డబ్బులు తీసుకున్నారు..   పుస్తకాలివ్వలేదు..

Farmers Resentment Against Revenue Officials for not Giving Pass Books - Sakshi

తల్లాడ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన  

అన్నారుగూడెం వీఆర్వోను నిర్బంధించిన రైతులు 

తల్లాడ: పట్టాదారు పాసు పుస్తకాలకు చలాన తీయాలని రైతుల వద్దనుంచి పెద్ద మొత్తంలో రెవెన్యూ సిబ్బంది డబ్బులు తీసుకొని పాసు పుస్తకాలివ్వకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద శుక్రవారం రైతులు ధర్నా నిర్వహించారు. ఇక్కడి ఆర్‌ఐలు ప్రసన్న, శ్రీనివాస్‌లు బదిలీ అయ్యారు. విషయం తెలుసుకున్న తల్లాడ, అన్నారుగూడెం, మల్లారం, కుర్నవల్లి, మిట్టపల్లి, బిల్లుపాడు, గోపాలపేట, కొత్త వెంకటగిరి, బాలపేట, నూతనకల్, పినపాక గ్రామాలకు చెందిన రైతులు తహసీల్‌కు చేరుకున్నారు. కార్యాలయానికి తహసీల్దార్‌ డీఎస్‌.వెంకన్న, ఆర్‌ఐలు ప్రసన్న, శ్రీనివాస్‌లు రాక పోవటంతో.. రైతులు ఆందోళనకు దిగారు. వచ్చే వరకు కదలబోమని భీష్మించారు. అన్నారుగూడెం వీఆర్‌ఓ నాగేశ్వర్‌రావు కార్యాలయానికి రాగా రైతులు ఆయన్ను చుట్టుముట్టి ఆర్‌ఐల గదిలో ఉంచి తలుపులు వేసి నిర్బంధించారు. చలాన పేరుతో డబ్బులు తీసుకొని పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నట్లు వాపోయారు. తహసీల్దార్‌కుకు రైతులు ఫోన్‌ చేయగా.. తాను ఖమ్మంలో మీటింగులో ఉన్నానని, సమస్యను పరిష్కరిస్తామని, ఆందోళన చేయవద్దని చెప్పారు. దీంతో రైతులు ఇద్దరు ఆర్‌ఐలు, వీఆర్‌ఓలపై తల్లాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది సివిల్‌ మ్యాటర్‌ అని కలెక్టర్, ఆర్డీఓలకు ఫిర్యాదు చేసుకోవాలని ఎస్‌.ఐ. వరాల శ్రీనివాస్‌ సూచించారు. దీంతో కొందరు రైతులు కల్లూరు ఆర్డీఓ శివాజీకీ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

 ఎకరానికి రూ.5 వేల నుంచి 25 వేల వరకు వసూళ్లు  
తల్లాడ రెవెన్యూ సిబ్బంది పట్టాదారు పాసు పుస్తకాల్లో రైతుల పేర్లు నమోదు చేసేందకు, 1బీ ఖాతాలో పేరు చేర్చేందుకు ఎకరానికి రూ.5 వేల నుంచి రూ.25 వేల వరకు చలానా పేరుతో వసూలు చేసినట్లు రైతులు పేర్కొన్నారు. గత మూడేళ్లలో లక్షలాది రూపాయలు మామూళ్లు తీసుకొని పాసు పుస్తకాలివ్వకుండా తిప్పుకుంటున్నారని ఆరోపించారు. ఆర్‌ఐలు ఇద్దరు బదిలీ అవ్వటం వల్ల ఇప్పుడు తమ భూములు ఎవరు ఆన్‌లైన్‌ చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. వీఆర్‌ఓలు, ఆర్‌ఐలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top