వాస్తుదోషం పేరిట ఇప్పడున్న తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చినా అవే తిప్పలు తప్పవా?..
సాక్షి, హైదరాబాద్: వాస్తుదోషం పేరిట ఇప్పడున్న తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చినా అవే తిప్పలు తప్పవా?..కొత్త సచివాలయం నిర్మించ తలపెట్టిన ఛాతీ ఆస్పత్రి స్థలానికి ఈశాన్యంలో వాస్తు దోషం ఉందా?..ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ఆ స్థలాన్ని పరిశీలిస్తున్న వాస్తు నిపుణులు ఇదే చెబుతున్నారు.
ప్రస్తుత సచివాలయానికి వాస్తుదోషం ఉందని.. సచివాలయాన్ని ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రి స్థలంలోకి మార్చుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టే ఛాతీ ఆస్పత్రి స్థలంలో వాస్తుదోషాలను తేల్చేందుకు వాస్తు నిపుణులు రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రికి వాస్తు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఓ నిపుణుడితోపాటు మరికొందరు రెండు రోజులుగా ఆ స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఆ స్థలంలో ఈశాన్యం వైపు ఓ అక్రమ నిర్మాణంతో ఏర్పడ్డ కోత వల్ల వాస్తుపరమైన సమస్యలేర్పడినట్టు వారు గుర్తించారు.
దానికి విరుగుడుగా ఆ భాగాన్ని ప్రతిపాదిత స్థలం నుంచి వేరు చేసేలా గోడ నిర్మిస్తే సరిపోతుం దని భావిస్తున్నట్లు సమాచారం. లోపాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి సరిచేసే పనులు ప్రారంభించనున్నారు. ఇక ప్రతిపాదిత స్థలంలో ఏ వైపు ఏముండాలన్నది వారు గుర్తిస్తున్నారు.
వాస్తు నిపుణుడి ఎంపికలో సమస్యలు
ముఖ్యమంత్రికి వాస్తు సూచనలిస్తున్న వ్యక్తికి రోడ్లు భవనాల శాఖలో వాస్తు కన్సల్టెంట్‌గా పోస్టింగ్ ఇవ్వాలని తొలుత భావించారు. అయితే సాంకేతికంగా ఆ పోస్టు ఏర్పాటు సాధ్యం కాకపోవటంతో బిల్డింగ్ కన్సల్టెంట్‌గా నియమించాలని నిర్ణయించారు. సంబంధిత ఫైలును రోడ్లు భవనాల శాఖ అధికారులు ఆర్థిక శాఖకు పంపారు. కానీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు సివిల్ ఇంజనీరింగ్ అర్హత ఉండాలి.
సదరు నిపుణుడికి విద్యార్హత లేకపోవటంతో ఆర్థిక శాఖ ఫైలును తిప్పి పంపినట్టు తెలిసింది. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్హత లేదని, ఆయనకు ఎంఏ పట్టా మాత్రమే ఉందని పేర్కొం టూ రోడ్లు భవనాల శాఖ అధికారులు మళ్లీ ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపారు. వెరసి సదరు నిపుణుడికి సాంకేతిక కారణాలతో పోస్టు ఇచ్చే అవకాశం కనిపించటం లేదు.