8,9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

Fih Prasadam Distribution on June 8 And 9th Nampally - Sakshi

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాట్లు

పనులను పరిశీలించిన మంత్రి తలసాని

గన్‌ఫౌండ్రీ: మృగశిర కార్తె సందర్భంగా ఈ నెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిన సోదరుల ఆధ్వర్యంలో ఆస్తమా రోగులకు ఉచిత చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల నుంచి చేప ప్రసాదం కోసం ఆస్తమా బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేందుకు అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గత 173 ఏళ్లుగా బత్తిన కుటుంబం రోగులకు ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేఐస్తుండటంతో అభినందనీయమన్నారు. జూన్‌ 8న  సాయంత్రం నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రసాదం కోసం వచ్చే ప్రజల సౌకర్యార్థం రూ.5 భోజనం కౌంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వేసవి తీవ్ర దృష్ట్యా అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు వీలుగా వీల్‌ చైర్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ మాట్లాడుతూ...చేపప్రసాదం పంపిణీ కార్యక్రమానికి  జీహెచ్‌ఎంసీ తరపున అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 100 మొబైల్‌ టాయిలెట్లను ఏర్పాటు చేయడమే కాకుండా పారిశుద్ధ్య నిర్వాహణకు 3 షిప్ట్‌లుగా 100 మంది చొప్పున సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. మెట్రో వాటర్‌బోర్డు తరపున మంచినీటి ప్యాకెట్లను సరఫరా చేస్తామన్నారు. నగర అడిషనల్‌ కమిషనర్‌ డిఎస్‌.చౌహాన్‌ మాట్లాడుతూ... మే ఐ హెల్ప్‌ కేంద్రాలతో పాటు పూర్తిస్థాయిలో సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. చేప ప్రసాద పంపిణికి అవసరమైన సుమారు 1.60 లక్షల చేపపిల్లలను సిద్ధం చేసినట్లు మత్స్యశాఖ కమిషనర్‌ సువర్ణ పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ బొంతు రామ్మోహన్, హైదరాబాద్‌ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవి, బత్తిన హరినాథ్‌గౌడ్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top