
సాక్షి, భూపాలపల్లి: ఎన్నికల ప్రచారం ముగియడానికి వారం రోజుల సమయం మాత్రమే ఉంది. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మిగిలిపోయిన మండలాలు, గ్రామాల్లో ప్రచారం చేసేందుకు షెడ్యూల్ సిద్ధం చేసుకుంటున్నారు. మరో వైపు తమ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్న పార్టీలు అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే స్టార్ క్యాంపెయినర్లు బహిరంగ సభల్లో పాల్గొని ఎన్నికల ప్రచారానికి ఊపునిస్తున్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భూపాలపల్లిలో జరిగే సభకు హాజరవుతున్నారు. శుక్రవారం టీఆర్‌ఎస్ బాస్ ములుగు, భుపాలపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీజేపీ తరఫున పరిపూర్ణానంద స్వామి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం జిల్లాకు రానున్నారు. వరుస సభలు ఉండడంతో ప్రస్తుతం అన్ని పార్టీలు జనసమీకరణ పైనే దృష్టి సారించాయి.
వేగం పెంచిన నేతల స్థానిక నాయకులు ఇటు బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లు చూసుకుంటూనే అటు ప్రచారంలో నిమగ్నమవుతున్నారు. మిగిలిన వారం రోజుల్లో షెడ్యూల్‌ను పక్కాగా పూర్తి చేయాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే.. మిగిలి ఉన్న సమయంలో చేసే ప్రచారం కీలకమైనదిగా నేతలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రచారానికి వెళ్లని గ్రామాలతో పాటు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రెండో దఫా ప్రచారం చేపట్టడానికి ఉద్యుక్తమవుతున్నారు. ఇందుకోసం నియోజకవర్గాల్లో గ్రామాలను ఆయా పార్టీల అభ్యర్థులు విశ్రాంతి లేకుండా చుట్టివస్తున్నారు. గంటకో ఊరు చొప్పునా రోజుకు 6 నుంచి 7 గ్రామాలు తిరుగుతున్నారు.
పట్టు లేని ప్రాంతాలపై దృష్టి
తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయా పార్టీలు తమకు పట్టు లేని ప్రాంతాలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించాయి. బూత్ ల వారీగా ఎన్ని ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుని ఆయా ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంచుకోవడానికి విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జనంలో పేరున్న నాయకులను ఆయా మండలాల పరిధిలో ఉండేలా చూస్తున్నారు. వీరికి స్థానికంగా ఉండే ద్వితీయ శ్రేణి కేడర్ తోడుగా ఉండేలా చూస్తున్నారు. అందరూ కలిసి గడపగడపకు వెళ్లి తమ పార్టీకి ఓటువేయాలని ప్రజలను కోరుతున్నారు.
తటస్థ ఓటర్లే టార్గెట్..
ప్రతీ పార్టీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకుంటే విజయావకాశాలు అధికంగా ఉంటాయని భావించి ఆ దిశగా నాయకులు పావులు కదుపుతున్నారు. ఇప్పటి వరకు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని ప్రజలను బహిరంగ సభల ద్వారా ఆకట్టుకోవాలని చూస్తున్నారు. జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో కొత్త ఓటర్లు 40 వేలకు పెరిగారు. వీరిని ఆకర్షించేందుకు అగ్రనేతల ప్రచార సభలు ఉపయోగపడుతాయని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఓటర్లు గుర్తుండిపోయేలా అగ్రనేతల ప్రచార సభలను చివరి రోజుల్లో ఏర్పాటు చేస్తున్నారు.