అడవి నుంచి గెంటేశారు..

Forest Officers Removed Houses Of Tribals In Kagaznagar - Sakshi

బలవంతంగా గిరిజనుల తరలింపు

కాగజ్‌నగర్‌ ఫారెస్టు అధికారుల దాష్టీకం

కాగజ్‌నగర్‌ : గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు హెచ్చు మీరుతున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొలాంగొంది గిరిజనులను అటవీ అధికారులు అడవి నుంచి గెంటేశారు. నివాసాలను కూల్చివేసి సామగ్రితో సహా పంపేయడంతో కలప డిపోలో గిరిజనులు తలదాచుకుంటున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ సమీపంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ నివాసముంటున్న మొత్తం 16 గిరిజన కుటుంబాలను రిజర్వు ఫారెస్టు భూమి పేరుతో అధికారులు ఖాళీ చేయించారు. గిరిజనులు ఉంటున్న స్థలం రిజర్వు ఫారెస్టు భూమిగా పేర్కొంటూ అటవీ అధికారులు గతంలో చాలాసార్లు సర్వేలు నిర్వహించారు. గతంలోనే ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులు ప్రత్యామ్నాయంగా వేరే చోట వ్యవసాయ భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలోనే గిరిజనుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. మరోవైపు అటవీ శాఖ భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొంటూ 2017లో 13 మంది గిరిజనులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.  

కోర్టు తీర్పు రాకముందే..! 
గతంలో సర్వేలు చేసిన అటవీ అధికారులు ఖాళీ చేయాలని గిరిజనులకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై గిరిజనులు అప్పట్లో కాగజ్‌నగర్‌కు చెందిన న్యాయవాదిని సంప్రదించడంతో ఆయన వారి తరుఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చట్ట ప్రకారం గిరిజనులకు పునరావాసం కల్పించాలని ఈ ఏడాది మార్చి 25న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అటవీ అధికారులు కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేశారు. 2013 నుంచి మాత్రమే గిరిజనులు ఇక్కడ నివాసముంటున్నారని కోర్టుకు నివేదిక అందజేశారు. చట్ట ప్రకారం 2006కు ముందు నుంచి ఉంటున్న వారికే హక్కులు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొలాంగొంది గిరిజనులకు ఎలాంటి హక్కు లు లేవని అటవీ అధికారులు వాదించారు. మంగళవారం కేసు వాదనకు రావడంతో  ఒక రోజు గడువు కావాలని సదరు న్యాయవాది కోరినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు బుధవారం అటవీ అధికారులు జీపీఆర్‌ఎస్‌ మ్యాప్‌ ఆధారంగా అక్కడ ఎలాంటి నివాసాలు లేవని, ఎప్పుడో తరలించామని సూచిం చి కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. అది నిజం చేయడానికే అటవీ శాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గిరిజనులను కాగజ్‌నగర్‌ కలప డిపోకు తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఖాళీ చేయించామని తెలుపుతున్న అటవీ అధికారులు సదరు కాపీ ఇవ్వాలని కోరగా స్పందించడం లేదు.  

ఆగమేఘాల మీద తరలింపు.. 
బుధవారం ఉదయం కొలాంగొందికి వచ్చిన అటవీ అధికారులు గిరిజనులను బలవంతంగా జీపులో ఎక్కించి కాగజ్‌నగర్‌ కలప డిపోకు తరలించారు. వారికి సంబంధించి పూరి గుడిసెలను ధ్వంసం చేశారు. అధికారులు అక్రమంగా తమను ఖాళీ చేయించారని, కలప డిపోలో తిండి లేక గోస పడుతున్నామని వాపోతున్నారు.  

చెట్టుకొకలం.. పుట్టకొకలం అయ్యాం.. 
మాకు ఉన్న నీడను అధికారులు కూల్చివేశారు. మేం ఇప్పడు ఎలా బతికేది. దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేశారు. ఇప్పడు మేం చెట్టుకొకలం, పుట్టకొకలం అయ్యాం.  – సిడాం బాపురావు, కొలాంగొంది

కోర్టు ఆదేశాల మేరకే..  
కోర్టు ఆదేశాల మేరకే గిరిజనులను తరలించాం. గిరిజనులు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చట్ట పరిధిలో చర్యలు తీసుకున్నాం. పునరావాసం కోసం ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో క్రిష్ణ ఆదిత్యకు నివేదిక పంపాం. అప్పటి వరకూ గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – రాజరమణారెడ్డి, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్‌
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top