకాయిలు పేరుకుపోయాయి. ఎంపీటీసీలకు ప్రభుత్వం నెలవారీగా ఇచ్చే గౌరవ వేతనమే రూ.మూడు వేలైతే, ఆ చిన్నమొత్తాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం చెల్లించలేక చతికిలపడుతోంది. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 9,500 ఎంపీటీసీలకు సుమారు రూ.56 కోట్లు బకాయి ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒక్కో ఎంపీటీసీకి ప్రభుత్వం 19 నెలల గౌరవ వేతనం చెల్లించాల్సి ఉంది. అలాగే, జెడ్పీటీసీల నెలవారీ గౌరవ వేతనం రూ.6,000ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 660 మందికి దాదాపు రూ.11 కోట్లు బకాయి పడింది.
కూటమి నేతల కక్షసాధింపు..
2021లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దాదాపు 80 శాతం స్థానాలను నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గెలుచుకుంది. అయితే, ఇప్పుడు రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతన బిల్లులు పెట్టే విషయంలో కూటమి పార్టీల నేతలు కక్షసాధింపు ధోరణి అవలంబిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం పేరుకు బడ్జెట్‌లో వీరికి నిధుల కేటాయిస్తున్నప్పటికీ వాటి మంజూరు దగ్గరకొచ్చేసరికి మోకాలడ్డుతున్నట్లు ప్రజాప్రతినిధుల సంఘ నేతలు ఆరోపిస్తున్నారు.
సాధారణంగా ఎంపీటీసీల గౌరవ వేతన బిల్లులను ప్రతినెలా ఆయా మండల ఎంపీడీఓలు.. జెడ్పీటీసీలకు సంబం«ధించినవి జెడ్పీ సీఈఓలు సీఎఫ్‌ఎంఎస్‌లో నమోదుచేయాల్సి ఉంటుంది. కానీ, మార్చిలోపు ప్రభుత్వం ఈ బిల్లులకు సంబంధించిన నగదు విడుదల చేయకుంటే అవి మురిగిపోతాయి. మళ్లీ కొత్త బిల్లులు పెట్టాల్సి ఉంటుంది. అయితే, కొన్నిచోట్ల అధికార పార్టీ నేతలు ఎంపీడీఓలు, జెడ్పీ సీఈఓలపై ఒత్తిడి తెచ్చి బిల్లులు పెట్టనీయకుండా అడ్డుపడుతున్నారు. మరికొన్నిచోట్ల అధికారులు నమోదుచేసిన బిల్లులకు సకాలంలో నిధులు విడుదలకాక ఆరి్థక ఏడాది చివరిలో అవి మురిగిపోయే పరిస్థితి తలెత్తుతుందని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
గౌరవ వేతనం పెంచి బకాయిలు విడుదల చేయాలి..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఖజానాని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ఖజానా ఖాళీ అని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి చెప్పిన సమాధానమే ఇందుకు నిదర్శనం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కనీసం ప్రజాప్రతినిధులకి జీతాలివ్వడానికి కూడా డబ్బుల్లేకుండా చేసింది. ఎన్నికల్లో హామీ ఇచి్చనట్లుగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గౌరవ వేతనం పెంచడంతో పాటు వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. – వెన్నపూస రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ ,పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు


