నలుగురు ఐజీలకు పదోన్నతి 

Four Senior IPS Officers Will Be Promoted To IGs In Telangana - Sakshi

ఏడీజీలుగా ప్రమోషన్లు కల్పించేందుకు సిద్ధమైన ప్రభుత్వం 

4 నెలలుగా పెండింగ్‌లోనే ఫైలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఐజీలుగా సేవలందిస్తోన్న నలుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి దక్కనుంది. వాస్తవానికి 1995 బ్యాచ్‌కు చెందిన విమెన్‌సేఫ్టీ వింగ్‌ ఐజీ స్వాతిలక్రా, తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మన్‌ వి.వి. శ్రీనివాసరావు, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌లకు ఫిబ్రవరిలోనే ప్రమోషన్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యారు. 

అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐపీఎస్‌ అధికారులకు డీఐజీలు, ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కానీ, సాంకేతిక కారణాలు, కరోనా కేసులు, లాక్‌డౌన్‌ కారణంగా నలుగురు ఐజీ ర్యాంకు అధికారులకు పదోన్నతి కల్పించే ఫైలుకు గ్రహణం పట్టుకుంది. అప్పటి నుంచి వీరి ఫైల్‌ పెండింగ్‌లోనే ఉండిపోయింది. తాజాగా ఈ ఫైల్‌లో కదలిక వచ్చిందని సమాచారం. త్వరలోనే వీరి పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుందని తెలుస్తోంది. 

ప్రమోషన్లు దక్కినా.. పాత కుర్చీలోనే విధులు 
గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిలో సీనియర్‌ ఎస్పీ, డీఐజీ, ఐజీ, ఏడీజీ వరకు ర్యాంకులు ఉన్నాయి. ఈ పదోన్నతి కల్పించి దాదాపు 14 నెలలు కావస్తోంది. అయినా, వీరికి కొత్త పోస్టింగుగానీ, బదిలీగానీ కల్పించలేదు. అదే సమయంలో గతేడాది ఏప్రిల్‌లో ఎస్పీ ర్యాంకు నుంచి సీనియర్‌ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 2006 ఐపీఎస్‌ బ్యాచ్‌కుచెందిన కార్తికేయ, కె.రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్లు డీఐజీలు అయ్యారు. 

పదినెలల కాలంలో రెండోసారి పదోన్నతి సాధించినా ప్రభుత్వం పోస్టింగ్, బదిలీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. వీరితోపాటు 2002 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన డీఐజీ అధికారులు రాజేశ్‌కుమార్, వి.రవీందర్, శివశంకర్‌రెడ్డిలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. అదేసమయంలో ఏడీజీలుగా ఉన్న 1987 బ్యాచ్‌కుచెందిన వీకే సింగ్, ఎం.గోపీకృష్ణ, సంతోష్‌మెహ్రా, జె.పూర్ణచంద్రరావులను డీజీ ర్యాంకు ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించింది. వీరిలో సంతోష్‌మెహ్రా కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. మిగిలిన వారు కూడా ఎవరిస్థానాల్లో వారే ఉన్నారు. ఈ విషయంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రెండుప్రమోషన్లు వచ్చినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహించాల్సి రావడం ఏమిటని అంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top