దశలవారీగా ఎత్తేయడమే మంచిది!

Exclusive Interview With Consultant Pulmonologist Dr Avinash Gade - Sakshi

లాక్‌డౌన్‌పై ‘సాక్షి’తో కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ అవినాశ్‌ గాదె

తెలంగాణలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు భేష్‌

అందరికీ పరీక్షలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేం లేవు

పాజిటివ్‌ కేసులు ఎప్పుడు జీరో అవుతాయో ఇప్పుడే చెప్పలేం..

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడమే మంచిది. లేకపోతే ఇప్పటివరకు లాక్‌డౌన్‌ అమలు ద్వారా సాధించిన ప్రయోజనాలు కొంతమేర దెబ్బతినే అవకాశముంది’అని కన్సల్టెంట్‌ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ అవినాశ్‌ గాదె అభిప్రాయపడ్డారు. వచ్చే నెల 7 తర్వాత ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ఎత్తేయడం వల్ల ప్రజలంతా రోడ్ల మీదకు రావడం, పెద్దసంఖ్యలో గుమిగూడడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంలో భాగంగా కొన్ని రంగాలకు పరిమితంగా అవకాశమిచ్చి, వచ్చే ఫలి తాలు, కొత్తగా వచ్చే కేసుల సంఖ్యను బట్టి మరి కొన్ని రంగాలకు మినహాయింపునివ్వాలని సూచిం చారు. మాల్స్, సినిమాహాల్స్‌తో పాటు మతపరమైన కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని, ఏమాత్రం వెసులుబాటునిచ్చినా సమస్య పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. ఇంకా వివిధ అంశాలపై ‘సాక్షి’తో మాట్లాడుతూ డాక్టర్‌ అవినాశ్‌ వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

పెద్దసంఖ్యలో పరీక్షలు అవసరం లేదు..
కరోనా విషయంలో రాష్ట్రంలో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలు మంచి ఫలితాలనిచ్చాయి. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ఈ వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. లక్షణాలు లేకుండా పెద్దసంఖ్యలో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల పెద్దగా సాధించే ప్రయోజనం ఏమీ ఉండదు. హాట్‌స్పాట్స్, రెడ్‌జోన్స్‌లోని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తే వైరస్‌ వ్యాప్తి, తీవ్రత ఏ మేరకు, ఎంత ఉన్నాయనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాజిటివ్‌ కేసులు పెరిగిన పక్షంలో వాటిని దాచిపెట్టే అవకాశం ఉండదు. పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రికి రాకపోతే ప్రైవేట్‌ హాస్పిటల్‌కైనా చికిత్స కోసం వెళ్లక తప్పదు. ఇప్పటివరకు ప్రైవేట్‌ ఆసుపత్రులకు ఇలాంటి కేసులు వచ్చిన దాఖలాల్లేవు. ఇకపోతే మన దగ్గర లాక్‌డౌన్‌ అమలు బాగానే ఉంది. దీనిద్వారా మంచి ఫలితాలే సాధించాం.

వైరస్‌ వ్యాప్తి ఎంతకాలమో చెప్పలేం..
తెలంగాణలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణలోనే ఉందని చెప్పాలి. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు బాగున్నాయి. వైరస్‌ వ్యాప్తి ఇంకెంత కాలం ఉంటుందో స్పష్టంగా చెప్పలేం. మరికొన్ని నెలల పాటు ఈ సమస్య కొనసాగుతుంది. వైరస్‌ వ్యాప్తి, పాజిటివ్‌ కేసులు బయటపడడం వంటివి ఇప్పటికిప్పుడు తగ్గిపోయే అవకాశం లేదు. ఇన్నిరోజులకు అసలు కేసులే లేకుండా పోతాయని చెప్పడానికి లేదు. కాబట్టి మాస్క్‌లు, శానిటైజర్లు, మనుషుల మధ్య దూరం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి చర్యలను కొనసాగించాలి. మరికొన్ని రోజుల తర్వాత కూడా అప్పుడప్పుడు, అక్కడక్కడ పాజిటివ్‌ కేసులు బయటపడే అవకాశాలే ఎక్కువ.

ఉష్ణోగ్రతలతో కొంత మేలే..
మన దేశంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వైరస్‌ వ్యాప్తి తగ్గుతుందనేది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. ఎండలు పెరిగితే వైరస్‌ పూర్తిగా చనిపోతుందని చెప్పలేం. దగ్గితే, తుమ్మితే బయటకు వచ్చే తుంపర్లలోని వైరస్‌ కణాలు ఎండవేడిమికి కొంతమేర తగ్గే అవకాశాలు మాత్రం ఉన్నాయి. సన్‌లైట్‌.. స్టెరిలైజింగ్‌ ఏజెంట్‌గా 20–30 శాతం మేర వైరస్‌ తగ్గింపునకు దోహదపడొచ్చు.

ఆ దేశాలతో పోలిస్తే మనం మెరుగే..
అమెరికా, ఇటలీ, బ్రిటన్‌ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో పరిస్థితులు కచ్చితంగా మెరుగ్గానే ఉన్నాయి. అక్కడ వెంటిలేటర్‌ కేసుల్లో పెరుగుదల, సీరియస్‌ అవుతున్న రోగుల సంఖ్య, పెరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారతీయుల్లోని జన్యువులు, రోగనియంత్రణ శక్తి, శరీరతత్వం, ఇక్కడి వాతావరణం తదితరాలు కొంత ప్రభావాన్ని చూపుతున్నాయని చెప్పొచ్చు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top