మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు
మెదక్ : మెదక్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం రాత్రి మెదక్ జిల్లాలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో కురిసిన భారీ వర్షంతో.. సాగులో ఉన్న జొన్న, మొక్కజొన్న పంటలు కొంత మేర దెబ్బతిన్నాయి. జహీరాబాద్ మండలంలో 2.7 సెం.మీ, కోహీర్ మండలంలో 7.6 సెం.మీ, ఝరాసంగం మండలంలో 6.2 సెం.మీ, న్యాల్‌కల్ మండలంలో 7.7 సెం.మీ వర్షం కురిసింది. వర్షం కారణంగా కూరగాయలు, పండ్ల తోటలకు కూడా కొంత మేర నష్టం వాటిల్లింది. పిందె దశలో ఉన్న మామిడి తోటలు కూడా దెబ్బతిన్నాయి.
కాగా భారీ వర్షం కారణంగా జహీరాబాద్ పట్టణంలోని పలు రోడ్లపై నీరు నిలిచి రాక పోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలకు నష్ట పరిహారం ప్రకటించాలని రైతులు కోరుతున్నారు.