నింగికెగిసిన ఉద్యమ నేత

Freedom Fighter Died In Warangal - Sakshi

 స్వాతంత్య్ర సమరయోధుడు పడాల చంద్రయ్య కన్నుమూత

అంత్యక్రియల్లో పాల్గొన్న   వేలాది మంది ప్రజలు

చంద్రయ్య మృతికి సంతాపంగా ఎంసీఆర్‌బీకి సెలవు

పార్థీవదేహం కేఎంసీకి అప్పగింత

భీమదేవరపల్లి(హుస్నాబాద్‌): ఉద్యోగాన్ని వదిలి ఉద్యమబాట పట్టిన స్వాతంత్య్ర సమరయోధుడు, రజకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పోరాట యోధుడు,  రైతుల పక్షాన నిలబడి, వారి సంక్షేమం కోసం సహకార గ్రామీణ బ్యాంక్‌ను నెలకొల్పిన సహకారవేత్త పడాల చంద్రయ్య(96) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం స్వాతంత్య్ర సమరయోధుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా గౌరవాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

పడా ల లక్ష్మీనర్సయ్య–అంబమామ్మ కుమారుడైన చంద్రయ్య 5వ తరగతి వరకు ముల్కనూర్‌లో చదివారు. అనంతరం హన్మకొండలో హెచ్‌ఎస్‌సీ పూర్తి చేశారు. అనంతరం  అజాంజాహీ మిల్లులో ఉద్యోగిగా చేరారు. ఆ ఉద్యోగం మానేసి వ్యవసాయ  శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్న రోజుల్లో 1947లో స్వాతంత్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలనే ఆశయంతో తన  ఉద్యోగానికి రాజీనామా చేసి రామానంద తీర్థ పిలుపు మేరకు కే.వీ  నర్సింగరావు, భూపతి కృష్ణమూర్తితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు.

 చంద్రయ్య అన్న పడాల రాజమౌళి, వదిన వీరమ్మ కూడా కూడా స్వాతంత్య్ర ఉద్యమంలో పనిచేశారు. ఉద్యమం తీవ్రమవుతున్న క్రమంలో చాంద క్యాంప్‌లో ఆయుధ శిక్షణ తీసుకున్నారు చంద్రయ్య. 1947 చివరలో పోల్సాని నర్సింగరావు నాయకత్వంలో రాయికల్‌ పోలీస్‌ స్టేషన్‌పై దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లిన ఘటనలో చంద్రయ్య కీలక పాత్ర పోషించారు. అనంతరం వీరూర్‌ పోలీస్‌  స్టేషన్‌పై చంద్రయ్య నాయకత్వంలో దాడి చేస్తున్న క్రమంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన ఎడమ కాలిలోకి దిగిన బుల్లెట్‌ మరణించే వరకు కాలిలోనే  ఉంది.

నాగపూర్‌లో సైతం మిల్ట్రీ శిక్షణ తీసుకున్న ఆయన పీవీ నర్సింహారావు, పోల్సాని నర్సింగారావు, దుగ్గిరా ల వెంకట్రావు తదితరులతో కలిసి ఊరూరా  తిరుగుతూ ఉద్యమాలు చేపట్టారు. తిండి గింజల పోరాటంతోపాటు క్విట్‌ ఇండియా ఉద్యమంలోని పాల్గొని  చంద్రయ్య జైలు జీవితం గడిపారు. 

కాంగ్రెస్‌ నుంచి సోషలిస్టు పార్టీలోకి...

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న చంద్రయ్య ఆ పార్టీ విధానాలు నచ్చక సోషలిస్టు పార్టీలో చేరారు. అనంతరం 1952లో పెండ్యాల రాఘవరావు ఆధ్వర్యంలోని పీడీఎఫ్‌(పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌) నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఒత్తిడి వచ్చినా రాజ కీయాల్లోకి వెళ్లలేక సాధారణ జీవితం గడిపారు.

చంద్రయ్య జీవితంపై పీహెచ్‌డీ..

చంద్రయ్య జీవితంపై ముల్కనూర్‌కు చెందిన దార్న దివ్య పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆమె అందించిన సమాచారంతో శ్రీరామానంద ట్రస్ట్‌కు చెంది న దినాకర్‌ బోరికర్, విలాస్‌ బావికర్‌ పడాల చం ద్రయ్య జీవిత చరిత్రను మరాఠీలో ముద్రించారు.

బ్యాంకుకు సెలవు..

చంద్రయ్య మరణవార్త తెలియగానే ముల్కనూర్‌ సహకార గ్రామీణ బ్యాంక్‌ అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి బ్యాంకుకు సెలవు ప్రకటించారు. అనంతరం ర్యాలీగా వచ్చి చంద్రయ్య అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియల్లో కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, కావేరి సీడ్స్‌ అధినేత గుండావరపు భాస్కర్‌రావు, హౌస్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సీపీఐ కరీంనగర్‌ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, బోయినపల్లి హన్మంతరావు పాల్గొన్నారు.

ముల్కనూరు బ్యాంక్‌ వ్యవస్థాపకుడిగా..

స్వాతంత్ర వచ్చిన తర్వాత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే  ఉద్దేశంతో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సిం హారావు, అల్గిరెడ్డి కాశీవిశ్వనాథరెడ్డి  తదితరులతో కలిసి ముల్కనూర్‌ సహకార గ్రామీణ బ్యాంకును స్థాపించారు. ఆ  రోజుల్లో సైకిళ్లపై తిరుగుతూ సహకార రంగంలో చేరాలంటూ రైతులను ప్రోత్సాహించి 1956లో ముల్కనూర్‌ బ్యాంక్‌ను స్థాపించారు.

ఆ బ్యాంకు వ్యవస్థాపక కార్యదర్శిగా 18 ఏళ్లపాటు కార్యదర్శిగా పనిచేశారు. నేడు ఆ బ్యాంక్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విషయం తెలిసిందే. అప్పట్లోనే ఉన్ని, చేనేత, తోళ్ల సహకార సంఘాల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు.

చంద్రయ్య పార్థీవదేహం కేఎంసీకి అప్పగింత

ఎంజీఎం: ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధు డు ముల్కనూర్‌వాసి పడాల చంద్రయ్య(95) పార్థీవదేహాన్ని బుధవారం వారి కుటుంబ సభ్యులు కాకతీయ మెడికల్‌ కళాశాల ప్రిన్సిపా ల్‌ డాక్టర్‌ సంధ్యారాణికి అప్పగిం చారు.

కాళోజీ నారాయణరావు కన్నుమూసిన సమయంలో ఆయన పార్థీవ దేహాన్ని కేఎంసీకి అప్పగించారు. కాళోజీని  ఆదర్శంగా తీసుకున్న ఆదర్శంగా తీసు కున్న చంద్రయ్య, వెంకటలక్ష్మి దంపతులు తమ మరణాంతరం తమ పార్థీవదేహాలను స్వీకరించాలని  2003లో కేంఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు.

2009లో వెంకటలక్ష్మి చనిపోగా ఆమె పార్థీవదేహాన్ని కేంఎంసీకి అప్పగించారు. ఇప్పు డు చంద్రయ్య పార్థీవదేహాన్ని అప్పగించారు. శరీర దాతల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లారెడ్డి, రాజమౌళి, శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top