మూతబడులు! | Depending on number of student-teacher allocation rationalization | Sakshi
Sakshi News home page

మూతబడులు!

Sep 28 2014 3:34 AM | Updated on Aug 29 2018 4:16 PM

మూతబడులు! - Sakshi

మూతబడులు!

రేషనలైజేషన్ (విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల కేటాయింపు-హేతుబద్ధీకరణ)తో జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. వీటిలో 270 ప్రైమరీ స్కూళ్లు, 200 హైస్కూళ్లు

 నల్లగొండ అర్బన్ : రేషనలైజేషన్ (విద్యార్థుల సంఖ్యను బట్టి టీచర్ల కేటాయింపు-హేతుబద్ధీకరణ)తో జిల్లాలో 470  ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి నెలకొంది. వీటిలో 270 ప్రైమరీ స్కూళ్లు, 200 హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లు ఉండనున్నాయి. దసరా సెలవుల్లోనే రేషనలైజేషన్ అమలు చేయాలంటూ ప్రభుత్వం శనివారం జీఓనంబరు 6 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రేషనలైజేషన్ కు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించింది. 20మంది విద్యార్థుల కన్నా తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను దగ్గరలోని ప్రాథమిక పాఠశాలల్లో, 75మంది  విద్యార్థులకన్నా తక్కువగా ఉండే హైస్కూళ్లను మూసివేసి సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేసే విధంగా గైడ్‌లైన్స్ రూపొందించారు.  ఇదే నిబంధన ఇంగ్లీష్ మీడియంలోని సక్సెస్ హైస్కూళ్లకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించారు. రేషనలైజేషన్ పూర్తయితే  పెద్దసంఖ్యలో ఉపాధ్యాయుల ఖాళీలకు గ్రహణం వీడనుంది. అధికంగా ఉన్న ఉపాధ్యాయులను సమీపంలోని స్కూళ్లకు బదిలీచేస్తే డీఎస్సీ ప్రకటన  ఇప్పట్లో సాధ్యమయ్యేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
 
 పరస్పర విరుద్ధంగా నిబంధనలు..
 విద్యాహక్కు చట్టం ప్రకారం కిలోమీటర్ దూరంలోపే ప్రభుత్వ పాఠశాల ఉండాలని నిబంధనలున్నాయి. మరోవైపు 20మంది పిల్లలకన్నా తక్కువ సంఖ్య ఉన్న (19 మంది విద్యార్థులున్నా సరే) ప్రైమరీ స్కూళ్లను మూసివేయాలని రేషనలైజేషన్‌లో నిబంధన పెట్టారు. అదే విధంగా జిల్లాలో ప్రస్తుతం 20మందిలోపు ఉన్న పాఠశాలలు 270 దాకా ఉన్నాయి. వీటిని మూసివేస్తే ఒక్కో పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులున్నా, సగటున 550 మంది టీచర్లు మిగులుతారు. వీరిని ఉపాధ్యాయ ఖాళీలున్న ఇతర పాఠశాలల్లోకి బదిలీ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు తగ్గే అవకాశముంటుంది.
 
  డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఒకింత నిరాశను మిగిల్చే పరిణామమిది. అంతేకాకుండా 75 మంది విద్యార్థులకన్నా తక్కువ ఉన్న హైస్కూళ్లను కూడా సమీపంలోని హైస్కూళ్లలో విలీనం చేయాలని నిబంధనలు చెబుతున్నాయి.  జిల్లాలో దాదాపు 200కు పైగా హైస్కూళ్లు, సక్సెస్ సూళ్లపై కూడా రేషనలైజేషన్ ప్రభావం పడనుంది. సక్సెస్ స్కూళ్ల పేరుతో ఇంగ్లీషు మీడియాన్ని ప్రవేశపెట్టి అదనపు సెక్షన్లు ఏర్పాటు చేశారు. చాలా పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు 60 నుంచి 70 మంది విద్యార్థులే చదువుతున్నారు. వీటిని కూడా తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులను కూడా ఇతర చోట్ల సర్దుబాటు చేస్తారు. దీంతో ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది.  
 
 మూతబడేది ఇలా..
 గుర్రంపోడు మండల పరిధిలోని పోచంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఇంగ్లీష్ మీడియంలో 50మంది, తెలుగు మీడియంలో 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. 75 మంది కన్నా తక్కువ ఉన్న స్కూళ్లను ఎత్తివేయాలనే నిబంధనలో పేర్కొన్నారు. దీంతో తెలుగు, ఇంగ్లిష్ మీడియం రెండూ ఎత్తివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో ఇలాంటి పాఠశాలలు అనేకం ఉన్నాయి. ఇవి కాకుండా యూపీఎస్‌లలో కూడా 6వ తరగతిలో 20 మంది, 7వ తరగతిలో 20 మంది లేకపోతే ఆ పాఠశాలను కూడా మూసివేయాలని నిబంధనలు రూపొందించడంతో అనేక యూపీఎస్‌ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది.
 
 విద్యా సంవత్సరం మధ్యలో రేషనలైజేషన్ తగదు : టీఆర్‌టీఎఫ్
 వేసవి సెలవుల్లో రేషనలైజేషన్ ప్రక్రియ చేపడితే బాగుండేదని టీఆర్‌టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నంద్యాల మోహన్‌రెడ్డి, నిమ్మనగోటి జనార్దన్ అన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో ఇలాంటి నిబంధనలు తీసుకరావడం వల్ల ఇటు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరమే. అందుకే ప్రస్తుత రేషనలైజేషన్‌ను వ్యతిరేకిస్తున్నాం. గ్రామీణ విద్యార్థులు సక్సెస్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. వారిని పక్క గ్రామాలకు వెళ్లి వేరే స్కూళ్లో చదవాలంటే మానేసి పరిస్థితి ఏర్పడుతుంది. రేషనలైజేషన్ ఉద్దేశం పాఠశాలలను ఎత్తివేసే లక్ష్యంతో ఉండకూడదు. దీని ప్రభావం డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూడా ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement