breaking news
major party candidates
-
నేడే నామినేషన్లకు చివరి రోజు
సాక్షి,యాదాద్రి : సార్వత్రిక సంగ్రామంలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి ఇప్పటివరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇతర పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు 20 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ మినహా మిగతా ప్రధాన పార్టీలన్నీ నామినేషన్లు వేశాయి. టీఆర్ఎస్ నుంచి బూరనర్సయ్యగౌడ్, కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పీవీ శ్యాంసుందర్‌రావు ఈనెల22న మంచి ముహూర్తం ఉండడంతో అదే రోజు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా వీరందరూ మరోసారి సోమవారం బలప్రదర్శనతో వచ్చి నామినేషన్లు వేయనున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి భారీ జన సమీకరణ చేస్తున్నారు. జనాన్ని తరలించేందుకు వాహనాలను సమకూర్చారు. ర్యాలీలు నిర్వహిస్తున్నందున ఎన్నికల సంఘం నుంచి అనుమతులు తీసుకున్నారు. నామినేషన్ కార్యక్రమానికి ఆయా పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు. టీఆర్ఎస్ ర్యాలీకి హాజరుకానున్న మంత్రి జగదీశ్‌రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ ఈ నెల 22న ఉమ్మడి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నామినేషన్ వేశారు. కాగా అయన మరోసారి సోమవారం సుమారు 40 వేల మందితో భారీ ర్యాలీ మధ్య నామినేషన్ వేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, గొంగిడిసునీతామహేందర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. భువనగిరిలోని సాయిబాబా దేవాలయంనుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీకి ఏర్పాటు చేసినట్లు టీఆర్ఎస్ అభ్యర్థి బూరనర్సయ్యగౌడ్ తెలిపారు. బీజేపీ ప్రముఖుల రాక బీజేపీ అభ్యర్థి పీవీ శ్యామ్‌సుందర్‌రావు నామినేషన్ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు ప్రముఖ నేతలు కానున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావుతో పాటు పలువురు నేతలు హాజరవుతున్నట్లు పార్టీ అభ్యర్థి శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు. 30వేల మందితో భారీ ర్యాలీ తీసేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసుకుంది. ఉదయం 10గంటలకు భువనగిరి పట్టణంలోని సాయిబాబ దేవాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగుతుంది. ఇందుకోసం పార్లమెంట్‌నియోజకవర్గం పరిధిలోని ముఖ్యనేతలతోపాటు పార్టీ శ్రేణులను తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాంగ్రెస్ ర్యాలీకి అంతా సిద్ధం కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మద్దతుగా భారీ ర్యాలీకి ఏర్పాట్లు చేశారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసమీకరణ చేస్తున్నారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యన సాయి కన్వెన్షన్ హాల్లో కార్యకర్తల సమావేశం ఉంటుందని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పార్టీ శ్రేణులన్నీ స్వచ్ఛందంగా నామినేషన్ కార్యక్రమానికి తరలిరావాలని bయన పిలుపునిచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు చివరి రోజున ప్రధాన పార్టీలన్నీ మరోసారి నామినేషన్ వేస్తుండడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. అభ్యర్థుల వెంట భారీగా ఆయా పార్టీల శ్రేణులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో ర్యాలీలు నిర్వహించేలా పోలీసులు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆయా పార్టీల ర్యాలీలు ఎదురెదురు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే డీసీపీ నారాయణరెడ్డి పోలీసు అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. శాంతియుతంగా వ్యవహరించాలి నామినేషన్ల చివరి రోజున రాజకీయ పార్టీలు శాంతియుతంగా వ్యవహరించాలి. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించినా చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటాం. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ర్యాలీగా వచ్చే వారికి వేర్వేరు సమయాలలో ర్యాలీలకు అనుమతులు ఇచ్చాం. బందోబస్తు కోసం భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ ఏసీపీలు పర్యవేక్షిస్తారు. సుమారు 500 మంది సివిల్, సాయుధ పోలీస్‌లతో బందోబస్తు ఏర్పాటు చేశాం. రాజకీయ పార్టీల ర్యాలీని రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 500 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తాం. 100 మీటర్ల నుంచి కేవలం 5 గురు సభ్యులను మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు నామినేషన్ వేయడానికి పంపిస్తాం. ఎలాంటి అవాంచనీయ సంఘటలను జరుగకుండా రాజకీయ పార్టీలు సహకరించాలి. –నారాయణరెడ్డి, డీసీపీ -
ప్రలోభాలు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : పోలింగ్ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపుతున్నారు. పెద్ద మొత్తంలో డబ్బు, మద్యాన్ని పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రచారానికి ఒకరోజే గడువు ఉంది. ఈనెల 28న సాయంత్రం 5గంటలతో ప్రచార పర్వం ముగియనుంది. పోలింగ్‌కు కేవలం మూడు రోజులే ఉండడంతో ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన అభ్యర్థులు ఇకపై ప్రలోభాలపై దృష్టి సారించారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు పలుచోట్ల బహిరంగ సభలు, రోడ్‌షోలు నిర్వహించారు. తమ బలాన్ని చాటేందుకు ఈ సభలకు, రోడ్‌షోలకు భారీ సంఖ్యలో జనాన్ని తరలించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించారు. పోలింగ్ దగ్గర పడడంతో నాలుగు ఓట్లు రాల్చుకునేందుకు ఇప్పుడు పడరాని పాట్లు పడుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కులసంఘాలు, యువజన, మహిళ సంఘాల్లో కీలకంగా పనిచేసే వారి ద్వారా పంపిణీ వ్యవహారాలను నడుపుతున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.1000 వరకు.. గెలుపే లక్ష్యంగా ఒక్కో ఓటరుకు రూ.500 నుంచి రూ.వెయ్యి రకు పంపిణీ చేసేందుకు కూడా కొందరు అభ్యర్థులు వెనుకాడటం లేదు. నగదుతో పాటు మహిళలకు చీరల పంపిణీపై దృష్టి సారించారు. గంపగుత్తగా మహిళల ఓట్లు పొందేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. తాము గెలిస్తే కులసంఘాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని హామీలు ఇవ్వడంతో పాటు, ముందస్తుగానే కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లోని ఆయా కులసంఘాల పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. యువజన సంఘాలకు కూడా డబ్బులు ఏరవేస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఆయా సంఘాల కొందరు నాయకులు నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరి వద్ద తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మరోవైపు పోలింగ్‌కు ఒకట్రెండు రోజుల ముందు ఓటర్లను మద్యం మత్తులో ముంచేందుకు సన్నద్ధమవుతున్నారు. మద్యం దుకాణదారులతో నేరుగా ఒప్పందాలు చేసుకొని ఆయా మద్యం షాపులకు వచ్చిన మద్యం నిల్వల్లోని కొంత భాగాన్ని గ్రామాలకు తరలిస్తున్నారు. రహస్య ప్రాంతాల్లో మద్యం రహస్య ప్రదేశాల్లో నిల్వ ఉంచి అక్కడినుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌కు భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తనిఖీలు, చెక్‌పోస్టుల పేరుతో హడావిడి చేస్తున్న అధికారులు అభ్యర్థుల ప్రలోభాలను ఏమాత్రం అరికట్ట లేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ పౌరుల వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు వ్యక్తిగత, వ్యాపార అవసరాల కోసం తరలిస్తున్న డబ్బును మాత్రం పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. కానీ అభ్యర్థులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసుకుంటున్న సొమ్మును మాత్రం పట్టుకోలేక పోతున్నారనే విమర్శలున్నాయి.