విద్యుత్ రాబడి | Electric revenue | Sakshi
Sakshi News home page

విద్యుత్ రాబడి

Feb 2 2015 3:19 AM | Updated on Oct 22 2018 8:31 PM

విద్యుత్ రాబడి - Sakshi

విద్యుత్ రాబడి

తరగతి గదుల్లో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచడమే కాదు.. తరగని శక్తి వనరులతో ‘వెలుగు’బాట పడుతున్నాయి ఆ సర్కారు బడులు..

  • సర్కారు బడుల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తి
  • మిగులు కరెంట్ గ్రిడ్‌కు అనుసంధానం
  • దక్షిణ భారత్‌లో తొలిసారిగా వరంగల్‌లో అమలు
  • ప్రభుత్వానికి ‘వెలుగు’చూపుతున్న పథకం
  • తరగతి గదుల్లో విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచడమే కాదు.. తరగని శక్తి వనరులతో ‘వెలుగు’బాట పడుతున్నాయి ఆ సర్కారు బడులు.. సౌరశక్తితో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ ‘పవర్’ఫుల్ స్కూళ్లుగా మారుతున్నాయి. నవ తెలంగాణలో కరెంటు కోతను అధిగమించేందుకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తున్నాయి.. కొత్తగా పురుడుపోసుకున్న రాష్ట్రానికి ఉడతా భక్తిగా ‘వెలుగు’లందిస్తోన్న ఆ ప్రభుత్వ పాఠశాలలను ఒకసారి పరిశీలిద్దాం పదండి..
     
    సాక్షి, హన్మకొండ: సర్కారు పాఠశాలంటేనే సవాలక్ష సమస్యలకు నిలయాలు.. సరైన భవనాలుండవు.. క్లాసుల్లో కరెంట్ ఉండదు.. పట్టించుకునే నాథుడే ఉండడు.. కానీ, వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని ఈ ప్రభుత్వ స్కూళ్లు అలాంటివి కాదు.. సౌరశక్తితో స్వయంగా కరెంట్ ఉత్పత్తి చేస్తూ మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వానికే అందిస్తున్న ‘పవర్’ఫుల్ స్కూళ్లు.
     
    ‘వెలుగుల’ ప్రస్థానం ఇలా..

    దక్షిణ భారత్‌లో తొలిసారిగా పాలకుర్తి నియోజకవర్గంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌర శక్తి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రయోగాత్మక ప్రాజెక్టుకు ప్రభుత్వం 2015 జనవరి 20న శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలోని కొడకండ్ల మండలంలో 8 ప్రభుత్వ పాఠశాలలు, ఒక జూనియర్ కళాశాల, పాలకుర్తి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సౌరశక్తి ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.

    ఇక్కడ ఒక్కో పాఠశాలకు రూ. 2.5 లక్షల వ్యయం చేసే 2 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్లను అమర్చారు. ఇవి పగటివేళ సౌరశక్తిని గ్రహిస్తాయి. వీటికి అమర్చిన యూపీఎస్ 8 గంటల పాటు బ్యాకప్‌ను అందిస్తుంది. ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్లు, డిజిటల్ క్లాస్ రూంలు, నీటి మోటారుకు వినియోగిస్తున్నారు. ఇక మిగిలిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానిస్తున్నారు.
     
    పిల్లలే వెలుగు దివ్వెలు: ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి, నెట్ మీటరింగ్ యూనిట్ల నిర్వహణను పాఠశాల విద్యార్థులే చూసుకోవడం గమనార్హం. సోలార్ పవర్ యూనిట్ పనితీరు, విడిభాగాలను పర్యవేక్షించేందుకు విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ప్రతీరోజు ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అందులో పాఠశాల వాడకం ఎంత, మిగులు విద్యుత్ ఎంత గ్రిడ్‌కు వెళ్తుంది అనే అంశాలను రికార్డు చేయడం వంటి బాధ్యతలను సైతం విద్యార్థులు నిర్వహిస్తున్నారు.
     
    కరెంటు కోత తప్పింది..
    గతంలో కరెంట్ కోత వల్ల డిజిటల్ క్లాస్ రూం నిర్వహించడం కష్టంగా ఉండేది. ఇప్పుడు సోలార్ విద్యుత్‌తో ఆ సమస్య లేదు. నెట్ మీటరింగ్ ద్వారా సమకూరే ఆదాయంతో విద్యార్థులను ప్రోత్సహించే కార్యక్రమాలు చేపడుతున్నాం.      
     - పి.నర్సయ్య, హెడ్‌మాస్టర్, జెడ్పీ స్కూల్, పాలకుర్తి
     
    అదనపు ఆదాయం పొందవచ్చు
    సోలార్ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయిన మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఆదాయం పొందవచ్చు. పాఠశాలలు ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో ఎంత వినియోగం జరిగింది, ఎంత గ్రిడ్‌కు సరఫరా చేశారు అనే సమాచారం ఉంటుంది. దీంతో ఉత్పత్తిదారుల నుండి కొనుగోలు చేసిన విద్యుత్‌కు చెల్లింపులు చేస్తాం.     
    - ఏడీఈ అమృనాయక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement