breaking news
houses removed
-
అడవి నుంచి గెంటేశారు..
కాగజ్‌నగర్ : గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు హెచ్చు మీరుతున్నాయి. కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కొలాంగొంది గిరిజనులను అటవీ అధికారులు అడవి నుంచి గెంటేశారు. నివాసాలను కూల్చివేసి సామగ్రితో సహా పంపేయడంతో కలప డిపోలో గిరిజనులు తలదాచుకుంటున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ సమీపంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ నివాసముంటున్న మొత్తం 16 గిరిజన కుటుంబాలను రిజర్వు ఫారెస్టు భూమి పేరుతో అధికారులు ఖాళీ చేయించారు. గిరిజనులు ఉంటున్న స్థలం రిజర్వు ఫారెస్టు భూమిగా పేర్కొంటూ అటవీ అధికారులు గతంలో చాలాసార్లు సర్వేలు నిర్వహించారు. గతంలోనే ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులు ప్రత్యామ్నాయంగా వేరే చోట వ్యవసాయ భూమి, డబుల్ బెడ్రూం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలోనే గిరిజనుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. మరోవైపు అటవీ శాఖ భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొంటూ 2017లో 13 మంది గిరిజనులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు తీర్పు రాకముందే..! గతంలో సర్వేలు చేసిన అటవీ అధికారులు ఖాళీ చేయాలని గిరిజనులకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై గిరిజనులు అప్పట్లో కాగజ్‌నగర్‌కు చెందిన న్యాయవాదిని సంప్రదించడంతో ఆయన వారి తరుఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం గిరిజనులకు పునరావాసం కల్పించాలని ఈ ఏడాది మార్చి 25న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అటవీ అధికారులు కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు. 2013 నుంచి మాత్రమే గిరిజనులు ఇక్కడ నివాసముంటున్నారని కోర్టుకు నివేదిక అందజేశారు. చట్ట ప్రకారం 2006కు ముందు నుంచి ఉంటున్న వారికే హక్కులు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొలాంగొంది గిరిజనులకు ఎలాంటి హక్కు లు లేవని అటవీ అధికారులు వాదించారు. మంగళవారం కేసు వాదనకు రావడంతో ఒక రోజు గడువు కావాలని సదరు న్యాయవాది కోరినట్లు సమాచారం. ఆ మరుసటి రోజు బుధవారం అటవీ అధికారులు జీపీఆర్ఎస్ మ్యాప్ ఆధారంగా అక్కడ ఎలాంటి నివాసాలు లేవని, ఎప్పుడో తరలించామని సూచిం చి కోర్టును తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. అది నిజం చేయడానికే అటవీ శాఖ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా గిరిజనులను కాగజ్‌నగర్ కలప డిపోకు తరలించారు. కోర్టు ఆదేశాల ప్రకారమే ఖాళీ చేయించామని తెలుపుతున్న అటవీ అధికారులు సదరు కాపీ ఇవ్వాలని కోరగా స్పందించడం లేదు. ఆగమేఘాల మీద తరలింపు.. బుధవారం ఉదయం కొలాంగొందికి వచ్చిన అటవీ అధికారులు గిరిజనులను బలవంతంగా జీపులో ఎక్కించి కాగజ్‌నగర్ కలప డిపోకు తరలించారు. వారికి సంబంధించి పూరి గుడిసెలను ధ్వంసం చేశారు. అధికారులు అక్రమంగా తమను ఖాళీ చేయించారని, కలప డిపోలో తిండి లేక గోస పడుతున్నామని వాపోతున్నారు. చెట్టుకొకలం.. పుట్టకొకలం అయ్యాం.. మాకు ఉన్న నీడను అధికారులు కూల్చివేశారు. మేం ఇప్పడు ఎలా బతికేది. దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేశారు. ఇప్పడు మేం చెట్టుకొకలం, పుట్టకొకలం అయ్యాం. – సిడాం బాపురావు, కొలాంగొంది కోర్టు ఆదేశాల మేరకే.. కోర్టు ఆదేశాల మేరకే గిరిజనులను తరలించాం. గిరిజనులు చెప్పే మాటల్లో వాస్తవం లేదు. హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చట్ట పరిధిలో చర్యలు తీసుకున్నాం. పునరావాసం కోసం ఉట్నూర్ ఐటీడీఏ పీవో క్రిష్ణ ఆదిత్యకు నివేదిక పంపాం. అప్పటి వరకూ గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం. – రాజరమణారెడ్డి, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్ -
రోడ్డున పడేశారు
మూడు నెలల్లో కొత్త ఇళ్లు ఇస్తామని చెప్పారు రెండేళ్లయినా ఆ ఊసే లేదు సీఎం, కలెక్టర్, ఎమ్మెల్యేల హామీలు గాలికి కోటిలింగాల ఘాట్ అనుసంధాన రోడ్ల బాధితుల ఆవేదన పుష్కర సంబరాలు ముగియగానే ఇళ్లు ఇస్తామని ఉన్న గూడును తొలగిం చారు. ‘ఇదేమి అన్యాయ’మంటూ నిరసనలకు దిగడంతో పుష్కరాలు ముగియగానే కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తామని సీఎంతోపాటు జిల్లా కలెక్టర్, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. పుష్కరాలు ముగిసి అంత్య పుష్కరాలు కూడా పూర్తయినా ఆ ఊసే లేదు. ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో 56 కుటుంబాలు రేకుల షెడ్లలో, మురికి కూపాల మధ్య దుర్భర జీవనాన్ని గడుపుతున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాలకు భారీ వ్యయంతో అట్టహాసంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశంలోనే అతిపెద్ద కోటిలింగాల ఘాట్‌ను నిర్మించింది. ఇక్కడ గంటకు 1.5 లక్షల మంది స్నానం చేసేలా ఏర్పాట్లు చేసింది. 1.5 కిలోమీటర్లు పొడవు ఉన్న ఘాట్‌లోకి నగరం నుంచి వచ్చేందుకు ఆరు అనుసంధాన రోడ్లు నిర్మించింది. ఆ సమయంలో రోడ్లు వేసేందుకు అడ్డుగా ఉన్న 56 గృహాలను తొలగించాలని అధికారులు నిర్ణయించారు. ఆ సమయంలో బాధితులు ఆందోళనలు చేశారు. మూడు నెలల్లో నూతన గృహాలు కట్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, రాజమహేంద్రవరం నగర, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ బాధితుకుల హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు చేతల్లో చూపించకపోవడంతో వారంతా రోడ్డున పడ్డారు. రేకుల షెడ్లలో నివాసం... బాధితుల గృహాలు తొలగించిన అధికారులు నూతన గృహాలు నిర్మించి ఇచ్చే వరకూ కోటిలింగాల ఘాట్ టింబర్ డిపో నుంచి బృహన్నలపేట వైపు వెళ్లే మార్గంలో దేవాదాయ శాఖ స్థలాన్ని అధికారులు చూపించారు. 56 కుటుంబాలు అక్కడ తాత్కాలికంగా రేకుల షెడ్లు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. కనీస వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు లేక అర కిలోమీటరు దూరంలో ఉన్న పేపర్ మిల్లు సర్కిల్లోని సులభ్ కాంప్లెక్స్ వద్దకు వెళుతున్నారు. చుట్టూ టింబర్ డిపోలు కావడం, పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో విష సర్పాల సంచారం ఎక్కువగా ఉంది. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో రాత్రి పూట బయటకు వెళ్లాలంటే ప్రాణ భయంతో వణికిపోతున్నారు. రాత్రి పది గంటల తర్వాత సులభ్ కాంప్లెక్స్ మూసివేస్తుండడంతో కాలకృత్యాలు తీర్చుకునేందుక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో ఆడపిల్లలు రాత్రి పూట భోజనం చేయడం మానివేశారని మహిళలు వాపోతున్నారు. మురికి కూపం.. పందుల స్వైరవిహారం.. కనీస మౌలిక వసతులు లేకపోవడంతో మురుగు నీరు నివాసాల మధ్యే నిలిచిపోతోంది. పందులు మురుగు నీటిలో స్వైర విహారం చేస్తున్నాయి. దోమల వల్ల తరచూ పిల్లలు, పెద్దలు జ్వరాల బారిన పడుతున్నారు. చిన్నపాటి వర్షం పడినా నివాస ప్రాంతాల మధ్య మోకాలు లోతులో నీరు నిలిచిపోతోంది. వర్షం తగ్గినా మూడు నాలుగు రోజులకు కూడా నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బురదలోనే వీరు అష్ట కష్టాలు పడుతున్నారు. 40 ఏళ్లుగా నివాసం.. పక్కా గృహాలు ధ్వంసం కోటిలింగాల ఘాట్ విస్తరించక ముందు గోదావరి గట్టుకు వెలుపల దేవాదాయ శాఖ స్థలంలో వీరు 40 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుని జీవించే వీరు రూపాయి రూపాయి కూడబెట్టుకుని పక్కా గృహాలు నిర్మించుకున్నారు. ప్రతి ఏడాది దేవాదాయ శాఖకు గజం స్థలానికి రూ.16 చొప్పన పన్నులు కట్టారు. గృహాలు తొలగించే ఆరు నెలల ముందు కూడా కోటిలింగాల ఘాట్‌లోని దేవాదాయ శాఖ కార్యాలయంలో పన్నులు చెల్లించారు. అనుసంధాన రోడ్ల కోసం రూ. రెండు లక్షల విలువైన వీరి ఇళ్లను అధికారులు తొలగించారు. మూడు నెలల్లో కొత్త ఇళ్లు ఇస్తామని చెప్పి స్లిప్పులు ఇచ్చినా ఇప్పటి వరకు అతీగతీ లేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదని వాపోతున్నారు. కోటిలింగాల ఘాట్ విస్తరణ కోసం గోదావరి గట్టుపై నది వైపున పాకలు వేసుకుని నివాసం ఉంటున్న 96 మత్య్సకార కుటుంబాలను కూడా ఖాళీ చేయించారు. వారికి రోడ్లు భవనాల శాఖ స్థలంలో నిర్మించిన వాంబే గృహాలను కేటాయించారు. కానీ గట్టు వెలుపల అనుసంధాన రోడ్ల కోసం తొలగించిన బాధితులకు మాత్రం ఇప్పటి వరకూ న్యాయం చేయలేదు. పుష్కరాలు ముగియగానే ఇస్తామన్నారు పుష్కరాల ఏర్పాట్లకు ఇళ్లు తొలగిస్తున్నామన్నారు. మేము ఒప్పుకోకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చి పుష్కరాలు ముగియగానే కొత్త ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. రెండేళ్లయినా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. – ఎన్. సూర్యకుమారి, బాధితురాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం ఇళ్లు కట్టించే వరకు ఇక్కడ ఉండాలని స్థలం చూపించారు. మంచినీరు, విద్యుత్తు సౌకర్యం లేదు. ఇక్కడికి వచ్చే రోడ్డును టింబర్ డిపో వాళ్లు మూసేశారు. విష సర్పాలు తిరుగుతున్నాయి. చీకటిలో చెట్ల పక్కన రావాలంటే భయమేస్తోంది. మరుగుదొడ్లు లేకపోవడంతో రాత్రి పూట ఆడపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మత్స్యకారులకు ఇచ్చినట్లు మాకు కూడా ఇళ్లు కేటాయించి నేతలు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నాం. – పి. పోసేశ్వరి, బాధితురాలు -
రోడ్డు విస్తరణకు 276 గృహాలు తొలగించాలి
రహదారుల అభివృద్ధి సంస్థ డీఈ ప్రభాకర్ తొలగింపుపై సూర్యారావుపేటలో సర్వే కాకినాడ రూరల్ : కాకినాడ పోర్టు– సామర్లకోట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరిస్తున్న క్రమంలో 276 గృహాలను తొలగించాల్సి వస్తోందని రహదారుల అభివృద్ధి సంస్థ డీఈ ప్రభాకర్ వెల్లడించారు. వీటిలో 99 గృహాలను పూర్తిగాను, 176 గృహాలను పాక్షికంగా తొలగించాల్సి ఉందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులతో పాటు వివిధ ఆలయాలు కలిపి 37 తొలగించాల్సి వస్తుందని తెలిపారు. దీనిపై కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట పంచాయతీలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. మొత్తం 27.5 కిలోమీటర్ల పొడవునా ప్రస్తుతం ఉన్న రోడ్డు మధ్య నుంచి రెండువైపులా 20 మీటర్ల చొప్పున 40 మీటర్ల మేర రోడ్డును విస్తరిస్తామని ప్రభాకర్ వివరించారు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి పథకంలో భాగంగా ఈ రోడ్డును విస్తరిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సూర్యారావుపేట సర్పంచ్ యజ్జల బాబ్జీ, హైదరాబాద్‌కు చెందిన పర్యావరణ నిపుణుడు ఎ మాధవరెడ్డి, అలాగే సి దేవరాజ్‌లతో పాటు గ్రామపెద్దలు, స్థానిక నిర్వాసితులు పాల్గొన్నారు.