
విజయపురిసౌత్, శ్రీశైలం ప్రాజెక్ట్, ఏలూరు, హోళగుంద: ఈ ఏడాది కృష్ణా పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట, కర్ణాటకలలో కురిసిన భారీ వర్షాలకు ముందస్తుగానే జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. ఆల్మట్టి నుంచి శ్రీశైలం జలాశయం వరకు గల జలాశయాలు గత వారంలోనే గరిష్ట స్థాయి మట్టాలకు చేరాయి. అదనంగా వచ్చే వరదనంతటినీ శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలానికి 1,98,920 క్యూసెక్కుల మేర వరద పెరగడంతో సోమవారం నాలుగు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి 1,08,260 క్యూసెక్కుల వరదనీటిని దిగువకు వదులుతున్నారు.
కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 66,896 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 312 టీఎంసీలు కాగా, వరద పోటెత్తడంతో ప్రస్తుతం 297 టీఎంసీలకు చేరింది. అలాగే, తుంగభద్రకు సోమవారం వరద పోటెత్తడంతో జలాశయంలోని నీరు 1,07,500 క్యూసెక్కులకు చేరుకుంది.పోలవరానికి గోదావరి ఉధృతి కొనసాగడంతో స్పిల్‌వే 31 మీటర్ల ఎత్తు నుంచి 6,60,977 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ముంపు మండలమైన వేలేరుపాడులో ఎద్దులవాగు వంతెన నీట మునగడంతో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.