ఒంటరిననే భావన వద్దు! 

Do not feel lonely! - Sakshi

మనసు విప్పి బాధను పంచుకోవాలి 

ఐటీ కాంగ్రెస్‌ సదస్సులో నటి దీపికా పదుకొనె

అంటువ్యాధిలా మారిన కుంగుబాటు 

సామాజిక చైతన్యంతోనే కుంగుబాటు దూరమవుతుందని సూచన

సాక్షి, హైదరాబాద్‌: ఒంటరిననే భావననే దరిచేరనీయవద్దని, అది మానసిక కుంగుబాటు (డిప్రెషన్‌)కు దారితీస్తుందని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనె పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మానసిక కుంగుబాటు అంటువ్యాధిలా మారుతోందని, ప్రతి ఐదుగురిలో ఒకరు తీవ్ర మానసిక వ్యధను ఎదుర్కొంటున్నారని చెప్పారు. సామాజిక చైతన్యమే కుంగుబాటుకు పరిష్కారమన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌ సదస్సులో బుధవారం ‘మానసిక దృఢత్వం’అంశంపై నిర్వహించిన ప్రత్యేక చర్చలో ఆమె మాట్లాడారు. గతంలో స్వయంగా మానసిక కుంగుబాటుకు లోనై బయటపడ్డానని తన అనుభవాన్ని సభికులతో పంచుకున్నారు. ‘‘నా సినీ కెరీర్‌ మంచిస్థాయిలో ఉన్న 2014లో కుంగుబాటుకు, మనోవేదనకు గురయ్యా. ఒంటరితనంతో నాలో నేనే కుమిలిపోయా. బాధను తట్టుకోలేక ఏడ్చేదాన్ని. ఆ సమయంలో నా వద్దకు వచ్చిన మా అమ్మ నాకు అండగా నిలిచారు. మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి కౌన్సెలింగ్‌ ఇప్పించారు. కుంగుబాటు నుంచి బయటపడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు..’’అని దీపికా పదుకొనె వెల్లడించారు. 

మనతో ఉండేవారిని గమనించండి.. 
తన పరిస్థితిని పసిగట్టి తల్లి అడిగాకే.. తనను ఇబ్బందిపెట్టిన విషయాలను వేరేవారితో పంచుకోవడానికి తనకు అవకాశం లభించిందని దీపిక చెప్పారు. నిత్యం మనతో కలిసి ఉండేవారు ఏం చెబుతున్నారో, వాళ్లలో వస్తున్న మార్పులేమిటో గమనిస్తూ ఉండాలని, వారిలోని చిరాకును గమనించాలని సూచించారు. వారిలో కుంగుబాటు లక్షణాలను గుర్తించి అండగా నిలవాలన్నారు. తనకు ఏమైందో తెలియని మనోవేదన అనుభవించానని, అది కుంగుబాటు (డిప్రెషన్‌) అని మానసిక వైద్యులు నిర్ధారించిన మరుక్షణమే సగం విజయం సాధించానని చెప్పారు. వారి కౌన్సెలింగ్, ధాన్యం, జీవన శైలిలో మార్పులు, సకాలంలో నిద్రపోవడం, సరైన ఆహారం తీసుకోవడంతో పాటు తల్లి అందించిన సహకారంతో కుంగుబాటు నుంచి బయటపడ్డానని తెలిపారు. మానసిక ఆందోళన, ఆవేదన, వ్యధను కలిగించే అంశాలను మన శ్రేయస్సు కోరే వారితో పంచుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుందన్నారు. 

ఎవరో ఏదో అనుకుంటారన్న ఆలోచన వద్దు 
కుంగుబాటుకు ఎన్నో కారణాలు ఉంటాయని, అపరాధ భావం అందులో ఒకటని దీపిక చెప్పారు. తన గురించి ఎవరో ఏదో అనుకుంటారనే, జడ్జ్‌ చేస్తారనే భయంతోనే తాను కుంగుబాటుకు లోనయినట్లు తెలిపారు. మనోవేదనకు లోనైనప్పుడు ఏడవడం, మనసు విప్పి ఇతరులతో బాధను పంచుకోవడం, వైద్య సహాయం పొందడం మంచిదని సూచించారు. ప్రతి సంస్థ మానసిక నిపుణులతో తమ ఉద్యోగులకు తరచూ కౌన్సెలింగ్‌ ఇప్పించాలని కోరారు. తనకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ‘ది లైవ్‌ లవ్‌ లాఫ్‌’అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి విప్రో సంస్థ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ సంధానకర్తగా వ్యవహరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top