
అత్యధికంగా 8,442 సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు
3,271 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు.. సివిల్ ఎస్సై కేటగిరీలో 677 ఖాళీలు
జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీలపై ప్రభుత్వం దృష్టి సా రించింది. శాఖల వారీగా వివరాలను సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ఖాళీల వివరాలను సమరి్పంచింది. దీని పరిధిలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ (నేరుగా నియామకాలు) పద్ధతిలో మంజూరైన పోస్టులు, ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య, ఖాళీల వివరాలను తెలియజేసింది. ప్రస్తుతం రాష్ట్ర పోలీసు విభాగం పరిధిలో వివిధ కేటగిరీల్లో 12,452 ఉద్యోగ ఖాళీలున్నాయి. ఇందులో అత్యధికంగా పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) కేటగిరీలో 8,442 పోస్టులు ఉండగా, పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్) కేటగిరీలో 3,271 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ సివిల్ కేటగిరీలో 677, ఏఆర్ కేటగిరీలో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖకు నివేదించింది.
అన్ని శాఖల సమాచారం రావాలి
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కేడర్‌ల వారీగా మంజూరైన పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలు, డిప్యుటేషన్, సెలవులపై వెళ్లిన ఉద్యోగులు.. ఇలా వివిధ కోణాల్లో సమగ్ర సమీక్ష కోసం ప్రత్యేకంగా మాజీ సీఎస్ శాంతికుమారి నేతృత్వంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా పని భారానికి తగినట్లుగా పోస్టులున్నాయా? లేనట్లైతే డిమాండ్ ఏ విధంగా ఉంది? అనే అంశాల ప్రాతిపదికన నిశిత పరిశీలన చేస్తోంది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖలు స్పష్టమైన సమాచారాన్ని కమిటీకి అందించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్ని విభాగాధిపతులకు ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. ఈ సమీక్షలు పూర్తయి కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచిన తర్వాత ఆయా ఖాళీలతో జాబ్ క్యాలెండర్‌కు రూపకల్పన జరుగుతుంది. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర పోలీసు శాఖకు సంబంధించి ఉద్యోగ ఖాళీల లెక్కలు తేలగా మిగిలిన శాఖల సమాచారం అందాల్సి ఉంది.