తొలి ఘట్టం..

Eelection Schedule Information  Warangal - Sakshi

ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు

అభ్యర్థితో పాటు ఐదుగురికి అనుమతి

19వ తేదీ వరకు చివరి గడువు 

నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి

సాక్షి, భూపాలపల్లి : ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ మరి కొన్నిగంటల్లో ప్రారంభం కాబోతోంది. సోమవా రం ఉదయం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్ల స్వీకరణను మొదలుపెట్టన్నారు. 

ఎన్నికల షెడ్యూల్‌..

  • 12 నుంచి 19వ తేదీ వరకు రోజు ఉదయం
  • 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరిణ
  • 20వ తేదీన నామినేషన్ల పరిశీలన
  • 22న మధ్యాహ్నం 3 గంటల వరకు
  • నామినేషన్ల ఉపసంహరణ
  • డిసెంబర్‌ 7న పోలింగ్‌(ఉదయం 7     నుంచి సాయంత్రం 4 గంటల వరకు)
  • 11వ తేదీన ఓట్ల లెక్కింపు 

జిల్లాలో రెండు నియోజకవర్గాలు..
జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గ కేంద్రాలతోపాటు పునర్విభజనలో భాగంగా జిల్లాలో కలిసిన కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మల్హర్‌ మండలాలకు సంబం ధించి మంథని, వాజేడు, వెంకటాపురం(కే) మండలాలకు సంబంధించి భద్రాచలం నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. నామినేషన్లను రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు 19వ తేదీ వరకు స్వీకరిస్తారు.

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు..
నామినేషన్ల స్వీకరణకు జిల్లా పరిధిలోని భూపాలపల్లి, ములుగుతోపాటు మంథని, భద్రాచలం ని యోజకవర్గ కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భూపాలపల్లి రిటర్నింగ్‌ అధికారి వెంకటాచారి(ఆర్డీఓ), ములుగు రమాదేవి(ఆర్డీఓ), మంథని నగేష్‌(ఆర్డీఓ), భద్రాచలం భవీష్‌మిశ్రా(సబ్‌ కలెక్టర్‌) తమ కార్యాలయాల్లో నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు నేతృత్వంలో నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేపట్టారు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో రికార్డింగ్‌ చేయనున్నారు. నామి నేషన్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఆంక్షలు విధించి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

మొదటి రెండు రోజులు తక్కువే.. 
సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారం భం కానున్న నేపథ్యంలో మొదటి రెండు రోజులు నామినేషన్ల దాఖలు అంతంత మాత్రంగానే ఉండే అవకాశాలున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్టానం మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ జిల్లాలో కేవలం భూపాలపల్లి నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించింది. మహాకూటమిలో సీట్ల సరుబాటు కుదరక అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. దీంతో ప్రధాన పార్టీల నుంచి తొలిరోజున నామినేషన్లు వేసే అవకాశాలు తక్కువగానేఉన్నాయి. మరుసటి రోజు మంగళవారం సెంటిమెంట్‌ కావడంతో నామినేషన్లు వేసే పరిస్థితి ఉండకపోవచ్చు. 

జోరందుకోనున్న ప్రచారం
నెల రోజుల నుంచే జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులతోపాటు అన్ని పార్టీల నుంచి టికెట్‌ వస్తుందనే నమ్మకంతో ఉన్నవారు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుండడంతో నాయకులు ప్రచారాన్ని మరింత వేగం చేయనున్నారు. అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం ఒక దఫా పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులతో బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు. నామినేషన్‌ వేసే రోజు బల నిరూపనకు ఎక్కువ మందిని నియోజకవర్గ కేంద్రాలకు తరలించి భారీ ర్యాలీలు తీసే యోచనలో ఉన్నట్లు తెలిసింది.  

విస్తృతంగా ప్రచారం చేస్తాం..
జిల్లాలో మావోయిస్టు ప్రభావిత, సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలను డిసెంబర్‌ 7న ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. గంట సమయం కుదించిన విషయమై ఓటర్లు, రాజకీయ పార్టీల నాయకులకు అవగహన కల్పిస్తాం. అలాగే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాం. 
– వాసం వెంకటేశ్వర్లు, కలెక్టర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top