breaking news
Buddhist centres
-
ధూళికట్ట స్థూపం..అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం!
మన రాష్ట్రంలో దాదాపు 40 బౌద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో ధూళికట్ట బౌద్ధస్థూపం అతి పురాతనమైంది. ప్రతి యేటా బుద్ధ పూర్ణమి రోజున జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బౌద్ధమతస్థులు బుద్ధ జయంతి వేడుకలను ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. ధూళికట్ట బౌద్ధ స్థూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా మలిచే దిశగా అడుగులు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని బౌద్ధ స్థూపం గత చారిత్రక వైభవానికి ప్రతిరూపంగా నిలుస్తోంది. తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా ఉన్న బౌద్ధ స్థూపానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. సాక్షి, పెద్దపల్లి : ఘనమైన చరిత్ర కలిగిన ధూళికట్ట బౌద్ధస్థూపాన్ని అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం కట్టింది. అందులో భాగంగా స్థానిక ఎంపీ బాల్క సుమన్ తన నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఈ నిధులతో ప్రస్తుతం బౌద్ధ స్థూపం చుట్టూ తొమ్మిది ఎకరాలు చదును చేస్తున్నారు. చెట్లను తొలగిస్తున్నారు. చుట్టూ కంచె, విద్యుత్ సరఫరా, బోర్వెల్ నిర్మాణం, తాగునీటి సౌకర్యం, రక్షణకు సిబ్బంది నియామకం, రక్షణ సిబ్బందికి ఓ గది, వరండా ఏర్పాటు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లాంటి పనులు చేస్తున్నారు. ఇక రెండో దశలో స్వదేశీ దర్శన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.20 కోట్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రూ.20 కోట్లు మంజూరైతే బౌద్ధ స్థూపాన్ని అభివృద్ధి చేయడంతోపాటు, అక్కడే మ్యూజియం ఏర్పాటు చేసి అందులో బుద్ధుని శిల్పాలు, గతంలో ఇక్కడ బయటపడి, వేర్వేరు చోట్ల ఉన్న ఆధారాలు తెప్పించి ఉంచాలని నిర్ణయించారు. సందర్శకులకు విశ్రాంతి గదులు, బౌద్ధస్థూపం చుట్టూ సుందరవనం, హుస్సేనిమియా వాగు ఒడ్డున బౌద్ధ విగ్రహం, పౌంటైన్ నిర్మాణం, చిన్న పిల్లల కోసం పార్క్ తదితరాలు ఏర్పాటు చేయాలని ప్రణాళి కలు సిద్ధం చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులున్న బౌద్ధభిక్షు లను కూడా ఈ బౌద్ధ స్థూపం వద్దకు తీసుకురావాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రోడ్డు అత్యవసరం.. చారిత్రక బౌద్ధ స్థూపం వెలుగు చూసి సంవత్సరాలు గడుస్తున్నా, ఇప్పటికీ ఆ ప్రాంతానికి వెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. బౌద్ధ స్థూపం చుట్టూ హుస్సేనిమియా వాగు, రైతుల పంటపొలాలు ఉండడంతో అక్కడకు వాహనాలు కాదుకదా.. నడక కూడా కష్టంగానే మారింది. దీనికోసం వడ్కాపూర్, కోనరావుపేట, ధూళికట్ట.. మూడు వైపుల నుంచి రోడ్లు వేయడానికి ఎంపీ బాల్క సుమన్, స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిలు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ఆచరణలోకి వస్తే బౌద్ధ స్థూపానికి పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది. -
బౌద్ధ సాంస్కృతిక సంపదపై చైనా దాడి
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లోని బమియాన్ బుద్ధ విగ్రహాలను తాలిబన్ టైస్టులు 2001లో ధ్వంసం చేసినప్పుడు ప్రపంచ దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశాధినేతలతోసహా వివిధ దేశాల ప్రజలు గళం విప్పి నిరసన వ్యక్తం చేశారు. ‘ఎందుకు ఇలా జరిగింది? మనం ఎందుకు ఈ విధ్వంసాన్ని నిలువరించలేకపోయాం?’ అంటూ వ్యాఖ్యానాలు చేశారు. వారిలో చైనా ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అఫ్ఘాన్ సాంస్కృతిక వారసత్వ సంపదనను ధ్వంసం చేసేందుకు చైనా మెటలార్జికల్ గ్రూప్ కార్పొరేషన్ (ఎంసీసీ) రంగంలోకి దిగింది. ఇటు అఫ్ఘాన్, అటు బౌద్ధ చరిత్రను తిరిగి రాయగల ఐదువేల సంవత్సరాల కాంస్య యుగం నాటి మెస్ ఐనాక్ ప్రాంతాన్ని తవ్వి పారేసేందుకు బిడ్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అపార రాగి గనులను భూగర్భంలో దాచుకున్న మెస్ ఐనాక్ ప్రాంతాన్ని కొల్లగొట్టడం కోసమే చైనా కంపెనీ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. వచ్చే ఏడాది నుంచే తవ్వకాలు ప్రారంభంకానున్నాయి. కాబూల్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఐదు లక్షల చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన మెస్ ఐనాక్లో రాగి గనులతోపాటు కాలగర్బంలో కలసిపోయిన అపార బౌద్ధ చరిత్ర దాగి ఉంది. కనీసం నాలుగు వందల బుద్ధుడి విగ్రహాలు, వందలాది దేవాలయాలు, అపార బంగారు, రాగి నాణాలు, నగలు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే పది శాతం వరకు తవ్వకాలు జరిపిన అఫ్ఘాన్ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కాదిర్ తిమోరి నాయకత్వంలో కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇటు అఫ్ఘాన్ ప్రభుత్వానికి, అటు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు పోరాటం చేస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు తమ శక్తి చాలదని, ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తంచేస్తూ, తమకు మద్దతిస్తేనే తమ లక్ష్యం నెరవేరుతోందని వారంటున్నారు. వారి సహకారంతో అఫ్ఘాన్‌కు చెందిన ఓ ఫిల్మ్ డివిజన్ ఈ అంశంపై ‘సేవ్ మెస్ ఐనాక్’ పేరిట ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనిద్వారా ప్రపంచ ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వారు చెప్పారు. టైస్టులైనందునే నాటి తాలబన్ల విధ్వంసాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయా? ఇప్పుడు అఫ్ఘాన్ పురావస్తు శాస్త్రజ్ఞుల పోరాటానికి మద్దతుగా నిలుస్తాయా? అన్న అంశం వేచి చూడాల్సిందే.