నేడే నామినేషన్లకు చివరి రోజు

Final Day For Lok Sabha Election Nominations - Sakshi

 ఇప్పటికే 20 సెట్లు దాఖలు

 మరోసారి  బలప్రదర్శనతో నామినేషన్‌ వేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు

సాక్షి,యాదాద్రి : సార్వత్రిక సంగ్రామంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. భువనగిరి పార్లమెంట్‌ స్థానానికి ఇప్పటివరకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ మినహా మిగతా ప్రధాన పార్టీలన్నీ నామినేషన్లు వేశాయి. టీఆర్‌ఎస్‌ నుంచి బూరనర్సయ్యగౌడ్, కాంగ్రెస్‌ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పీవీ శ్యాంసుందర్‌రావు ఈనెల22న మంచి ముహూర్తం ఉండడంతో అదే రోజు నామినేషన్లు దాఖలు చేశారు.

కాగా వీరందరూ మరోసారి సోమవారం బలప్రదర్శనతో వచ్చి నామినేషన్లు వేయనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నారు. జనాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చారు. ర్యాలీలు నిర్వహిస్తున్నందున ఎన్నికల సంఘం నుంచి   అనుమతులు తీసుకున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి ఆయా పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు.

టీఆర్‌ఎస్‌ ర్యాలీకి హాజరుకానున్న మంత్రి జగదీశ్‌రెడ్డి
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్‌ ఈ నెల 22న ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నామినేషన్‌ వేశారు. కాగా అయన మరోసారి సోమవారం సుమారు 40 వేల మందితో భారీ ర్యాలీ మధ్య నామినేషన్‌ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు చెందిన ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.  భువనగిరిలోని సాయిబాబా దేవాలయంనుంచి కలెక్టరేట్‌ కార్యాలయం వరకు ర్యాలీకి ఏర్పాటు చేసినట్లు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్‌ తెలిపారు.

బీజేపీ ప్రముఖుల రాక
బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావు నామినేషన్‌ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు కానున్నారు.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుతో పాటు పలువురు   నేతలు హాజరవుతున్నట్లు పార్టీ అభ్యర్థి  శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు. 30వేల మందితో భారీ ర్యాలీ తీసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. ఉదయం 10గంటలకు భువనగిరి పట్టణంలోని సాయిబాబ దేవాలయం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు  ర్యాలీ కొనసాగుతుంది. ఇందుకోసం పార్లమెంట్‌నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతోపాటు పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.   

కాంగ్రెస్‌ ర్యాలీకి అంతా సిద్ధం
కాంగ్రెస్‌ నుంచి పోటీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యన సాయి కన్వెన్షన్‌ హాల్‌లో కార్యకర్తల సమావేశం ఉంటుందని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులన్నీ స్వచ్ఛందంగా నామినేషన్‌ కార్యక్రమానికి తరలిరావాలని bయన పిలుపునిచ్చారు. 

భారీ పోలీస్‌ బందోబస్తు
చివరి రోజున ప్రధాన పార్టీలన్నీ మరోసారి నామినేషన్‌ వేస్తుండడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అభ్యర్థుల వెంట భారీగా ఆయా పార్టీల శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో  ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీలు నిర్వహించేలా పోలీసులు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల ర్యాలీలు ఎదురెదురు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే డీసీపీ నారాయణరెడ్డి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. 

శాంతియుతంగా వ్యవహరించాలి
నామినేషన్ల చివరి రోజున రాజకీయ పార్టీలు శాంతియుతంగా వ్యవహరించాలి. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ర్యాలీగా వచ్చే వారికి వేర్వేరు సమయాలలో ర్యాలీలకు అనుమతులు ఇచ్చాం. బందోబస్తు కోసం భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్‌ ఏసీపీలు పర్యవేక్షిస్తారు. సుమారు 500 మంది  సివిల్, సాయుధ పోలీస్‌లతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రాజకీయ పార్టీల ర్యాలీని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తాం. 100 మీటర్ల నుంచి కేవలం 5 గురు సభ్యులను మాత్రమే రిటర్నింగ్‌ అధికారి వద్దకు నామినేషన్‌ వేయడానికి పంపిస్తాం. ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరుగకుండా రాజకీయ పార్టీలు సహకరించాలి. 
–నారాయణరెడ్డి, డీసీపీ  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top