వైద్యం అందక యువకుడి మృతి 

Death of a young man with Hospital staff Negligence - Sakshi

     క్రిస్మస్‌ వేడుకల్లో వైద్యులు 

     ప్రాణాపాయంతో వచ్చినా పట్టించుకోని వైనం 

సిరిసిల్ల టౌన్‌: వైద్యాన్ని పక్కనబెట్టి.. ముందస్తు క్రిస్మస్‌ వేడుకల్లో మునిగిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి సిబ్బంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స కోసం వచ్చినా పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు చనిపోవడం జిల్లాలో కలకలం సృష్టించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే సదరు యువకుడు చనిపోయాడని పేర్కొంటూ బీజేపీ నాయకులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండలం లింగంపేట శివారులో శుక్రవారం రాత్రి గొంటి సునీల్‌ (23) ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే వైద్యసిబ్బంది క్రిస్మస్‌ సంబరాల్లో ఉన్నారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పినా పట్టించుకోలేదు. దాదాపు 25 నిమిషాలపాటు కొట్టుమిట్టాడినా ఫలితం లేకుండా పోయింది. తీరా డ్యూటీ డాక్టర్‌ 9 గంటలకు వచ్చి పరిశీలించి అప్పటికే సునీల్‌ చనిపోయినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సునిల్‌ చనిపోయాడని, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ తిరుపతి వివరణ ఇస్తూ.. శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ వార్డులోని సిబ్బంది ఎవరూ వేడుకల్లో పాల్గొనలేదని, డ్యూటీలో లేనివారు మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో వచ్చిన సునీల్‌ను డాక్టర్‌ పరిశీలించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారని, ఆ తర్వాత క్రిస్మస్‌ వేడుకలను నిలిపివేశామని పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top