నిమ్స్‌ వైద్యుల సేవలు అభినందనీయం

Etela Rajender appreciated NIMS Doctors - Sakshi

కార్పొరేట్‌ ఆసుపత్రులతో సమానంగా వైద్యం 

అన్ని విభాగాల్లోని ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం 

గాంధీ, ఉస్మానియా, ఎంజీఎంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం

సాధారణ రోగుల ఒత్తిడి తగ్గించేందుకు కృషి

నిమ్స్‌ సందర్శనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల ప్రకటన 

హైదరాబాద్‌/సోమాజిగూడ: ‘నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(నిమ్స్‌)కు దేశంలోనే మంచి గుర్తింపు ఉంది. ఎన్నో అరుదైన, క్లిష్టమైన చికిత్సలను చేసిన ఘనత ఇక్కడి వైద్యుల సొంతం. సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించే ఆస్పత్రికి సాధారణ రోగులు సైతం వస్తున్నారు. ఈ రోగుల నిష్పత్తికి తగినన్ని మౌలిక సదుపాయాలు, వైద్య సిబ్బంది లేదు. అయినా వైద్యులు అందరికీ సేవలు అందిస్తున్నారు. ఫలితంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సాధారణ రోగుల సంఖ్యను తగ్గించి, వైద్యులపై భారం తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శుక్రవారం తొలిసారిగా ఆయన ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్, మెడికల్‌ ఆంకాలజీ, కేన్సర్‌ విభాగాలను సందర్శించారు. ఆస్పత్రిలోని మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. పారిశుద్ధ్యం పనుల పనితీరును పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా రోగుల వద్దకు వెళ్లి ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు రోగులు ఆస్పత్రిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, వాటిని వెంటనే పరిష్కరించాల్సిందిగా అక్కడే ఉన్న డైరెక్టర్‌ మనోహర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.  

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో రద్దీ తగ్గిస్తాం.. 
హృద్రోగ సమస్యలు, మూత్రపిండాల వైఫల్యం, కాలేయ సమస్యలతో బాధపడుతున్న వారితో పాటు సాధారణ రోగులు కూడా ఎక్కువగా వస్తున్నారు. ఆస్పత్రికి రోజూ సగటున ఓపీ 2000 పైగా ఉండగా, నిత్యం 1600 మంది ఇన్‌పేషంట్లుగా చికిత్స పొందుతున్నారు. క్లిష్టమైన, అరుదైన సమస్యలతో బాధపడుతున్న వారికి సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అవసరం ఉంటుంది. అదే సాధారణ జబ్బులతో బాధపడుతున్న వారికి జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్సలు అందించడం ద్వారా నిమ్స్‌పై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించవచ్చని సూచించారు. ఆ మేరకు ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం సహా అన్ని జిల్లా ఆస్పత్రుల్లోనే మౌలిక సదుపాయాలు కల్పించి, మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. నిమ్స్‌వైద్యులు ఎంతో ఓపిగ్గా వైద్యసేవలు అందిస్తున్నారని, వారు చేస్తున్న ఈ సేవలు అభినందనీయమని ప్రకటించారు.  

చిన్న సమస్యను పెద్దగా చూపించొద్దు
ఇటీవల ఓ రోగి కడుపులో కత్తెర ఉంచి కుట్టు వేసిన అంశంతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో చోటు చేసుకున్న అవినీతి అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఎంతో అనుభవం నిష్ణాతులైన వైద్యులు ఇక్కడ ఉన్నారు. వైద్యసేవల్లో చిన్నచిన్న పొరపాట్లు సహజమేననీ, ప్రతీ చిన్న విషయాన్ని పెద్దదిగా చూపించి, రాద్ధాంతం చేయడం మీడియాకు తగదన్నారు. వైద్య పరికరాల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదనీ, ఆస్పత్రి అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన అంశాలపై సలహాలు ఇస్తే..వాటిని పరిశీలించి అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆస్పత్రిలో ఏళ్ల తరబడి కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top