దోమ దెబ్బ

Dengue malaria Cases Files In Gandhi hospital hyderabad - Sakshi

వర్షాలతో దోమల వృద్ధి   గ్రేటర్‌కు డయేరియా ముప్పు  

విస్తరిస్తున్న డెంగీ, మలేరియా  

‘గాంధీ’లో రెండు నెలల్లో487 డెంగీ కేసులు  

వారంలోనే ఉస్మానియాలో26, ఫీవర్‌లో 14

హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు 274 మలేరియా కేసులు... ఆగస్టులోనే 31 నమోదు

సాక్షి, సిటీబ్యూరో: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు తోడు ఇళ్ల మధ్య మురుగు నిల్వ, చెత్తా చెదారంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభిస్తున్నాయి. నీరు, ఆహార కాలుష్యంతో  నగరవాసులు డయేరియా, విషజ్వరాల బారినపడుతున్నారు. వాంతులు, విరేచరాలతో పాటు దగ్గు, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ జనరల్‌ ఆస్పత్రులు సహా నగరంలోని పలు కార్పొరేట్‌ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత డయేరియా కేసులతో పాటు ఇతర సీజనల్‌ వ్యాధుల బారిన పడిన బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది, ఈ సీజనల్‌ వ్యాధుల విషయంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.   

చాపకింద నీరులా డెంగీ, మలేరియా
నగరంలో మలేరియా, డెంగీ దోమలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. గత నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 417 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు 70పైగా కేసులు, ఉస్మానియాలో కేవలం వారం రోజుల్లోనే 26 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఫీవర్‌లో 14 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 179 కేసులు నమోదు కాగా, ఈ నెలలో 46 కేసులు నమోదయ్యాయి. 274 మలేరియా కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క ఆగస్టులోనే 31 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు.  

ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
నీటిని వేడి చేసి, చల్లారిన తర్వాత తాగాలి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పూల కుండీలు, వాటర్‌ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి.  – డాక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, జనరల్‌ ఫిజిషియన్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top