డెంగీ భయం వద్దు: ఈటల

Etela Rajender Said People Dont Afraid On Dengue Fever In Telangana - Sakshi

సాక్షి, పెద్దపల్లి : ‘వాతావరణ మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. 99 శాతం ప్రజలు వైరల్‌ ఫీవర్‌తోనే బాధపడుతున్నారు. 12 జిల్లాలు తిరిగి వచ్చా.. గతంలో మాదిరిగా ఈ సారి డెంగీ ప్రభావం పెద్దగా లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన మంత్రి ముందుగా గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ సంస్థ రూ.7.89 కోట్ల నిధులతో చేపట్టబోయే 50 అదనపు పడకల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖలఅధికారులతో సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై

సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో పారిశుధ్య పనులు సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా విషజ్వరాలను నివారించవచ్చని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్‌ శ్రీదేవసేన, వివిధశాఖల అధికారులతో సీజనల్‌వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. వాతావరణ పరిస్థితులు మారినప్పుడు వైరల్‌ జ్వరాలు వస్తాయన్నారు. నివారణకు వైద్య,పంచాయతీరాజ్,మున్సిపల్‌శాఖల సమన్వయంతో చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ జ్వరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రస్తుతం 99శాతం వైరల్‌జ్వరాలు మాత్రమే వస్తున్నాయని స్పష్టం చేశారు. రోగాల బారినపడ్డ వారికి నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నట్లు పేర్కొన్న మంత్రి వైద్యసిబ్బందికి నెలరోజుల పాటు సెలవులు రద్దు చేసినట్లు వివరించారు.

వందశాతం ఓడీఎఫ్‌ జిల్లాగా 
పెద్దపల్లి జిల్లాను ఓడీఎఫ్‌గా ప్రకటించుకుని, గ్రామీణ ప్రాంతాల్లోని మురికి కాల్వలను మూసివేయడం ఆ దిశగా ఇప్పటికే జిల్లా పయనించడం ఆనందంగా ఉందన్నారు. పారిశుధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమించుకునేందుకు అవకాశం కల్పించినట్లు మంత్రి తెలిపారు.ఆశావర్కర్లు, అంగన్‌వాడీ, ఏఎన్‌ఎంల ద్వారా గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. దోమల నివారణకు అవసరమైన ఫాగింగ్‌ చర్యలను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పేదప్రజలను ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులకు రెఫర్‌ చేయవద్దని స్పష్టం చేశారు.


యోగా సెంటర్‌ను ప్రారంభిస్తున్న ఈటల

ప్రభుత్వ సలహాలను అనుసరిస్తాం: కలెక్టర్‌ శ్రీదేవసేన 
కలెక్టర్‌ శ్రీదేవసేన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలు, ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం అందిస్తున్న సలహాలను అనుసరిస్తామని పేర్కొన్నారు. ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు నాలుగు నెలలుగా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం జిల్లాలో కేవలం వైరల్‌ జ్వరాలు మాత్రమే ఉన్నాయని, ఇప్పటి వరకు జిల్లాలో 17 డెంగీ, 4 చికెన్‌గున్యా కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌ పుట్టమధు, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, పెద్దపల్లి, రామంగుండం ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకుంటి చందర్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్, డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్‌ తదతరులు పాల్గొన్నారు.

రూ.7.89 కోట్లతో అదనపు 50 పడకల నిర్మాణానికి శంకుస్థాపన
అంతకుముందు గోదావరిఖనిలో మంత్రి ఈటల రాజేందర్‌ పర్యటించారు. గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో 50 అదనపు పడకల నిర్మాణం కోసం, ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ సంస్థ రూ.7.89 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో చేపట్టబోయే పనులకు శుక్రవారం పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌నేత, జిల్లా ప్రజాపరిషత్‌ చైర్మన్‌ పుట్టమధు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కలెక్టర్‌ శ్రీదేవసేనతో కలిసి మంత్రి ఈటల రాజేందర్‌ శంకుస్థాపన చేశారు.మంత్రి మాట్లాడుతూ... అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించి ఆస్పత్రిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందామన్నారు.నిధులు కేటాయించిన ఎన్టీపీసీ అధికారులను మంత్రి అభినందించారు.

అనంతరం ఆస్పత్రిలోని డయాలసిస్‌ కేంద్రాన్ని పరిశీలించారు. రోగులు, వారి బంధువులతో మాట్లాడారు.డయాలసిస్‌ పేషెంట్లకు పెన్షన్‌ సౌకర్యం ఇప్పించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు. ‘ఖని’లో వైద్య కళాశాల ఏర్పాటు, మాతా శిశు కేంద్రం ఏర్పాటు, ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, డయాలసిస్‌ సెంటర్‌ను విస్తరించాని, ఆస్పత్రిలో నెలకొన్ని వైద్యులు, సిబ్బంది కొరత తీర్చాలని ఎమ్మెల్యే చందర్‌ మంత్రికి విన్నవించారు.

గర్భిణుల యోగా కేంద్రం ప్రారంభం
ప్రభుత్వాస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన గర్భిణీల యోగా కేంద్రం(ఆంటినెంటల్‌ ఎక్సెర్‌సైజ్‌ రూం)ను మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. గర్భిణులకు ఆపరేషన్లు చేయడం కన్నా, సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలని వైద్యులకు మంత్రి సూచించారు.జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్, జెడ్పీటీసీలు కందుల సంధ్యారాణి, నారాయణ, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, ఎన్టీపీసీ డీజీఎం రమేష్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యురాలు గోలివాడ చంద్రకళ, రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ జాయింట్‌ కమిషనర్‌ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌ఓ ప్రమోద్‌కుమార్, డీసీహెచ్‌ఎస్‌ రమాకాంత్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top