
భోపాల్: హర్యానాలో తెలుగు సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు పూరాన్ కుమార్ తన మరణానికి కారణమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు రాశారు. వారిలో ఒకరైన రోహత్‌క్ సైబర్ సెల్ ఏఎస్‌ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సైతం ‘సత్యం’ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం రేపుతోంది.
రోహ్‌తక్‌లోని ఓ పొలంలో సందీప్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ వీడియో,మూడుపేజీల సూసైడ్ నోట్ రాశారు. ఆ నోట్‌లో ‘ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతి పోలీసు అధికారి. తన అవినీతి బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత పూరన్ కుమార్ బదిలీ అయ్యారు.
ఐపీఎస్ అధికారి గన్‌మెన్ మద్యం కాంట్రాక్టర్ నుండి రూ. 2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా నేనే పట్టుకున్నాను. ఓ గ్యాంగ్‌స్టర్ బెదిరించడంతో కాంట్రాక్టర్ పూరన్ కుమార్‌ను కలిశాడు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినప్పుడు.. ఐపీఎస్ అధికారి దానికి కులం రంగు పులిమేందుకు ప్రయత్నించారు.
పూరన్ కుమార్‌ను రోహ్‌తక్ పరిధిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన అవినీతికి అంతులేకుండా పోయింది. రోహ్‌తక్‌లో బాధ్యతలు చేపట్టి నిజాయితీపరులైన పోలీసు అధికారుల స్థానంలో అవినీతిపరులైన అధికారులను నియమించడం ప్రారంభించారు. సదరు అధికారులు బ్లాక్‌మెయిల్ చేయడం, పిటిషనర్లకు ఫోన్ చేసి, డబ్బులు అడిగి వారిని మానసికంగా హింసించేవారు. బదిలీలకు బదులుగా మహిళా పోలీసు సిబ్బందిని లైంగికంగా వేధించారు.
‘ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. అతనిపై వచ్చిన ఫిర్యాదులకు భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆస్తులపై దర్యాప్తు చేయాలి. ఇది కుల సమస్య కాదు. నిజం బయటకు రావాలి. అతను అవినీతిపరుడు. ఈ నిజం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తున్నాను. నేను నిజాయితీతో నిలబడినందుకు గర్వపడుతున్నాను. నా కుటుంబ సభ్యులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారు’ అంటూ తన బలవన్మరణానికి ముందు సైబర్ సెల్ ఏఎస్‌ఐ సందీప్ కుమార్ రాసిన సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపణలు చేశారు.
కాగా, సందీప్ కుమార్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న పదిమంది అధికారులలో ఒకరైన రోహ్‌తక్ పోలీస్ చీఫ్ నరేంద్ర బిజార్నియాను ప్రశంసించారు. వెనువెంటనే బిజార్నియా రోహ్‌తక్ నుంచి మరో ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ చేసినట్లు సమాచారం.