కేసులపై ఇంత నిర్లక్ష్యమా..?!

Errolla Srinivas Speech At Adilabad - Sakshi

మంచిర్యాలలోనే పెండింగ్‌ కేసులు అనేకం

ఎక్స్‌గ్రేషియా కాదు.. నిందితులకు శిక్ష పడాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌

సాక్షి, మంచిర్యాల: ‘కమిషన్‌ సమీక్ష సమావేశం అంటే కాగితాలు ఇస్తే సరిపోతుంది.. కేసుల వివరాలు వివరించాల్సి అవసరం లేదనుకున్నారా..? రాష్ట్రంలోని 28 జిల్లాలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు మంచిర్యాలలో పెండింగ్‌ ఉన్నాయి. ఎందుకింత నిర్లక్ష్యం..’ అంటూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోల్ల శ్రీనివాస్‌ పోలీస్, రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మంచి ర్యాల కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ భారతి హోళీకేరి, జేసీ వై.సురేందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేత, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, ఎస్సీ కమిషన్‌ సభ్యులు నీలాదేవి, డీసీపీ రక్షిత కే.మూర్తితో కలిసి ఎస్సీ, ఎస్టీ విచారణ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు 20శాతం కేసులు కూడా పూర్తి చేయలేదని, వారికి ఎలాంటి న్యాయమూ చేయడం లేదని పేర్కొన్నారు.

‘జిల్లా నుంచి 81 ఎస్సీ, ఎస్టీ కేసులు నా వద్దకు వచ్చాయి. వీటిపై విచారణ ఎంత వరకు వచ్చిందని అడిగితే సమా«ధానం లేదు.  ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియానే ఇస్తుంది. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్, రెవెన్యూ అధికారులపైనే ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలసాకుతో నిందితులను అరెస్టు చేయకుండా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు..’ అంటూ ప్రశ్నించారు. నెలల తరబడి ‘బాధితులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా..  వారి బాధలు మీకు పట్టవా.. ఇలాగైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పేద బాధితులు పోలీసులపై ప్రభుత్వంపై నమ్మకం పోతుంది..’ అన్నారు. ‘నేను పిహెచ్‌డీ చేశాను. ఉద్యమంలో పాల్గొన్నాను. ప్రతి గ్రామం, గూడెం, తండాలను సందర్శించాను. ఎస్సీ, ఎస్టీలకు జరిగే అన్యాయాలను ప్రత్యేకంగా చాశా. బాధితులకు పోలీస్, రెవెన్యూ అధికారులు అండగా ఉండాల్సి ఉంటుంది. ఉమ్మడి రాష్ట్రంలో కమిషన్‌ అంటే కార్యాలయానికే పరిమితం అయ్యింది. రాష్ట్రం వచ్చిన తర్వాత నేను కమిషన్‌ అయినప్పటి నుంచి ప్రతి జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం.’ అని పేర్కొన్నారు. ప్రతి పోలీస్టేషన్లో, ఇతర కార్యాలయాల్లో కేసులను బట్టి ఎక్స్‌గ్రేషియా వివరాలు, శిక్షలు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

ఎక్స్‌గ్రేషియా కాదు.. శిక్ష పడాలి
ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 6 వేల కేసులకు సంబంధించి 5 వేల మంది బాధితులకు రూ.41.33 కోట్ల ఎక్స్‌గ్రేషియా అందించిందన్నారు. ప్రభుత్వం బాధితులకు ఎక్స్‌గ్రేషియా ఇస్తుంది కాని నిందితులకు శిక్షపడేలా చేయాల్సింది పోలీస్‌ అధికారులదే బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం దళితుల అభివృద్ధి, అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలతో పాటు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ బాధితుల సమస్యలు తెలసుకుని పరిష్కరించేందుకు కలెక్టర్ల అధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. 2018 జనవరి 18న బాధితుల సరైన న్యాయం అందించేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నియమించిందని, బాధితుల పట్ల పూర్తి భరోసా ఇచ్చి మనోధైర్యం నింపి అండగా నిలుస్తుందన్నారు. అట్రాసిటి కేసులు, భూ వివాదాలు తదితర అంశాలపై పోలీసు అధికారులు కేసుల వివరాలు నమోదు చేసి కలెక్టర్‌ సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని, బాధితులకు తగిన న్యాయం జరిగేలా కమిషన్‌ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ఇప్పటికే 28 జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా బాధితుల సమస్యలను తెలసుకుని వాటి పరిష్కరానికి కృషి చేసినట్లు వెల్లడించారు.

జిల్లాలో పనిచేస్తూ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేలా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు సామాజిక భద్రత కల్పించేలా చొరవ తీసుకోవాలని తెలిపారు. కేసులపై ఇప్పటివరకు రిమైండర్లు పంపించామని, మూడు రిమైండర్లు జారీ చేసిన తరువాత విచారణ చేసి శిక్షించే అధికారం కమిషన్‌కు ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మరోసారి నిర్వహించే సమీక్ష సమావేశం నాటికి ప్రతి కేసు వివరంగా, క్షుణ్ణంగా ఉండాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన బాధితులు రోదిస్తూ.. ఫిర్యాదులు అందించారు. కార్యక్రమంలో డీఆర్‌వో రాజేశ్వర్, ఏసీపీలు గౌస్‌బాబ, బాలు జాదవ్, వెంకటరెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్‌ కో–ర్డినేటర్‌ అత్తిసరోజ, ఆర్డీవో సురేష్, ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ జిల్లా అధ్యక్షులు జిల్లపెల్లి వెంకటస్వామి పాల్గొన్నారు. 

మంచిర్యాల అంటే నమ్మకం
రాష్ట్రంలో అన్ని జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించాం. కేసులు పెండింగ్‌ ఈ జిల్లాలో ఉన్నట్లు ఎక్కడా లేవు. మంచిర్యాల అంటే ఎంతో మంచి జిల్లాగా గుర్తించాను. ఎస్సీ, ఎస్టీలపై దాడులు చేసిన వారిపై తక్షణమే స్పందించి నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. పెండింగ్‌ కేసులు ఉండకుండా అ«ధికారులు చర్యలు తీసుకోవాలి.
– లీలాదేవి, ఉమ్మడి జిల్లా ఎస్సీ,ఎస్టీ కమిషన్‌ మెంబర్‌ 

సాక్ష్యులకు రవాణా ఖర్చులు చెల్లించాలి
ఎస్సీ, ఎస్టీ కేసుల విషయంలో సాక్ష్యులను తీసుకొచ్చే వారికి ప్రభుత్వం రవాణా, భోజన చార్జీలు చెల్లించాలి. పేద ఎస్సీ, ఎస్టీ బాధితులు సాక్ష్యులను నిందితులు మచ్చిగా చేసుకుని వారే రవాణాచార్జీలు, ఇతర ఖర్చులు చెల్లిస్తుండడంతో కేసు నమోదు సమయంలో ఒక రకంగా.. కోర్టులో మరోరకంగా సాక్ష్యం చెబుతున్నారు. ప్రభుత్వమే ఖర్చులు చెల్లిస్తే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది.
– రమణారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎస్సీ, ఎస్టీ, పోక్సో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top