
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యాయత్నం
మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ విజయలక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ఖమ్మం: మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ నార్ల విజయలక్ష్మీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఖమ్మం పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని రహదారిపై ఆమె శుక్రవారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. అంతలో అక్కడే ఉన్న స్థానికులు ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుని... పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అక్కడికి చేరుకుని... నార్ల విజయలక్ష్మిని ఇంటికి తరలించారు.
గత కొంత కాలంగా విజయలక్ష్మీకి ఆమె సోదరుడు, స్థానిక వ్యాపారి ఎన్ శ్రీనివాసరావు మధ్య ఆస్తి వివాదం నెలకొంది. విజయలక్ష్మి తల్లిదండ్రులు కూడా ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. దాంతో ఆస్తి తగాదాలు మరింత అధికమైయ్యాయి. దీంతో ఆమె తీవ్ర మస్తాపానికి గురైంది. అదికాక గురువారం రాత్రి శ్రీనివాసరావు అతడి స్నేహితులు విజయలక్ష్మి నివాసానికి వచ్చి బెదిరించారు. దీంతో ఆమెలో ఆందోళన మరింత ఎక్కువైంది. శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.