ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 105 లక్షల టన్నులు | food products targeted 105 lakhs tons | Sakshi
Sakshi News home page

ఆహార ధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 105 లక్షల టన్నులు

Jul 16 2014 3:23 AM | Updated on Oct 5 2018 6:36 PM

ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకొని మొత్తం 105.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.

 2014-15 వ్యవసాయ ప్రణాళిక
 
 సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లు కలుపుకొని మొత్తం 105.04 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పండించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 2014-15 వ్యవసాయ ప్రణాళికలో ఈ లక్ష్యాన్ని పొందుపరిచింది. ఖరీఫ్‌లో 66.37 లక్షల టన్నులు, రబీలో 38.55 లక్షల టన్నులు ఆహారధాన్యాలు పండించాలని పేర్కొంది. రెండు సీజన్లలోనూ  64.75 లక్షల టన్నుల బియ్యం, 32.38 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి సాధించాలని నిర్ణయించారు. మొత్తంగా గతేడాది కంటే ఆహారధాన్యాల ఉత్పత్తి 10 లక్షల టన్నులు అధికంగా ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ఇంకా నిర్ణయించనప్పటికీ విభజనకు ముందు తెలంగాణకు నాబార్డు ప్రతిపాదించిన  మేరకు రూ. 23,397.63 కోట్ల పంట రుణాలు, రూ. 4,565.58 కోట్ల టర్మ్ రుణాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే లక్షలోపు వడ్డీ రుణాలు రూ. 200 కోట్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను కూడా విడుదల చేశారు.

 తెలంగాణలో సాగయిన భూమి 14 లక్షల హెక్టార్లే...
 
 ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఈ సీజన్‌లో మొత్తం  40.37 లక్షల హెక్టార్లలో భూమి సాగవ్వాల్సి ఉండగా, ఇప్పటివరకు కేవలం 14 లక్షల హెక్టార్లు మాత్రమే సాగయినట్లు వెల్లడైంది. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా వ్యవసాయధికారులు ఈ మేరకు తెలిపారు.
 
 ఏపీలో ఇప్పటికి సాగయ్యింది పదిశాతమే!
 
 రుతుపవనాల జాప్యంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా సాగుబడి మందకొడిగా సాగుతోంది. రాష్ట్రంలోని మొత్తం వ్యవసాయ భూమిలో ఇప్పటికి పది శాతం విస్తీర్ణంలోనే సాగు మొదలైంది. కర్నూలు మినహా మరెక్కడా పొలాలు పదును కాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement