ధూళికట్ట స్థూపం..అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం! | Dhulikatta Buddhist Centre is an ancient Buddhist site | Sakshi
Sakshi News home page

ధూళికట్ట స్థూపం..అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం!

Feb 12 2018 3:55 PM | Updated on Aug 20 2018 9:18 PM

Dhulikatta Buddhist Centre is an ancient Buddhist site - Sakshi

ధూళికట్టలోని చారిత్రక బౌద్ధ స్థూపం

మన రాష్ట్రంలో దాదాపు 40 బౌద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో ధూళికట్ట బౌద్ధస్థూపం అతి పురాతనమైంది. ప్రతి యేటా బుద్ధ పూర్ణమి రోజున జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బౌద్ధమతస్థులు బుద్ధ జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. ధూళికట్ట బౌద్ధ స్థూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని బౌద్ధ స్థూపం గత చారిత్రక వైభవానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా ఉన్న బౌద్ధ స్థూపానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు.

సాక్షి, పెద్దపల్లి : ఘనమైన చరిత్ర కలిగిన ధూళికట్ట బౌద్ధస్థూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. అందులో భాగంగా స్థానిక ఎంపీ బాల్క సుమన్‌ తన నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుతం బౌద్ధ స్థూపం చుట్టూ తొమ్మిది ఎకరాలు చదును చేస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నారు. చుట్టూ కంచె, విద్యుత్‌ సరఫరా, బోర్‌వెల్‌ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, రక్షణకు సిబ్బంది నియామకం, రక్షణ సిబ్బందికి ఓ గది, వరండా ఏర్పాటు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లాంటి పనులు చేస్తున్నారు.

ఇక రెండో దశలో స్వదేశీ దర్శన్‌ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.20 కోట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రూ.20 కోట్లు మంజూరైతే బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి అందులో బుద్ధుని శిల్పాలు, గతంలో ఇక్కడ బయటపడి, వేర్వేరు చోట్ల ఉన్న ఆధారాలు తెప్పించి ఉంచాలని నిర్ణయించారు. సందర్శకులకు విశ్రాంతి గదులు, బౌద్ధస్థూపం చుట్టూ సుందరవనం, హుస్సేనిమియా వాగు ఒడ్డున బౌద్ధ విగ్రహం, పౌంటైన్‌ నిర్మాణం, చిన్న పిల్లల కోసం పార్క్‌ తదితరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళి కలు సిద్ధం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులున్న బౌద్ధభిక్షు లను కూడా ఈ బౌద్ధ స్థూపం వద్దకు తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.

రోడ్డు అత్యవసరం..
చారిత్రక బౌద్ధ స్థూపం వెలుగు చూసి సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బౌద్ధ స్థూపం చుట్టూ హుస్సేనిమియా వాగు, రైతుల పంటపొలాలు ఉండడంతో అక్కడకు వాహనాలు కాదుకదా.. నడక కూడా కష్టంగానే మారింది. దీనికోసం వడ్కాపూర్, కోనరావుపేట, ధూళికట్ట.. మూడు వైపుల నుంచి రోడ్లు వేయడానికి ఎంపీ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే బౌద్ధ స్థూపానికి పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement