పల్లెల్లో 'ఎన్నికల' మద్యం

 In 'Election' Campaign Using  Alcohol In Villages - Sakshi

భారీగా మద్యం డంపులు

కోడ్‌ దృష్టిలో పెట్టుకుని కొనుగోలు

42 మద్యం దుకాణాల్లో భారీ నిల్వలు

అక్కడి నుంచి రహస్య ప్రాంతాలకు తరలింపు 

పక్కా సమాచారంతో ఎక్సైజ్‌ దాడులు 

పట్టుపడుతున్న అక్రమ నిల్వలు 

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల) : ముందస్తు ఎన్నికల కోసం నాయకులు మద్యం రెడీ చేశారు. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని ముందే కొనుగోలు చేసి పల్లెల్లో నిల్వచేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి బరిలో ఉన్న అభ్యర్థులు డబ్బులు, మద్యంపై దృష్టి సారిస్తున్నారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తున్న క్రమంలో సభలకు వచ్చేవారికి పంచేందుకు ఇప్పటికే భారీగా మద్యం కొనుగోలు చేశారు. ఎన్నికలకు ఇంకా 15 రోజులు ఉండడంతో అప్పటి వరకు సరిపోయేలా ఇంకా కొనుగోళ్లు జరుపుతూ రహస్య ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తున్నారు. జిల్లాలో ఉన్న 42 మధ్యం దుకాణాలు ఉన్నాయి. షాపుల నిర్వాహకులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే టార్గెట్‌కు మించి మద్యం కొనుగోళ్లు చేశారు.

కొనుగోలు చేసిన మద్యాన్ని పార్టీల నేతల సూచనల మేరకు డబ్బులు తీసుకుని లిక్కర్‌ కంపెనీల నుంచి మద్యం తీసుకొచ్చే వాహనాలను వారు సూచించిన ప్రాంతాలకు రహస్యంగా తరలిస్తున్నారు. గురువారంతో నా మినేషన్ల ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులు ఇక ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అం దుకు ప్రధానంగా మద్యంపైనే అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ఎన్నికలకు ముందు మద్యం నిలువ చేయడం, పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం కష్టం. అందుకే ఇప్పటికే భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి పల్లెల్లో డంప్‌ చేసినట్లు సమాచారం.  

పక్కా సమాచారంతో..
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ విజయం కోసం ప్రచారం నిర్వహిస్తూనే ప్రత్యర్థి బలహీనతలను దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని పార్టీల అభ్యర్థులు మద్యం కొనుగోళ్లు జరుపుతున్నా.. ప్రత్యర్థి కొనుగోలు చేసిన మద్యం వాహనం ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుందనే సమాచారం తెలుసుకుని ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగుతున్న ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పట్టుకుంటున్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో వారం రోజుల వ్యవధిలో ఆరుచోట్ల మద్యం నిల్వలపై పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. తాజాగా కంచర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో డంపు చేస్తున్న మద్యంను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. అక్రమ మద్యం నిల్వలపై నిత్యం దాడులు జరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం ఆగడంలేదు. ప్రస్తుతం కొద్ది మొత్తంలో మద్యం దొరుకుతున్నప్పటికీ ఇంకా భారీ స్థాయిలో మద్యం డంపులు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 

పరిమితికి మించి కొనుగోలు చేస్తే కేసులే..
ఎక్సైజ్‌ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ కొనుగోలు చేయరాదనే నిబంధన ఉంది. మద్యం దుకాణాల నిర్వాహకులు కూడా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. కానీ ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. వైన్‌ షాపుల నిర్వాహకులు పరిమితికి మించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో పెద్ద మొత్తంలో మద్యం విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు అమ్మకాలపై దృష్టి పెట్టకుండా కొనుగోలు దారులను టార్గెట్‌ చేస్తున్నారు. 

బెల్టుషాపుల్లో భారీ నిల్వలు
జిల్లాలో సుమారు 768 బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 42 వైన్‌ షాపులు, 42 పర్మిట్‌రూంలు, సిరిసిల్లలో 3, వేములవాడలో 2 బార్లు అధికారికంగా(లైసెన్స్‌) నిర్వహిస్తున్నారు. వీటన్నింటినీ మించి బెల్ట్‌షాపుల ద్వారానే మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా గ్రామాలలో మద్యంను పంపిణీ చేయడానికి ప్రధానంగా బెల్ట్‌షాపుల నిర్వాహకుల ద్వారానే మద్యాన్ని రహస్య ప్రదేశాల్లో డంపు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మద్యం దుకాణాలతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధం చేశారు.  

మద్యం డంపు చేస్తే చర్యలు
అనుమతులు లేకుండా రహస్య ప్రాంతాల్లో మద్యం డంపుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వైన్‌షాపు నిర్వాహకులు ఒక వ్యక్తి ఆరు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యం అమ్మితే లైసెన్స్‌ రద్దు చేస్తాం. ఎక్సైజ్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తాం. ఇప్పటికే కొన్నిచోట్ల నిల్వచేసిన మద్యాన్ని పట్టుకుని కేసులు పెట్టాం. ముఖ్యంగా బెల్ట్‌షాపుల నిర్వాహకులు పద్దతి మార్చుకోవాలి.  
– చంద్రశేఖర్, ఎక్సైజ్‌ నోడల్‌ అధికారి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top