డ్రైవింగ్ & పరిశోధన

driving training centre in rajanna sircilla

సిరిసిల్లలో రూ.16.48 కోట్లతో 20 ఎకరాల్లో ఏర్పాటు

దక్షిణ భారతదేశంలోనే రెండో కేంద్రం

సిరిసిల్ల నుంచి వూరడి మల్లికార్జున్‌ : డ్రైవింగ్‌లో శిక్షణ, పరిశోధన కేంద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటవుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం రూపుదిద్దుకుంటోంది. ఇందుకు అవసరమైన పరిపాలనా అనుమతులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. శిక్షణ కేంద్రం కోసం 20 ఎకరాలను జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద కేటాయించారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రంకాగా, దక్షిణ భారత దేశంలో రెండో డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రం అవుతుంది. తొలి శిక్షణ కేంద్రం తమిళనాడులో ఉండగా.. రెండోది సిరిసిల్లలోనే ఏర్పాటవుతోంది.

ఇక్కడ డ్రైవింగ్‌లో మెరుగైన శిక్షణ ఇస్తారు. ఆర్టీసీ డ్రైవర్లతోపాటు హెవీ వెహికిల్స్‌ లారీలు, ట్రక్కులు నడిపేవారికీ నైపుణ్యమైన  శిక్షణ ఇస్తారు.  కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసే డ్రైవర్లకు సిరిసిల్లలోనే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. గల్ఫ్‌ దేశాలకు వెళ్లే యువకులకు సైతం డ్రైవింగ్‌ స్కూల్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ లభిస్తుంది. ఎక్కడైనా బస్సులు, లారీలతో ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు పనిష్మెంట్‌లో భాగంగా సిరిసిల్లలో డ్రైవింగ్‌ శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. ఏటా ఇక్కడ వెయ్యి మందికి శిక్షణ ఇస్తారు.

పరిశోధన సంస్థగా..
ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నారు. ఇందులో డ్రైవింగ్‌ ట్రాక్, టెస్ట్‌ డ్రైవింగ్‌ ట్రాక్, శిక్షణ పొందేవారికి హాస్టల్‌ వసతి, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణాలకు రూ.16.48 కోట్లు కేటాయించారు. ఆధునిక రీతిలో డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోపాటు అశోకా లేలాండ్‌ సంస్థ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని స్థాపించేందుకు ముందుకొచ్చింది. దీనితో తెలంగాణలోని 31 జిల్లాల యువతకు డ్రైవింగ్‌లో శిక్షణ పొందే వీలుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తారు. సిరిసిల్ల జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణలోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి. ప్రపంచంలోనే బెస్ట్‌ డ్రైవింగ్‌ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు ఇక్కడ డ్రైవర్లకు శిక్షణ ఇస్తారు.

చురుగ్గా పనులు..
రాజన్న సిరిసిల్ల జిల్లాకు డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంజూరు చేయించారు. ప్రస్తుతం డ్రైవింVŠ  శిక్షణ, పరిశోధన కేంద్రం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్రహరీ నిర్మాణం, మెయిన్‌ బ్లాక్, భవనాలు నిర్మిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణాశాఖ ప్రధాన కార్యాలయాన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ల జారీ, వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలు ఇక్కడే చేయనున్నారు. ఈ శిక్షణ కేంద్రం, పరిశోధనలతో స్థానిక యువతకు మెరుగైన డ్రైవింగ్‌ విధానాలు దరిచేరనున్నాయి.

 డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రం స్వరూపం
స్థలం              : రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లి
నిర్మాణ వ్యయం : రూ.16.48 కోట్లు
విస్తీర్ణం            : 20 ఎకరాల్లో..
నిర్మాణ గడువు : ఏడాదిన్నర కాలం
ప్రయోజనం      : డ్రైవింగ్‌లో ఆధునిక శిక్షణ, నైపుణ్యం పెంపు
ఎంత మందికి   : ఏటా వెయ్యి మందికి  
నిర్వహణ        : రవాణాశాఖ, అశోకా లేలాండ్‌ సంస్థ
లక్ష్యం             : ప్రమాద రహిత సమాజం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top