అడవిని సంరక్షించాల్సిన అధికారులే ఎంచక్కా అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. అటవీచట్టాలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
అడవిని సంరక్షించాల్సిన అధికారులే ఎంచక్కా అక్రమాలకు కొమ్ముకాస్తున్నారు. అటవీచట్టాలకు తూట్లు పొడుస్తూ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. హరితహారం పథకాన్ని అక్రమహారంగా మలుచుకుంటున్నారు. కలప అక్రమార్కులకు అండగా ఉంటూ ‘అడవీ నాదే..అక్రమం నాదే..’ అనే రీతిలో దర్జాగా దండుకుంటున్నారు. - ఖమ్మం హవేలి
ఖమ్మం హవేలి: అటవీ చట్టాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాల్సిన ఆ శాఖ అధికారులే వాటికి తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలను పక్కదారి పట్టిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కలప అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం విషయంలోనూ అక్రమాలకు పాల్పడుతుండటం విస్మయం కలిగిస్తోంది.
ఖమ్మం డీఎఫ్‌వో పరిధిలోని సత్తుపల్లి రేంజ్‌లో లంకపల్లి డిప్యూటీ రేంజ్ అధికారి అనేక అక్రమాలు, అవినీతికి పాత్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. కలప అక్రమార్కులకు అండగా నిలుస్తూ.. ఇష్టారాజ్యంగా రవాణాకు సంబంధించిన పత్రాలను జారీ చేస్తున్నారని తెలుస్తోంది. ఖాళీ అనుమతి పత్రాలపై సంతకం చేసి, సీల్ వేసి జారీ చేయడం అక్రమార్కులకు ఊతం ఇస్తోంది. దీన్ని బట్టి అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు ఇచ్చిన బిల్లులతో కలప అక్రమార్కులు సుబాబుల్, జామాయిల్‌తో పాటు ఇతర కలపను యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా అన్ని రేంజ్‌ల పరిధిలోని ప్రతి ఒక్క నర్సరీలో 2 లక్షల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు రూ. 16 లక్షలు కేటారుుంచారు. ఈ రెండు లక్షల మొక్కల కోసం ఎర్రమట్టిని ప్రైవేటు వారి నుంచి సేకరించాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం ప్రత్యేకంగా రూ.2 లక్షలు కేటాయించింది. అటవీ నిబంధనల ప్రకారం అటవీశాఖ కూడా అడవిలోని మట్టిని తీయాలంటే అనుమతులు ఉండాల్సిందే. లేనిపక్షంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టడానికి వీలులేదు. ఈ నిబంధనలకు తూట్లు పొడుస్తూ అటవీ సంపదను కొల్లగొడుతుండటం గమనార్హం.
ఈ విషయంలో లంకపల్లి డీఆర్‌వో ‘ నా అడవి.. నాఇష్టం’ అనే రీతిలో వ్యవహరిస్తూ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపణలు వస్తున్నారుు. సమీప గ్రామాల ప్రజలు సొంత అవసరాల కోసం ఇసుక, మట్టి తీసుకువెళ్తుంటే కేసులు బనాయించడంతో పాటు బెదిరించి వసూళ్లు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న లంకపల్లి డీఆర్‌వోపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే సంబంధిత డీఆర్‌వోకు మెమో ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.
తక్షణం చర్యలు తీసుకుంటాం: ప్రసాద్, ఖమ్మం డీఎఫ్‌వో
లంకపల్లి డీఆర్వోపై ఆరోపణల విషయంలో విచారణ నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఆరోపణలు నిజమైతే మెమో జారీ చేస్తాం. అటవీ నిబంధనల ప్రకారం అటవీశాఖ అవసరం కోసం కూడా అటవిలోని మట్టిని గానీ, ఇతరత్ర సంపదను కాని వాడుకోవడానికి వీల్లేదు.