‘ప్లాంట్‌ గణేశ్‌’ విగ్రహాలు | Eco Friendly Ganesh Idols Distributing in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆలోచన ఇలా మొలకెత్తింది..

Aug 31 2019 10:40 AM | Updated on Sep 4 2019 12:49 PM

Eco Friendly Ganesh Idols Distributing in Hyderabad - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: మట్టికి, మనిషికి విడదీయరాని అనుబంధం ఉంది. మానవ మనుగడ ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతి ఆరాధనతో మొదలైన పూజలు ఇప్పుడు విగ్రహారాధన దాకా వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ మహోన్నతమైన అనుబంధాన్ని, ఆధ్మాత్మిక సంబంధాన్ని తిరిగి మట్టితో ముడిపెట్టి సమున్నతంగా ఆవిష్కరిస్తున్నారు నగరవాసులు. పర్యావరణంపై చైతన్యవంతులైన సిటీ ప్రజలు ఇప్పుడు వినాయక చవితికి ‘ప్లాంట్‌ గణేశుడి’ని మొక్కుతున్నారు. కుండీల్లో నిమజ్జనం చేసి మొక్కై మొలచి పుడమిని పులకింపజేసే గణనాథుడిని పూజిస్తున్నారు. ఇప్పుడిది నగరంలో సరికొత్త ట్రెండ్‌. పర్యావరణ ప్రియులైన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ప్లాంట్‌ గణేశుడు’ తొలుత నవరాత్రులు మట్టి ప్రతిమగా పూజలందుకొని నిమజ్జనంతో భూమిలో కలిసిపోతాడు. మొక్కలో జీవం పోసుకుని పైకి లేస్తాడు. ఇప్పటికే నగరంలో మట్టి విగ్రహాలపై అవగాహన ఉద్యమ స్థాయిలో కొనసాగుతోంది. కాలుష్య నియంత్రణ మండలి, హెచ్‌ఎండీఏ వంటి సంస్థలతో పాటు అనేక స్వచ్ఛంద సంస్థలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేదికలు మట్టి విగ్రహాలను అందజేస్తున్నాయి. ప్రజలు సైతం అలాంటి విగ్రహాలనే  ఎక్కువగా పూజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో మట్టి విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేసి వాటిలో పూడిక భారాన్ని పెంచకుండా ఇంట్లోనే మొక్కలుగా పెంచాలనే లక్ష్యంతో నగరానికి చెందిన ‘ప్లాన్‌ ఏ ప్లాంట్‌ ’ సంస్థ ఈ విగ్రహాలను అందజేస్తోంది. హైదరాబాద్‌తో పాటు దేశ విదేశాలకు విగ్రహాలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 12 వేల ప్లాంట్‌ గణేశ విగ్రహాలను భక్తులకు చేరవేశారు. మరో రెండు రోజుల పాటు భక్తులకు విక్రయించేందుకు అనుగుణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచారు. వివిధ రకాల నాణ్యమైన కూరగాయల విత్తనాలతో తయారు చేసిన ప్లాంట్‌ గణేశ విగ్రహాలు నిమజ్జనం అనంతరం ఏడు రోజుల్లో చక్కగా మొలకెత్తుతాయి. ఇంటి పరిసరాల్లో పచ్చగా వికసిస్తాయి.

ఆలోచన ఇలా మొలకెత్తింది..
మూడేళ్ల క్రితం గణేశ్‌ అమర్‌నాథ్, దివ్యాంజలి దంపతుల మదిలో ఈ ఆలోచన రూపుదిద్దుకుంది. ప్లాన్‌ ఏ ప్లాంట్‌ సంస్థ ద్వారా అప్పటికే వివిధ రకాల ఇండోర్‌ మొక్కలను పెంచి విక్రయిస్తున్న ఈ దంపతులు.. వినాయక చవితి వేడుకలను కూడా ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో పర్యావరణహితంగా జరుపుకొనేందుకు ప్లాంట్‌ గణేశ (మొక్క ప్రతిమ) విగ్రహాలకు రూపమిచ్చారు. సారవంతమైన మట్టితో విగ్రహాలను తయారు చేసి వాటిలోనే వివిధ జాతుల కూరగాయల విత్తనాలను ఉంచుతున్నారు. ఒక కుండలో కొకోపిట్, వర్మి కంపోస్టుతో నింపి దానిపై ఈ ప్రతిమను అలంకరిస్తారు. నేషనల్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ గుర్తించిన నాణ్యమైన హైజర్మినేషన్‌ సీడ్స్‌ను మాత్రమే ఇందుకోసం ఎంపిక చేస్తున్నారు. ‘విగ్రహంలో ఉంచిన ప్రతి విత్తనం కచ్చితంగా మొలకెత్తి, పెరిగి పెద్దయ్యేలా అత్యంత నాణ్యమైనవి తీసుకున్నాం. ఏడు రోజుల్లో విత్తనాలు కచ్చితంగా మొలకెత్తుతాయి’ అని చెబుతున్నారు గణేశ్‌ అమర్‌నాథ్‌. ‘చెరువులను పరిరక్షించుకోవాలంటే మట్టి విగ్రహాలు కూడా వాటికి భారం కాకుండా చూసుకోవాలి. అందుకే ఇంటి వద్దే నిమజ్జనం చేసుకోవడంతో పాటు, చక్కటి కూరగాయలను ఇచ్చేలా ప్లాంట్‌ గణేశులను తయారు చేశాం’ అని చెప్పారు. రూ.499 విలువ చేసే ఈ ప్రతిమలను ఇప్పటికే పూణె, ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా తదితర నగరాలకు, దుబాయ్, షార్జా, బ్రిటన్, అమెరికా, జర్మనీ వంటి దేశాల్లోని భక్తులకు పంపించారు.

విగ్రహాల తయారీపై వర్క్‌షాప్‌
మరోవైపు మట్టి ప్రతిమల తయారీ కోసం సికింద్రాబాద్‌లోని అవర్‌ సాక్రెడ్‌ స్పేస్‌లో సెప్టెంబర్‌ 1న పిల్లల కోసం ప్రత్యేక వర్క్‌షాపు ఏర్పాటు చేయనున్నారు. నిజామాబాద్‌ నుంచి ఇందుకోసం ప్రత్యేకంగా బంకమట్టిని తెప్పిస్తున్నట్లు నివ్వాహకులు తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి 12 వరకు ఈ మట్టి విగ్రహాల వర్క్‌షాపు ఉంటుంది.  

ఎక్కడ లభిస్తాయంటే..
బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌2లోని నృత్య ఫోరం ఫర్‌ పర్ఫార్మెన్స్‌ ఆర్ట్స్, మణికొండలోని హోమ్‌క్రాప్,కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని హిమట్రి రెస్టారెంట్, సైనిక్‌పురి ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంచారు. కూకట్‌పల్లిలోని ప్లాన్‌ఏ ప్లాంట్‌ కార్యాలయంలోనూసంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement