అప్పులే కాటికి పంపాయి.. | farmers dead due to debts | Sakshi
Sakshi News home page

అప్పులే కాటికి పంపాయి..

Dec 7 2014 12:20 AM | Updated on Sep 2 2017 5:44 PM

అప్పులే కాటికి పంపాయి..

అప్పులే కాటికి పంపాయి..

వరుణుడు కరుణ చూపకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయి.

కంగ్టి : వరుణుడు కరుణ చూపకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పంటలు ఎండిపోయాయి. కుమారులకు వివాహాలు చేయడంతో వారు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. ఇప్పటికే పంటపెట్టుబడులు, కుటుంబ అవసరాలకు సుమారు రూ. 4 లక్షల మేర అప్పు చేశాడు. ఈ పరిస్థితుల్లో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురైన ఆ అన్నదాతకు గుండెపోటుతో మృతి చెందాడు. ఈసంఘటన మండలంలోని నాగూర్ (బీ) గ్రామంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి..  గ్రామానికి చెందినచిన్న కారు రైతు గాళప్ప (62) రైతుకు ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల అసైన్డ్ భూమిలో వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతడికి భార్య గంగమ్మతో పాటు ఆరుగురు కుమారులు, ఓ కుమార్తె ఉంది. వీరిలో నలుగురు కుమారులకు వివాహాలు చేయడంతో వారు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. కుమార్తె సంతోషి పెళ్లీడుకొచ్చింది. గడిచిన రెండేళ్లలో చేసిన అప్పు వడ్డీతో సహా మొత్తం రూ.4 లక్షలు అయింది. గత ఖరీఫ్‌లో వేసిన పంటలు కూడా చేతికందలేదు.

కంగ్టిలో బ్యాంకులో అప్పు తీసుకుందామని దరఖాస్తుతో పాటు పహణి, చౌపాస్లా రికార్డులు సమర్పించాడు. సకాలంలో బ్యాంకు రుణం అందక పోవడం, రుణ దాతలు అప్పులు కట్టాలని ఒత్తిళ్లు చేశారు. ఈ బాధలు భరించలేక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పుకుని బాధపడ్డాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తరువాత గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో భార్య, పిల్లలు గుండెలివిసేలా రోదించారు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో పెళ్లీడుకొచ్చిన కుమార్తె సంతోషి భవిష్యత్, చిన్న వయస్సులో ఉన్న మరో ఇద్దరు కుమారులు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. నిరుపేద కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీటీసీ తిప్పప్ప, గ్రామస్తులు కోరుతున్నారు.
 
ధర్మాజీపేటలో రైతు ఆత్మహత్య
దుబ్బాక : తీవ్ర వర్షాభావ పరిస్థితులు.. వేసిన నాలుగు బోర్లలో చుక్క నీరు రాక.. విద్యుత్ కోతలతో కళ్ల ముందే ఎండిపోయిన పంటలు.. వెరసి వీటికి చేసిన అప్పులు తీర్చే మార్గంలేక యువరైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దుబ్బాక నగర పంచాయతీ ధర్మాజీపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బుంగ కనకయ్య (35)కు నాలుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో గత వర్షాకాలంలో రెండెకరాల్లో మొక్కజొన్న వేయగా వర్షాభావంతో చేతికొచ్చే పంట పూర్తిగా ఎండిపోయింది. మరో రెండెకరాల్లో వరి పంట వేశాడు.

ఈ పంటను దక్కించుకోవడానికి నాలుగు బోర్లు వేశాడు. వీటిలో చుక్క నీరు రాలేదు. పంటలకు పెట్టిన పెట్టుబడి, బోర్లకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కలతచెందాడు. దీంతో శనివారం తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకుని తనువు చాలించాడు. పొస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కవిత, కుమారుడు వంశీ(3), వృద్ధులైన తల్లిదండ్రులు నాగవ్వ, రాములు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement