మినరల్‌ కాదు.. జనరల్‌

Drinking Water Problems In Khammam - Sakshi

ప్రజల తాగునీటి అవసరాలను ఆసరా చేసుకున్నారు ఆ వ్యాపారులు. నీరున్న ప్రాంతం.. రవాణాకు అనువుగా ఉండే ప్రదేశంలో గది అద్దెకు తీసుకుని బోరేసుకుంటారు. మూడు ఆటోలు, వంద క్యాన్లు కొనుగోలు చేసి.. నలుగురు మనుషులను వర్కర్లుగా పెట్టుకుంటారు. ఉదయం లేచింది మొదలు పొద్దుపోయే వరకు మోటారుతో క్యాన్లలో నీటిని నింపుతూ.. వీధుల్లో రయ్యరయ్య తిరుగుతూ విక్రయిస్తుంటారు. డబ్బులు పెట్టి కొంటున్నాం కదా.. మినరల్‌ వాటరే తాగుతున్నాం అనుకుంటారు.

కానీ.. అవన్నీ జనరల్‌ వాటర్‌ అనే విషయం సామాన్య ప్రజలకు తెలియదు. జిల్లాలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లు వెలుస్తున్నా.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం కొనసాగుతున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారు. సంబంధిత అధికారులు అనుమతి లేని ప్లాంట్ల వైపు కన్నెత్తి చూడకపోవడంతో వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో అనుమతి పొందిన ప్లాంట్ల కంటే లేనివే ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఖమ్మంరూరల్‌: జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలు, చిన్న పట్టణాల్లో సుమారు 1,026 వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మూడొంతులకు పైగా అనుమ తి లేకుండా నడిచే ప్లాంట్లే ఉండడం గమనార్హం. కొందరు వ్యాపారులు సంపాదనే లక్ష్యం గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్లాంటు నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఎటువం టి అనుమతులు తీసుకోకుండా.. మినరల్‌ వాటర్‌ పేరుతో జనరల్‌ వాటర్‌ అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నాణ్యత లోపించిన నీటిని క్యాన్‌ ఒక్కంటికి రూ.10 నుంచి రూ.15 చొప్పున విక్రయిస్తూ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. బస్టాండ్లు, దుకాణాల్లో నీళ్లు అమ్మే వ్యాపారులు ప్లాంట్ల నిర్వాహకులతో కుమ్మక్కై లీటర్‌ నీళ్ల బాటిల్‌ రూ.4 నుంచి రూ.5 వరకు అమ్ముతూ ప్రజలను దోపిడీ చేస్తున్నారు. ఇదంతా యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
  
ఇష్టానుసారంగా లిక్విడ్‌ వినియోగం.. 

 నీటిని శుద్ధి చేయడానికి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో డోజింగ్‌ లిక్విడ్‌ను వినియోగి స్తుం టారు. ఈ లిక్విడ్‌ను 20 లీటర్ల శుద్ధి జలాన్ని తయారు చేసేందుకు 100 నుంచి 150 గ్రాముల వరకు ఉపయోగిస్తారు. మిషన్‌ ద్వారా పంపించిన లిక్విడ్‌ నీటిని శుద్ధి చేసి.. వృథా నీటి ద్వారా బయటకు వస్తుంది. చాలా వాటర్‌ ప్లాంట్లలో ఈ లిక్విడ్‌ను ఇష్టానుసారంగా వినియోగిస్తున్నారు.  మినరల్‌ వాటర్‌ ప్లాంట్లలో నీటిని శుద్ధి చేయడానికి నీటిలో ఫ్లోరైడ్‌ శాతాన్ని లెక్కించి నీటిని శుద్ధి చేయాల్సి ఉంటుంది. నీటిలో ఫ్లోరైడ్‌ శాతం 1000 నుంచి 1500 శాతానికి పైగా ఉంటే.. ఆ నీటిని శుద్ధి చేస్తే అధిక శాతం నీరు వృథా అవుతుంది. దీంతో అత్యధిక శాతం నీరు నిరుపయోగంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉన్న నీటిని శుద్ధి చేసేందుకు అనుమతులు ఇవ్వరు.
 
ప్లాంట్‌ స్థాపనకు ఉండాల్సిన నిబంధనలిలా.. 

  •  వాటర్‌ ప్లాంట్లు నిర్వహించాలంటే ప్లాంట్లలో మినరల్‌తోపాటు కెమిస్ట్‌ మైక్రోబయాలజీ ల్యాబ్‌ కలిగి ఉండాలి. 
  •  ఆయా ల్యాబ్‌లలో నీటి పరీక్షలు చేసేందుకు సల్ఫ్యూరిక్‌ ఆమ్లం వంటి 108 రకాల కెమికల్స్‌ అవసరం ఉంటుంది. 
  •  ప్రతి రోజూ ఫిజికల్‌ టెస్టులు (రంగు, రుచి, వాసన పీహెచ్‌ హైడ్రోజన్‌ ఆయాన్‌ కాన్సంట్రేషన్‌) నిర్వహించాలి.  
  •  ఫ్లోరైడ్, క్లోరైడ్‌ పరీక్షలు జరపాలి. క్వాలిటీ టెక్నీషియన్లు ఉండాలి. 
  •  నిత్యం శుభ్రమైన వాటర్‌ క్యాన్లను వినియోగించాలి.  
  •  మూడు నెలలకు ఒకసారి క్యాన్లను మార్చాలి. 
  •  వాటర్‌ క్యాన్లపై మాన్యుఫ్యాక్చరింగ్‌ తేదీ, బ్యాచ్‌ నంబర్, ఎక్స్‌పైరీ తేదీ తదితర సమాచారం ఉండాలి. 
  •  ఫ్యూరీఫై చేసిన తర్వాత నీటిని కనీసం 24 గంటలు నిల్వ ఉండాలి. 
  •  వాటర్‌ ఫిల్లింగ్‌ ఏసీలో జరపాలి. 
  •  వాటర్‌ ట్యాంక్‌లపై తప్పనిసరిగా మూతలు ఉండాలి.  
  •  డ్రెస్సింగ్‌ గది, ప్రొడక్షన్‌ రూం, ఫిల్లింగ్‌ గదులు ఉండాలి. 
  •  రోజుకు నాలుగు గంటలకోసారి నీటి పరీక్షలు జరపాలి. 

కానీ.. ఇటువంటి నిబంధనలను జిల్లాలోని వాటర్‌ ప్లాంట్ల నిర్వాహకులు కనీసం 25 శాతం కూడా పాటించడం లేదని తెలుస్తోంది. ప్లాంట్ల నిర్వహణ కోసం అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్నా.. రెవెన్యూ, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎక్కడైనా బోర్‌ వేయాలంటే భూగర్భ జలవనరుల శాఖ, రెవెన్యూ అధికారుల అనుమతి తప్పక తీసుకోవాలి. కానీ.. నిర్వాహకులు అటువంటి నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బోర్లు వేస్తుండడంతో భూగర్భ జలాలు అంతరించిపోయే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ప్లాంట్‌ నిర్వాహకులు బోర్లు వేసి.. వాటి నుంచి సుమారుగా 10వేల లీటర్ల నీటిని తోడుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలోని బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోయి ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో వారి పరిస్థితి చెప్పలేకుండా ఉంది. 

శుద్ధ జలానికే ప్రజల మొగ్గు.. 
ప్రస్తుత పరిస్థితుల్లో పట్టణాలు, గ్రామీణ ప్రాం తాలు అనే తేడా లేకుండా శుద్ధి చేసిన జలాలను తాగేందుకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీనిని ఆసరా చేసుకున్న ప్లాంట్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా నీటిని అందించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణాల్లో అధిక శాతం మినరల్‌ వాటర్‌ వ్యాపారులు క్యాన్లను ఆర్డర్‌ ప్రకారం ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో కూల్‌ వాటర్‌ను కొందరు వినియోగిస్తున్నారు. కూల్‌ వాటర్‌ క్యాన్‌ రూ.40 నుంచి రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. గృహావసరాలకే కాకుండా వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు, హోటళ్లలో ఫ్యూరిఫైడ్‌ నీటినే వినియోగిస్తున్నారు. మార్కెట్‌లో ఉన్న పోటీ నిమిత్తం పలువురు వ్యాపారులు, టిఫిన్‌ సెంటర్లు, బేకరీల నిర్వాహకులు శుద్ధ జలాన్ని వినియోగదారులకు అందించాలని కోరుకుంటారు. వివాహాది శుభకార్యాలకు వేలాది లీటర్ల మినరల్‌ వాటర్‌ను వినియోగిస్తున్నారు.

అనుమతి లేని ప్లాంట్ల ద్వారా సరఫరా అయ్యే నీరు కలుషితం అవుతుండడం.. వాటిని ప్రజలు సేవిస్తుండడంతో 80 శాతం మంది వివిధ రకాల రోగాల బారిన పడుతున్నారని వైద్యులే స్వయం గా పేర్కొంటున్నారు. దీంతో ప్రజలు సురక్షితమైన తాగునీటి కోసం అధిక ప్రాధాన్యం ఇస్తున్నా రు. సురక్షితమైన తాగునీటి కోసం సంపన్న వర్గాల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి నెల కొం త సొమ్మును వెచ్చించడం ప్రస్తుతం తప్పనిసరి అయింది. గతంలో వేసవి కాలానికే పరిమితమైన శుద్ధ జలం వినియోగం ఇప్పుడు ఏడాది పొడవునా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతి లేని ప్లాంట్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.   
 
ఒళ్లంతా నొప్పులే.. 
గ్రామాల్లో ఎలాగూ పరిశుభ్రమైన తాగునీరు అందించరు. దీంతో డబ్బులు పెట్టి మరీ కొనుక్కు న్న మినరల్‌ వాటర్‌ తాగితే ఒళ్లం తా నొప్పులుగా ఉం టుంది. పైగా నీళ్లు తాగినప్పుడే తీపిగా ఉంటున్నాయి. ఆ తర్వాత మళ్లీ దాహం వేస్తుంది. ఆరోగ్యం కోసం మినరల్‌ వాటర్‌ తాగితే అవి మినరల్‌ నీళ్లో, జనరల్‌ నీళ్లో తెలియడం లేదు. – కర్లపూడి వెంకటేశ్వర్లు, మద్దులపల్లి 
 
తనిఖీలు చేయాలి.. 

పరిమితికి మించి నీటిలో రసాయనాలు కలపడం వల్ల ప్రజల ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలి. నీటి పరీక్షలు చేయించి నిబంధనల ప్రకారమే మినరల్స్‌ ఉన్నాయా లేదా అనేది పరిశీలించాలి. పైగా మినరల్‌ క్యాన్ల ధరలు కూడా ఇష్టానుసారం పెంచుతున్నారు. వాటిని కట్టడి చేయాలి. – యాట శ్రీను, కామంచికల్‌ 
 
నిబంధనల మేరకే అనుమతులు

మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ముందుగా టీఎస్‌ ఐపాస్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి నుంచి ఎంతమేరకు.. ఎన్ని అడుగు లు బోర్‌ వేయవచ్చనేది పరిశీలించి అనుమతి ఇస్తాం. ప్లాంట్‌లో బోర్‌ వేయాలంటే నాలుగు నిబంధనలు పాటించాలి. సేఫ్‌ ఏరియా, సెమీ క్రిటికల్, క్రిటికల్, వెరీ క్రిటికల్‌ నిబంధనలుం టాయి. వీటిలో క్రిటికల్, వెరీ క్రిటికల్‌ పరిస్థితి ఉన్నచోట బోరు వేసేందుకు అనుమతి ఇవ్వం. అలా జిల్లాలో చాలా వరకు బోర్లు వేసేందుకు అనుమతి ఇవ్వలేదు. వాల్టా చట్టం ప్రకారం బోరుకు బోరుకు మధ్య దూరం 300 మీటర్లు పాటించాలి. రోజుకు 500 కిలో లీటర్ల నీరు తోడేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. అంతకు మించి ఉన్నట్లయితే అనుమతి ఇవ్వడం కుదరదు. – రాకేష్‌చందర్, భూగర్భ జలవనరుల శాఖ డీడీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top