పడిపోతున్న పత్తి ధర

Falling Cotton Prices in dist - Sakshi

బేళ్ల ధరకు ఎఫెక్ట్‌

క్వింటాల్‌కు రూ.230 తగ్గిన ధర

రైతుల్లో అయోమయం

జమ్మికుంట(హుజూరాబాద్‌): కొత్త సంవత్సరం తెల్లబంగారం ధర పడిపోతోంది.   డిసెంబర్‌ చివరి వారం పలికిన ధరలకు భిన్నంగా ధరలు పడిపోతున్నాయి. దీంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్‌ పత్తికి రూ.5 వేల ధర పలుకగా రైతుల్లో ఆవేదన వ్యక్తం అవుతోంది. పత్తి మార్కెట్‌లో సోమవారం  వివిధ ప్రాంతాల నుంచి లూజ్‌ పత్తి 1073 క్వింటాళ్లు అమ్మకానికి రాగా వ్యాపారులు ఉదయం వేలం పాట నిర్వహించి క్వింటాల్‌ పత్తికి రూ.5వేల ధర గరిష్టంగా చెల్లించారు. కనిష్ట ధర రూ.4300, మోడల్‌ ధర రూ.4900 నిర్ణయించారు. దీంతో గత వారం పలి కిన క్వింటాల్‌కు రూ.5230కి సోమవారం పలికిన ధరలో రూ.203 తగ్గడంతో రైతులు ఆందోళన చెందారు.

పతనానికి కారణం ఇదే
దేశవ్యాప్తంగా పత్తి దిగుబడి ఎక్కువగానే ఉందని వారంక్రితం ముంబాయిలో కాటన్‌ అడ్వజర్‌ బోర్డులో వెల్లడికావడంతో దేశంలో పత్తి కొనుగోళ్లపై భారంపడింది. కేవలం దేశంలో తెలంగాణ, మహారాష్ట్రల్లో తప్పా అన్నిరాష్ట్రాల్లో పత్తి అధికంగా పండిందని సీఏబీలో చర్చించడంతో పత్తి కొనుగోళ్లపై ప్రభావం పడినట్లు వ్యాపారవర్గాలు వెల్లడిస్తున్నాయి. వారంక్రితం క్యాండి ధర రూ.43 వేల 500 వరకు పలుకగా శుక్రవారం అదే క్యాండి రూ.41 వేల 500 పడిపోయింది. రూ.2 వేలు డిమాండ్‌ పడిపోవడంతో క్వింటాల్‌ పత్తి రూ.5230 నుంచి రూ.5వేలకు పతనమైంది. అదే విధంగా పత్తి గింజల ధర సైతం క్వింటాల్‌కు రూ.2200 వరకు పలుకగా ప్రస్తుతం 2 వేలకు పడిపోయినట్లు వ్యాపారవర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగానే మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ తగ్గిపోతుందని వ్యాపారులు చెబుతున్నారు. ఎగుమతిదారులు బేళ్ల ధరలు తగ్గిస్తున్నారనే వివరిస్తున్నారు.

కమర్షియల్‌కు స్టెబుల్‌ మెలిక
సీసీఐ రంగ సంస్థ ఈ సీజన్‌లో రైతుల నుంచి పత్తిని కమర్షియల్‌ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ఈ విధానంతో కొనుగోలు చేసేందుకు సీసీఐ ఆసక్తి చూపే పరిస్థితి లేదు. వ్యాపారులతో వేలం పాటకు సీసీఐ పాట పాడే అవకాశం ఉన్నా స్టెబుల్, మైక్‌ నిబంధనలతో కొనుగోలుకు దూరంగా ఉంటుంది. జమ్మికుంట పత్తి మార్కెట్‌కు వచ్చే పత్తిలో స్టెబుల్‌ 30 ఎంఎం ఉంటేనే సీసీఐ కమర్షియల్‌ పర్చేస్‌ చేస్తుంది. అయితే జమ్మికుంటకు వచ్చే పత్తిలో స్టెబుల్‌ 28 ఎంఎం నుంచి 29, 29.5 మాత్రమే ఉంటుంది. 30 ఎంఎం ఉంటేనే సీసీఐ కొనుగోలు చేయాలని సంస్థ నిబంధనలు విధించడంతో జమ్మికుంట పత్తి మార్కెట్‌లో ఈసారి సీసీఐ కమర్షియల్‌ కొనుగోలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పత్తి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్న క్రమంలో సీసీఐ వ్యాపారులతో పోటీపడి ధరలు నిర్ణయిస్తే రైతులకు లబ్ధి జరిగే అవకాశాలు ఉండగా స్టెబుల్‌ నిబంధనలు అడ్డంకిగా మారినట్లు తెలుస్తోంది.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top