
విష జ్వరాలు, డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికెన్‌గున్యా వంటి ఎన్నో రకాల వ్యాధులు దోమ కాటుతో వస్తాయి. దోమ కాటు వేసిందా ఎంతటి వారైనా మంచాన పడాల్సిందే. మరి అలాంటి దోమల నివారణకు ఎవరో వచ్చి దోమల మందు పిచికారీ చేస్తారని ఎదురు చూడకుండా ఇంటి పెరట్లోనో, బాల్కనీల్లోనో చిన్న కుండీల్లో ఈ మొక్కలను పెంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అవి ఒక్క దోమల నివారణకే కాకుండా వంటింటికీ ఉపయోగపడతాయని అంటున్నారు. రసాయన లిక్విడ్లకు బదులుగా సహజ సిద్ధంగా దోమల నివారణ ఆరోగ్యం, పర్యావరణానికి మంచిదని బోటనీ ప్రొఫెసర్ దిలీప్ చెబుతున్నారు. మొక్కలు పెంచే సమయంలో నీరు నిల్వ కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
పాత కాలంలో ఇంటి ఆవరణలో తులసి మొక్కకు పూజలు చేసేవారు. ఉదయం లేచి స్నానం చేసి, తులసి గుండం వద్ద దీపం వెలిగించేవాళ్లు. అది ఆధ్యాత్మికంగా, అందులో ఔషధ గుణాలు ఆరోగ్యపరంగానూ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ మొక్కల ఆకుల వాసనతో దోమలు దూరమవుతాయట.
వంటింట్లో మనకు నిత్యం కనిపించే పుదీనా ఆకు ఘాటైన వాసనలకు దోమలు దూరమవుతాయట. పుదీనా పెంచుకుంటే ఒక వైపు దోమల నివారణ, మరో వైపు వంటకు అవసరమైన పుదీనా ఆకు సొంతంగా పెంచుకున్నట్లు అవుతుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ లీవ్స్
అందుబాటులో ఉంటాయి.
నిమ్మ గడ్డి వాసనకు దోమలు దూరం కావడంతో పాటు వంటల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు. సిట్రోనెల్లా గడ్డిలో సిట్రోనెల్లాల్, సిట్రోనెల్లోల్, జెరానియోల్ కలిసి ఉంటాయి. ఇది ఘాటైన వాసనలను వెదజల్లుతుంది. ఈ వాసనకు దోమలు తరలిపోతాయి.
రోజ్‌మెరీ కొమ్మలను కాల్చినా, నూనె వాడినా దోమలు దూరమవుతాయి. కుప్ప చెట్టు రసాయనాల కంటే ప్రభావవంతంగా పనిచేస్తుంది.
ఇంట్లో లావెండర్, బంతి మొక్కలు పెంచుకుంటే వాటి పువ్వులు సువాసనలు వెదజల్లుతాయి. కలర్‌ఫుల్‌గా ఉండే పువ్వులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రిలాక్స్‌గా అనిపిస్తుంది. వీటిలో లినాలూల్, కర్పూరం సమ్మేళనాలు ఉంటాయి. వీటి సువాసన, నూనె దోమలను తరిమేస్తుంది.
(చదవండి: మాన్సున్ ఎండ్..ట్రెక్కింగ్ ట్రెండ్..! సై అంటున్న యువత..)