డిసెంబర్‌ 7న సెలవే 

December 2018 holiday in telangana state - Sakshi

అందరూ ఓటు హక్కు  వినియోగించుకోండి 

నేటికల్లా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తి 

ఇప్పటిదాకా రూ.105 కోట్లు స్వాధీనం 

‘నా వోట్‌ యాప్‌’ఆవిష్కరణలో సీఈఓ రజత్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: డిసెంబర్‌ 7న ముమ్మాటికీ వేతనంతో కూడిన సెలవేనని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని ఎన్నికల సంఘం ప్రధానాధికారి సీఈఓ రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన, సంయుక్త ముఖ్య ఎన్నికల అధికారి ఆమ్రపాలితో కలిసి మాట్లాడారు. ఆ రోజు పౌరులంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, విధిగా ఓటింగ్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఓటరు స్లిప్పుల పంపిణీ వేగంగా జరుగుతోందని చెప్పారు. 77 అసెంబ్లీ నియోజకవర్గాలకు బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ పూర్తయిందన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ 30వ తేదీ ఉదయానికి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ యంత్రాలు చేరుకున్నాయని వెల్లడించారు.  

లోగో డిజైన్‌కు బహుమతి.. 
ఈ సందర్భంగా ‘నా వోట్‌ యాప్‌’ను సీఈఓ రజత్‌ కుమార్‌ ఆవిష్కరించారు. ఓటర్లకు ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించామని తెలిపారు. అనంతరం యాప్‌ ప్రత్యేకతలను ఆమ్రపాలి వివరించారు. ఈ యాప్‌ అన్ని ఐఓఎస్, ఆండ్రాయిడ్‌ ప్లేస్టోర్లలో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇందులో పేరు లేదా ఎపిక్‌ నంబరు టైప్‌ చేయగానే.. ఓటరుకు సమీపంలో ఉన్న పోలింగ్‌ బూత్, అధికారుల వివరాలు ప్రత్యక్షమవుతాయని చెప్పారు. నా వోట్‌ లోగో డిజైన్‌ కోసం దరఖాస్తులను ఆçహ్వానించారు. తెలుగు, హిందీ, ఊర్దూలలో చక్కటి లోగో పంపిన వారికి రూ. 15,000 బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఎంట్రీలను నవంబర్‌ 30 నుంచి డిసెంబర్‌ 6వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా పంపాలని చెప్పారు. ఉత్తమ ఎంట్రీని డిసెంబర్‌ 10న ప్రకటిస్తామని తెలిపారు. దరఖాస్తులను  n్చ్చఠి్టౌ్ఛ్టటఃజఝ్చజీ . ఛిౌఝ మెయిల్‌కు పంపాల్సి ఉంటుంది. 

ఆ నగదు నరేందర్‌రెడ్డి అనుచరుడిదే.. 
కొడంగల్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డి అనుచరుడి ఇంట్లో జరిగినవి ఐటీ దాడులేనని రజత్‌ కుమార్‌ స్పష్టతనిచ్చారు. దాడులు జరిగినవి నరేందర్‌రెడ్డి సంబంధీకుడు శేఖర్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌లో అని తెలిపారు. ఈ దాడిలో దాదాపు రూ. 51 లక్షల నగదు దొరికిందని, దీనిపై కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘానికి నివేదిక పంపామని వెల్లడించారు. ఇప్పటిదాకా మొత్తం రూ. 105 కోట్ల నగదు పట్టుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరికీ చెందని సొమ్మే అధికంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో కండువాలు కప్పిన విషయంపై ఇంకా వివరణ రాలేదని, వచ్చాక స్పందిస్తానని చెప్పారు.  

7న సెలవు పాటించాల్సిందే.. 
డిసెంబర్‌ 7న దేశ రక్షణ, భద్రతా కారణాలు తప్ప అన్ని కంపెనీలు, సంస్థలూ అందరూ సెలవు పాటించేల్సిందేనని రజత్‌ కుమార్‌ స్పష్టం చేశారు. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగ ప్రముఖులతో గురువారం ఇష్టాగోష్టి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశం, ప్రజాస్వామ్యం.. వీటిదే మొదటి ప్రాధాన్యతగా ఉండాలని, మీరంతా మార్పునకు ప్రతినిధులుగా వ్యవహరించాలని ఉద్బోధించారు. విదేశీ ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా అక్కడి వారి పనివేళలను అనుసరించడం తదితర కారణాల వల్ల రోజంతా పూర్తిగా సెలవు ప్రకటించకుండా తమకు మినహాయింపు ఇవ్వాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌.సి.ఎస్‌.సి) ప్రతినిధులు కోరారు. ఓటు వేసే బాధ్యతను పక్కనబెట్టి, మనదేశ వ్యవస్థను విదేశాలతో పోల్చి బాగాలేదనడం సరికాదని రజత్‌ కుమార్‌ వారికి హితవు పలికారు. ఐటీ కంపెనీల్లోనే పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యం కాదన్నారు.  

ఓటు ప్రజాస్వామ్యానికి చిహ్నం.. 
ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి చిహ్నమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ అన్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ శ్రీ మహేశ్‌ భగవత్‌ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక అభ్యర్థి కేవలం 45 ఓట్ల తేడాతో గెలిచాడనీ, దీనిని బట్టి ఒక్క మాదాపూర్‌లోనే ఉన్న 24 వేల మంది ఐటీ ఉద్యోగులు ఓటింగ్‌ సరళిలో, అభ్యర్థుల గెలుపోటముల్లో ఎంత మార్పు తీసుకురాగలరో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ సెంట్రల్‌ జోన్‌ కమిషనర్‌ శ్రీమతి హరిచందన, కార్మికవిభాగం జాయింట్‌ కమిషనర్‌ ఆర్‌.చంద్రశేఖర్, ఎస్‌.సి.ఎస్‌.సి కార్యదర్శి, ఇన్ఫోపీర్స్‌ సీఈఓ భరణీ కుమార్‌ ఆరోల్, రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top