
బస్సు ప్రమాదంలో సజీవదహనమైన ప్రయాణికులు
మరో 16 మందికి తీవ్ర గాయాలు
రాజస్థాన్‌లోని జైసల్మీర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని
తలో రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా విడుదల
జైసల్మీర్: దాదాపు 57 మంది ప్రయాణికులతో మొదలైన ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణం అత్యంత విషాదాంతంగా ముగిసింది. బస్సు వేగంగా దూసుకెళ్తున్నప్పుడు ఒక్కసారిగా అంటుకున్న అగ్నికీలలు రెప్పపాటులో బస్సును ఆవహించి అందులోని 20 మంది ప్రయాణికుల ప్రాణాలు తీశాయి. రాజస్థాన్‌లోని జైసల్మీర్ నగరం సమీపంలో మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జైసల్మీర్–జోధ్‌పూర్ జాతీయరహదారిపై ఈ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం బస్సు వెనక భాగంలో షాట్ సర్క్యూట్ సంభవించడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పొగ రావడం మొదలైంది.
బస్సు అత్యంత వేగంగా వెళ్తుండటంతో గాలులు తోడై మంటలు చెలరేగి వేగంగా బస్సును చుట్టుముట్టాయి. డ్రైవర్ గమనించి బస్సును రహదారిపై ఒక పక్కకు ఆపి అందర్నీ అప్రమత్తంచేసేలోపే 20 మంది ప్రయాణికులు ఆ మంటలకు సజీవ దహనమయ్యారు. 16 మంది ప్రయాణికులకు తీవ్రస్థాయిలో కాలిన గాయాలయ్యాయి. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెల్సుకున్న అగ్నిమాపక, ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
మార్గమధ్యంలో ఇతర వాహనాలు, ట్రాఫిక్ అడ్డుతగలకుండా గ్రీన్‌చానల్ ఏర్పాటుచేశారు. జోధ్‌పూర్ ఆస్పత్రిలో గాయపడిన ప్రయాణికులకు పూర్తిస్థాయిలో చికిత్స, సహాయ సహకారాలు అందించాలని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జైసల్మీర్‌కు చేరుకున్నారు.
మొత్తంగా కాలిపోయిన బస్సు
తొలుత మంగళవారం మధ్యాహ్నం జైసల్మీర్ నుంచి బస్సు జోధ్‌పూర్‌కు బయల్దేరింది. బయల్దేరిన 10 నిమిషాలకే బస్సు అగ్ని ప్రమాదానికి గురైందని పోక్రాన్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రతాప్ పురీ మీడియాతో చెప్పారు. వేగంగా వెళ్తున్న బస్సులో చెలరేగిన మంటలు గాలుల ధాటికి రెప్పపాటులో మొత్తంగా అంటుకోవడంతో ప్రమాదతీవ్రత భారీస్థాయిలో ఉంది. మంటలకు బస్సు మొత్తం కాలిపోయింది. బస్సులో పడుకుని ప్రయాణించే విభాగం మొత్తం కాలిబూడిదైంది. కొందరి ప్రయాణికుల మృతదేహాలు అగ్నికికాలిపోయి మాంసం ముద్దలుగా మారిపోయాయి.
డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే మృతదేహాలను కుటుంబసభ్యులు అప్పగించనున్నారు. విషయం తెల్సి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు తలో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి తలో రూ. 50,000 అందజేయనున్నారు. ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్ హరిబావూ బగాదే సైతం తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ప్రమాదానికి గురైన బస్సును కొత్త యజమాని కేవలం ఐదు రోజుల క్రితమే కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రమాద సమయంలో బస్సు నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టంగా పొగ వెలువ డుతున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారా యి.