‘సప్త సముద్రాలకు’ పునరుజ్జీవం!

First fruits of the mission Kakatiya - Sakshi

వనపర్తి గొలుసుకట్టు చెరువులకు జలకళ

తొలి ఫలాలు అందించిన మిషన్‌ కాకతీయ

నిన్నటివరకు బీడు భూములు..నేడు కృష్ణమ్మ పరవళ్లు

గూటికి చేరుకున్న పాలమూరు వలస పక్షులు 

సాక్షి, హైదరాబాద్‌: ఆకలి చావులు.. వలసలకు నిలయం.. సాగుకు నీళ్లు లేక గోసటిల్లిన నేల. పసిపిల్లలను, పండుటాకులను వదిలేసి ఎందరో వలసలు పోగా పల్లెలు పడావు పడిన ప్రాంతం. తరతరాలుగా కరువు కాళనాగై పగబట్టినట్టు వెంటబడి తరుముతుంటే సాగు చేయలేక, జోడెద్దులను సాకలేక కబేళాలకు అమ్ముకున్న రైతన్నల కన్నీళ్లతో నిండిన నేల పాలమూరు జిల్లా. ఇప్పుడు అదే బీడు భూముల్లో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వాగులు.. వంకలు.. గొలుసుకట్టు చెరువులు.. పాడుబడ్డ కుంటలు.. సకల జల స్థావరాలను నింపుతూ నెర్రెలు బాసిన భూముల్లో జీవం నింపుతోంది. పాడుబడిన పాలమూరు జిల్లా మిషన్‌ కాకతీయ తొలి ఫలాలతో పచ్చని పంట చేనుగా మారింది. 

45 వేల ఎకరాలు.. 60 గ్రామాలు 
గొలుసుకట్టు చెరువులు అంటే మొదటగా గుర్తొచ్చేది వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే సప్త సముద్రాలు. రంగ సముద్రం, రాయ సముద్రం, కృష్ణ సముద్రం, వీర సముద్రం, గోపాల సముద్రం, మహభూపాల సముద్రం, శంకరమ్మ సముద్రం.. సప్త సముద్రాలుగా పేరెన్నికగన్నాయి. వనపర్తిని కేం ద్రంగా చేసుకుని పరిపాలనను సాగించిన నాటి రాజులు వీటిని నిర్మించారు. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ చెరువులకు గతంలో ఆదరణ కరువైంది. పాడుబడిన పాలమూరులో నీళ్లు పారిస్తామని ఉద్య మ సమయంలోనే హరీశ్‌రావు హామీ ఇచ్చారు.

అందుకు తగ్గట్లుగానే మిషన్‌ కాకతీయ కింద సప్త సముద్రాలను మరమ్మతు చేయించారు. 45 వేల ఎకరాలను సాగులోకి తెచ్చారు. తొలుత బీమా ఎత్తిపోతల నుంచి నీళ్లను తోడి కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 160 ఏళ్ల కిందట రాణీ శంకరమ్మ పాలనలో నిర్మించిన శంకర సముద్రాన్ని నింపారు. అటు నుంచి కృష్ణ సముద్రానికి, తర్వాత పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్‌లోని రంగ సముద్రంలోకి నీళ్లు మళ్లాయి. తర్వాత కొత్తకోట మండలం రాయణిపేట వద్ద వనపర్తి సంస్థానాధీశుల కాలంలో నిర్మించిన రాయ సముద్రాన్ని నింపారు. అటు నుంచి వనపర్తి రాజు రాజారామేశ్వరరావు వంశీయులు నిర్మించిన మహభూపాల సముద్రం చెరువును.. తర్వాత పెబ్బేరు మండలంలోని వీర సముద్రం చెరువు, పెద్దమందడి మండలంలోని గోపాల సముద్రం చెరువును నింపి 45 వేల ఎకరాలకు సాగునీరుతోపాటు 60 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారు. 

గూటికి చేరిన వలస పక్షులు 
వనపర్తి జిల్లా వలసలకు నిలయం. భూమిని పడావు పెట్టి ఊరు ఊరంతా వలస వెళ్లటం అక్కడ సర్వ సాధారణం. మిషన్‌ కాకతీయ, ఇతర పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తితో ఇప్పుడీ గ్రామాలకు నీళ్లు వచ్చాయి. ఊళ్లలోనే పని దొరుకుతుండటంతో వలసపోయిన కుటుంబాలు తిరిగి వచ్చాయి. సాగు పనుల్లో నిమగ్నమయ్యాయి. 30 ఏళ్లుగా బోసినట్లు కన్పించిన ఖానాపురం ఇప్పుడు పల్లె రూపం సంతరించుకుంది. 

వలస పోయేటోన్ని
శంకర సముద్రం నిండింది. మూడు పంటలకు నీరు పుష్కలంగా అందుతోంది. గతంలో ఏడాదిలో 10 నెలలు వలస పోయేటోన్ని. ఇప్పుడు ఊరిలోనే పొలం పనులు చేసుకుం టున్నాం.
    – నారాయణ, శ్రీరంగాపురం 

కళ్లెదుటే సుందర స్వప్నం
ఉమ్మడి రాష్ట్రంలో ‘సప్త సముద్రాలు’ ఉనికి కోల్పోయాయి. వీటిని పునరుద్ధరిస్తే వనపర్తి జిల్లాలో కరువును రూపుమాపొచ్చని కేసీఆర్‌ నాతో చెప్పారు. రికార్డు సమయంలో మరమ్మతు పూర్తి చేశాం. ఇప్పుడు ఈ సుందర స్వప్నం ఆవిష్కృతమైంది. రైతన్నల మోముల్లో చిరునవ్వు ఆనందం కలిగిస్తోంది.     
– మంత్రి హరీశ్‌రావు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top