సార్, అంతా దోపిడే.. | Education Grievance cell flood of complaints | Sakshi
Sakshi News home page

సార్, అంతా దోపిడే..

Jul 17 2014 4:32 AM | Updated on Jul 11 2019 5:07 PM

విజయనగర్ కాలనీలోని ఓ పాఠశాలలో అడ్మిషన్ ఫీజు పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున డొనేషన్ క ట్టించుకున్నారు.

  •      విద్యాశాఖ గ్రీవెన్స్ సెల్‌కు ఫిర్యాదుల వెల్లువ
  •      ఆధారాలున్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశం
  •      ఫిర్యాదులకు ఈ-మెయిల్ సౌలభ్యం
  • సాక్షి, సిటీబ్యూరో:విజయనగర్ కాలనీలోని ఓ పాఠశాలలో అడ్మిషన్ ఫీజు పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.20 వేల చొప్పున డొనేషన్ క ట్టించుకున్నారు. ఆరు, ఏడు తరగతులకు అన్ని ఫీజులు కలిపి రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నారు.
         
    మా పిల్లాడిని అబిడ్స్‌లోని ఓ పాఠశాల్లో ఎల్‌కేజీలో చేర్పించాం. మొదటి టర్మ్ ఫీజు రూ.15 వేలు కట్టాం. ఆ స్కూల్‌కు ప్రభుత్వ గుర్తింపు లేదని తెలిసింది. మేం కట్టిన ఫీజును తిరిగి ఇవ్వమంటే యాజమాన్యం పట్టించుకోవడం లేదు.
         
    నా కుమారుడు నల్లకుంటలోని ఓ కార్పొరేట్ పాఠశాల్లో గతేడాది టెన్త్ క్లాస్ చదివి పాసయ్యాడు. ట్యూషన్ ఫీజు చెల్లించినా, పాఠశాల యాజమాన్యం మార్కుల జాబితా ఇవ్వడం లేదు. అదనంగా ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
     
    ఇదీ.. నగరంలోని ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్న మధ్యతరగతి తల్లిదండ్రుల పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని అనేక మంది ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈఓ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు ఇలాంటి ఫిర్యాదులే వెల్లువలా వచ్చాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిర్యాదుల విభాగానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి.

    కొందరు లిఖిత పూర్వకంగా మరికొందరు ఫోన్ల ద్వారా ఫిర్యాదు చేశారు. భారీగా ఫిర్యాదులు రావడంతో ఆశ్చర్యపోవడం అధికారులు వంతైంది. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు, వేళలు, గుర్తింపు లే కుండా నడుస్తున్న స్కూళ్లు.. తదితర అంశాలపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు జిల్లా విద్యాశాఖ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇకపై తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులను ఈ-మెయిల్ ద్వారా కూడా స్వీకరించాలని అధికారులు నిర్ణయిచారు. rtehyd.grievance@yahoo.inఅడ్రస్‌కు తగిన ఆధారాలతో ఈ-మెయిల్ చేయవచ్చని అధికారులు సూచించారు.
     
    విచారణకు ఆదేశించాం...
    నగరంలోని వివిధ ప్రైవేటు పాఠశాలలపై గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను కూడా అందజేయాలని కోరుతున్నాం. బుధవారం గ్రీవెన్స్ సెల్‌కు ఆధారాలతో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించాం. ఆయా పాఠశాలలపై విచారణకు ఆదేశించాం. నివేదిక వచ్చిన వెంటనే సదరు స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.
     - ఎ.సుబ్బారెడ్డి, హైదరాబాద్ డీఈఓ
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement