చేయి తడపాల్సిందే..!

demanding bribe for power connection in mahabubnagar - Sakshi

డబ్బులిచ్చినా స్తంభాలు తీసుకెళ్లిన కాంట్రాక్టర్‌

  మళ్లీ డబ్బు ఇవ్వాలని డిమాండ్‌

   లబోదిబోమంటున్న బాధిత రైతు 

నారాయణపేట : నారాయణపేట ట్రాన్స్‌కో పరిధిలో కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో రైతులు, వినయోగదారులు నష్టాలపాలవుతున్నారు. తాజాగా ఓ నిరుపేద రైతుకు ప్రభుత్వం అందించిన నాలుగు విద్యుత్‌ స్తంభాల్లో  మూడు స్తంభాలను తిరిగి తీసుకెళ్లారు.  

స్తంభానికి రూ.5వేలచొప్పున డీడీ 

నారాయణపేట మండలం జలాల్‌పూర్‌కు చెందిన కుర్వ బుగ్గప్ప తన పొలానికి విద్యుత్‌ స్తంభాలు, తీగలను ఏర్పాటు చేసేందుకు మూడేళ్ల క్రితం రూ.5వేలకు పైగా డీడీని కట్టారు. జనవరి 22న కుర్వ బుగ్గప్ప పొలంలో కాంట్రాక్టర్‌ కతల్‌అహ్మాద్‌ నాలుగు స్తంభాలు పాతి రైతుతో పాతినట్లు సంతకాలు చేయించుకున్నారు.  

విద్యుత్‌ తీగలు అమర్చేందుకు బేరం 

విద్యుత్‌ తీగలు అమర్చేందుకు రూ.15 వేలు చెల్లించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. బేరసారాలతో రూ. 7,500 వరకు చెల్లించేందుకు రైతు ముందుకొచ్చారు. సంబంధిత కాంట్రాక్టర్‌ పాతిన నాలుగు స్తంభాల్లో మూడు స్తంభాలను వారం రోజుల క్రితం తిరిగి తీసుకెళ్లారు. ఈ విషయంపై రైతు బుగ్గప్ప పలుమార్లు సంబంధిత కాంట్రాక్టర్‌తో ప్రాదేయపడిన ఫలితం లేకుండా పోయింది. భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా అధ్యక్షుడు వెంకోభతో కలిసి ట్రాన్స్‌కో డీఈ చంద్రమౌలికి ఈనెల7న ఫిర్యాదు చేశారు. ఈమేరకు రైతు పొలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ విషయం బయటికి పొక్కడంతో కాంట్రాక్టర్‌తో మాట్లాడి స్తంభాలు ఏర్పాటు చేయిస్తానని డీఈ హామీ ఇచ్చివెళ్లారు. మరెందరో రైతులు ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ డీడీలు పట్టుకొని చెప్పులు అరిగేలా తిరుగుతున్న పరిస్థితి నారాయణపేటలో కొనసాగుతుందని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి రైతులకు తగు న్యాయం చేయాలని కోరుతున్నారు.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top