
శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
సాక్షి, నెట్‌వర్క్: జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం వస్తున్న నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టినా...ప్రస్తుత వర్షాలతో వాటర్ క్యాచ్‌మెంట్ ఏర్పడటంతో శ్రీశైలం ప్రాజెక్టు మరో గేట్‌ను ఎత్తారు. జూరాల నుంచి 39,746, సుంకేశుల నుంచి 36,975 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శ్రీశైలం ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి స్పిల్‌వే ద్వా రా 54,956 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 883.7 అడుగుల నీటిమట్టం వద్ద 208.2841 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
నాగార్జునసాగర్‌కు పెరిగిన వరద: ఎగువన కృష్ణానది నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద పెరిగింది. మొత్తంగా 1,21,967 క్యూసెక్కుల నీరు సాగర్‌కు వస్తోంది. నాగార్జునసాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 573 అడుగులకు (264 టీఎంసీలు) చేరింది.
దుందుబి జోరు.. డిండిలోకి నీరు
నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద భారీగా వస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షానికి తోడు కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా వస్తున్న నీటితో దుందుబి వాగు దిగువకు పరవళ్లు తొక్కుతోంది.
కడెం ప్రాజెక్టు గేటు ఎత్తివేత
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు గేటు బుధవారం రాత్రి ఎత్తారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులుగా, ప్రస్తుతం 695.100 అడుగుల మేర నీరు ఉంది.