అక్కడ పార్క్‌చేస్తే రూ.5 వేలు ఫైన్‌

Five Thousend Challan on No Parking in Medchal - Sakshi

నో పార్కింగ్‌ ఏరియాల్లో వాహనాలు నిలిపేవారికి

జరిమానా విధించాలన్న కలెక్టర్‌  

సాక్షి, మేడ్చల్‌జిల్లా: నో పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలు నిలిపిన వారికి రూ.5 వేలు జరిమానా విధించాలని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తక్షణమే నోపార్కింగ్‌ సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీశాఖ సిబ్బంది నో పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలు నిలపకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జిల్లా అధికారులతో ఆయన  సమీక్ష సమావేశం నిర్వహించారు. నేర ప్రవృత్తి కలిగిన వారి పట్ల పోలీసులు నిరంతరం నిఘా పెట్టాలని కలెక్టర్‌ సూచించారు. అసాంఘిక శక్తులకు నిలయంగా ఉన్న అడ్డాలను గుర్తించి పోలీసు వ్యవస్థను పటిష్టపరచాలన్నారు. పోలీసు పెట్రోలింగ్‌ కూడా నిరంతరంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలు, ప్రార్థన మందిరాలు, ఖాళీ స్థలాల వద్ద మద్యం తాగకుండా ఉండేలా ఎక్సైజ్‌శాఖ నిఘా పెట్టాలన్నారు. స్కూళ్లలో  విద్యార్థులకు స్వీయరక్షణపై ఉపాధ్యాయులు, ఇళ్లల్లో తల్లిదండ్రులు బోధన చేయాలన్నారు. శంషాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్‌ లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ‘దిశ’ తహసీల్దార్‌ విజయారెడ్డి, అటెండర్‌ చంద్రయ్య  ఘటనలను ప్రస్తావిస్తూ, వారికి నివాళులర్పించారు. ప్రతి మహిళ స్వీయరక్షణ, ఆత్మస్థయిర్యం పెంపొందించుకోవాలన్నారు. గృహహింస, పనిచేసేచోట,  లైంగిక, వరకట్నం వేధింపుల నుంచి రక్షణ పొందటానికి మహిళలు 181 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయాలన్నారు. ఆపదలో ఉన్న పిల్లల కోసం 1098 టోల్‌ఫ్రీ నంబరును సంప్రదించాలన్నారు. 

నాటిన ప్రతి మొక్కనుబతికించాలి
హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. చనిపోయిన మొక్క స్థానంలో మరో మొక్కను నాటాలన్నారు. మొక్కలు నాటటం, వాటిని కాపాడటం ఒక దైవంగా భావించాలన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తమ పరిధిలోని ప్రతి మొక్కను బతికించాలన్నారు. శానిటేషన్, పరిశుభ్రత, రోడ్ల మరమ్మతులను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పనులు చేపట్టాలన్నారు. విద్యుదాఘాతంతో మరణించిన పశువులకు నష్టపరిహారాన్ని సంబంధిత రైతులకు అందించాలన్నారు. ఈ సమావేశంలో జేసీ విద్యాసాగర్, డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top