
ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ ఓ ఏఎస్‌ఐ ఆత్మహత్య
పూరన్ సన్నిహిత కానిస్టేబుల్ సుశీల్‌ను అరెస్టు చేసింది ఇతడే
హరియాణా డీజీపీ శత్రుజీత్‌ను సెలవుపై పంపిన ప్రభుత్వం
తాత్కాలిక డీజీపీగా ఓపీ సింగ్‌కు బాధ్యతలు
పూరన్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌గాంధీ
చండీగఢ్: హరియాణా సీనియర్ పోలీస్ అధికారి, ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) పూరన్‌కుమార్ కుమార్ ఆత్మహత్య వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పూరన్‌కుమార్‌పై వచ్చిన అవినీతి ఆరోపణపై విచారణ దర్యాప్తు జరుపుతున్న రోహ్‌తక్ ఏఎస్‌ఐ సందీప్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఆయన పూరన్ కుమార్‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సందీప్‌కుమార్ మృతదేహాన్ని రోహ్‌తక్‌లోని ఆయన నివాసంలో గుర్తించారు. మృతదేహం వద్ద మూడు పేజీల లేఖతోపాటు ఆయన మొబైల్‌లో ఆరు నిమిషాల సెల్ఫీ వీడియో లభించాయి.
అందులో ఆయన పూరన్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ను కులం పేరుతో వేధించారని ఆరోపిస్తూ పూరన్ కుమార్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొన్న 8 మంది పోలీస్ అధికారుల్లో ఒకరైన రోహ్‌తక్ ఎస్పీ బిజర్నియా ఎంతో నిజాయితీగల మంచి వ్యక్తి అని సందీప్‌కుమార్ తన ఆత్మహత్య లేఖలో పేర్కొనటం గమనార్హం. సందీప్‌కుమార్ తన రివాల్వర్‌తో కాల్చుకుని మరణించాడని రోహ్‌తక్ ప్రస్తుత ఎస్పీ ఎస్‌ఎస్ భోరియా తెలిపారు. ‘మా డిపా ర్ట్‌మెంట్‌లో సందీప్‌కు మార్ ఎంతో కష్టపడి పనిచేసే నిజాయితీగల వ్యక్తి’అని చెప్పారు. సందీప్ ఆత్మహత్య లేఖ గురించి మీడియా ప్రశ్నించగా.. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం సమస్యలకు దారితీస్తుందని, ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు.
కాగా, తన మరణంతో అయినా దేశం నిజం తెలుసుకుంటుందని సందీప్ తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. ‘పూరన్‌కుమార్ అవినీతిపరుడు. అందుకు అనేక సాక్ష్యాలు ఉన్నాయి. దర్యాప్తులో వివక్షను నిరసిస్తూ నేను ప్రాణత్యాగం చేస్తున్నాను. ఆ అవినీతి కుటుంబాన్ని అస్సలు వదలొద్దు. కులరాజకీయాలతో వ్యవస్థను హైజాక్ చేస్తున్నారు’ అని అందులో పేర్కొన్నాడు. లిక్కర్ కాంట్రాక్టర్ నుంచి పూరన్‌కుమార్ తరఫున రూ.2.5 లక్షలు లంచం తీసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ సుశీల్‌కుమార్‌ను అరెస్టు చేయటంలో సందీప్‌కుమార్ కీలకంగా వ్యవహరించారు. కాగా, పూరన్‌కుమార్‌పై కుల వివక్ష ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ కపూర్‌ను నాయబ్‌సింగ్ సైనీ ప్రభుత్వం సెలవుపై పంపింది. ఆయన స్థానంలో తాత్కాలిక డీజీపీగా 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఓపీ సింగ్‌కు బాధ్యతలు అప్పగించింది.
మోదీ రాతిగుండె కరగదా?: రాహుల్
పూరన్‌కుమార్ కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూరన్ కుమార్‌ను కులంపేరుతో వేధించి ఆత్మహత్యకు కారణమై అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. భర్త మృతదేహానికి గౌరప్రదంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు పూరన్‌కుమార్ సతీమణి, సీనియర్ ఐఏఎస్ అధికారి అమ్‌నీత్ పీ కుమార్, ఆయన ఇద్దరు కుమార్తెలు వారాలుగా ఎదురు చూస్తున్నారని.. అయినా ప్రధాని మోదీ, సీఎం సైనీ రాతి మనసులు కరగటం లేదని ఆరోపించారు. ఎంత చదువుకున్నా, ఎంత ప్రజ్ఞా పాఠవాలు ఉన్నా, జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగి నా ఈ దేశంలో దళితులపై అణచివేత తప్పదని పూరన్‌కుమార్ ఆత్మహత్య ఘటన నిరూపిస్తోందని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.