విద్యా శాఖలో కలకలం

విద్యా శాఖలో  కలకలం - Sakshi


నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్ : జిల్లా విద్యా శాఖలో అవినీతి వ్యవహారం మరోసారి బట్టబయలైం ది. సస్పెన్షన్ ఎత్తివేసేందుకు ఓ ఉపాధ్యాయుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా బోధన్ డిప్యూటీ ఈఓ సాంబశివరావు, జుక్కల్ ఎంఈఓ దేవారావులను మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో డీఈఓను సైతం ప్రశ్నిస్తామని ఏసీబీ డీఎస్‌పీ పేర్కొనడం విద్యాశాఖ వర్గాలలో చర్చనీయాంశమైంది.

 

గతం నుంచి పాఠాలు నేర్వకుండా

2009లో డీఈఓ భృగుమహర్షి తన ఇంటిలో ఓ టీచర్ వద్ద రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే. అయినా విద్యాశాఖలోని కొందరు అధికారులలో మార్పు రాలేదు. డబ్బులిస్తే ఏ పనైనా చేసి పెడుతున్నారు. జిల్లాలో 150 పాఠశాలలు ఎలాంటి అనుమతులు లేకుం డానే సాగుతున్నాయి. ఆయా పా ఠశాలలకు అగ్నిమాపక శాఖ, వైద్యశాఖల అనుమతి లేదు. అయినా ఆయా పాఠశాలలకు గుర్తింపు పత్రం ఇచ్చారు. అధికారులు రూ. 20 వేలనుంచి రూ. 30 వేలు తీసుకొని గుర్తింపు పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

శ్రుతి మించి రాగాన

బోధన్ డివిజన్ ఉప విద్యాశాఖాధికారి, ఎంఈఓల వ్యవహారం మరీ శ్రుతి మిం చినట్లు తెలుస్తోంది. ఆకస్మిక తనిఖీల పేరుతో తనిఖీలు చేస్తూ ఉపాధ్యాయులకు మె మోలు ఇస్తున్నారని, సస్పెండ్ చేస్తున్నారని సమాచారం. ఇలా సస్పెం డైనవారిని తిరిగి విధులలోకి తీసుకోవడానికి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. సదరు అధికారి డబ్బులు తీసుకొని ఈ డివిజన్‌లో ఎనిమిది పాఠశాలలకు అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. జుక్కల్, మద్నూర్, బాన్సువాడలలో అనుమతిలేని పాఠశాల లు చాలా ఉన్నాయి. విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలనుంచి మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని తెలిసింది.

 

ఈ వ్యవహారానికి విద్యా సంఘాలకు చెందిన కొందరు నాయకులు మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు సమాచారం. డివిజన్‌లో అక్రమ పదోన్నతులు, బదిలీలు కూడా జరిగాయని, పలువురు నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతులు పొందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతుల విషయమై సీబీసీఐడీ విచారణ సైతం జరిగింది. దోషులను తేల్చి కేసులు నమోదు చేశారే కానీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. సమాజానికి మార్గదర్శకులుగా నిలవాల్సిన విద్యాశాఖ అధికారులే అవినీతికి పాల్పడుతుండడంపై విద్యాభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top