శ్రీశైలంలో గుర్రపు డెక్క..! | Flood coming from Krishna and Tungabhadra rivers | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో గుర్రపు డెక్క..!

Oct 21 2017 3:52 AM | Updated on Aug 1 2018 3:59 PM

Flood coming from Krishna and Tungabhadra rivers - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి వస్తున్న వరద నీటిలో ఈసారి గతంలో ఎన్నడూ లేనివిధంగా శ్రీశైలం జలాశయంలోకి గుర్రపు డెక్క (బుడగ తామర తీగ) వచ్చి చేరుతోంది. దీంతో డ్యామ్‌ అధికారులు ఆందో ళన చెందుతున్నారు. డ్యామ్‌ సగభాగం మేర గుర్రపు డెక్క.. శ్రీశైలం జలాశయం నుంచి ఇటీవల 8 గేట్ల ద్వారా నీటిని నాగార్జునసాగర్‌కు వదిలినా కదలడం లేదు.

మరోపక్క శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తిన సమయంలో గుర్రపు డెక్క కింద నుంచి నీరు వెళ్లిపోతున్నా.. నీటి పైన తేలిన ఇది అడుగు కూడా జరగకపోవడం గమనార్హం. జలాశయం చరిత్రలోనే తొలిసారిగా గుర్రపుడెక్క రావడాన్ని చూస్తున్నామని డ్యామ్‌ పరీవాహక ప్రాంతాల మత్స్యకారులు అంటున్నారు. దీనివల్ల వలలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మత్స్యకారులు.. జలాశయం భద్రత దృష్ట్యా తిరిగే మరబోట్లు, పుట్టీలకు గుర్రపు డెక్క అడ్డంకిగా మారిందని అధికారులు చెబుతున్నారు.

జల విద్యుత్‌ ఉత్పత్తికి వినియోగించే నీటి ప్రవాహంలోకి గుర్రపు డెక్క వెళ్తే ఇబ్బంది ఎదురవుతుందేమోనని జెన్‌కో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆనకట్ట గేట్లు ఎత్తిన సమయంలో గేట్ల రబ్బర్‌ సీల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో గుర్రపు డెక్క ఆగితే గేట్లు దించే సమయంలో.. నీటి లీకేజీకి కారణమవుతుందని అధికారులు చెబుతున్నారు. గుర్రపు డెక్కను సకాలంలో తొలగించకపోతే కేవలం పది రోజుల్లోనే ఇది మరింతగా పాకిపోతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.  

విద్యుదుత్పత్తికి ఆటంకం కలిగితే చర్యలు
శ్రీశైలం జలాశయంలో గుర్రపు డెక్క పేరుకుపోయిన విషయమై శ్రీశైలం భూగర్భ విద్యుత్‌ కేంద్రం చీఫ్‌ ఇంజినీర్‌ సురేష్‌ మాట్లాడుతూ ప్రస్తుతానికి విద్యుదుత్పత్తికి ఇబ్బంది కలగడం లేదని తెలిపారు. గతంలో జూరాలలో ఇదే సమస్య తలెత్తినప్పుడు డైవింగ్‌ టీమ్‌ను రప్పించి తొలగించామని చెప్పారు.

గుర్రపు డెక్క వల్ల జలాశయం నుంచి ఇన్‌టేక్‌ సొరంగం ద్వారా విద్యుదుత్పత్తి కోసం వచ్చే నీటి ప్రవాహానికి (నీటి ఫోర్స్‌) ఆటంకం కలిగితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయమై శ్రీశైలం ఆనకట్ట ఎస్‌ఈ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ శ్రీశైలం జలాశయంలోని గుర్రపు డెక్కను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement