ఎస్‌ఎల్‌బీసీ నెత్తిన మరో పిడుగు!

deadline for payment of SLBC Tunnel Current Bills - Sakshi

నేటితో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కరెంట్‌ బిల్లుల చెల్లింపునకు తుది గడువు

కట్టకుంటే కరెంట్‌ నిలిపివేత..

సాక్షి, హైదరాబాద్‌: ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ)లో టన్నెల్‌ తవ్వకపు పనులకు కొత్త చిక్కొచ్చి పడింది. గడిచిన రెండు, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న కరెంట్‌ బిల్లుల చెల్లింపు చేయకుంటే ఈ నెల 10 నుంచి నుంచి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని జెన్‌కో అధికారులు ఏజెన్సీ సంస్థకు నోటీసులు పంపారు. ఎస్‌ఎల్‌బీసీలో ఇప్పటికే శ్రీశైలం నుంచి తవ్వుతున్న పనులు కన్వేయర్‌ బెల్ట్‌ పాడవడం, టన్నెల్‌ బోరింగ్‌ యంత్రానికి మరమ్మతులు జరగని కారణంగా ఆగిన విషయం తెలిసిందే. ఈ పనులకే రూ.60 కోట్లు అడ్వాన్సులు కోరగా ఇంతవరకు ప్రభుత్వం ఇవ్వలేదు.

దీనికి తోడు మరో రూ.20 కోట్ల మేర పెండింగ్‌ బిల్లులు రావాల్సి ఉంది. ఈ నిధులే ఐదారు నెల లుగా రాకపోవడంతో ఏజెన్సీ సంస్థ తలపట్టుకుంటోంది. ప్రస్తుతం ట్రాన్స్‌కో మరో పిడుగు వేసింది. టన్నెల్‌ తవ్వకం సందర్భంగా వస్తున్న సీపేజీ నీటిని తోడేందుకు ఏజెన్సీకి ప్రతినెలా రూ.2 నుంచి రూ.3 కోట్ల మేర కరెంట్‌ బిల్లు వస్తోంది. గతంలో బిల్లులు లేక చెల్లింపు చేయకపోవడంతో ప్రభుత్వం విదిల్చిన అరకొర నిధులతో నెట్టుకొచ్చింది. తాజాగా మళ్లీ మూడు నెలలుగా రూ.7 నుంచి రూ.8 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో పడ్డాయి. వాటిని చెల్లించాలని లేదంటే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని ఇదివరకే జెన్‌కో హెచ్చరించింది.

దీంతో ప్రాజెక్టు ఇంజనీర్లు ఆర్థిక శాఖను కలిసినా నిధుల విడుదల జరగలేదు. దీనిపై కల్పించుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్‌ ఇంజనీర్లు కొందరు రాష్ట్ర ఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ రఘుమా రెడ్డితో చర్చించి కొన్నాళ్లు సరఫరాకు ఆటంకం లేకుండా చూడాలని విన్నవించారు. దీంతో సరఫరా కొనసాగిస్తూ వస్తుండగా, వారు విధించిన తుది గడువు ఈ నెల 10తో ముగుస్తోంది. బిల్లు చెల్లింపు చేయకుంటే సరఫరా ఆగనుంది. అదే జరిగితే మొత్తం ప్రాజెక్టుకు మొదటికే మోసం రానుంది. ఇప్పటికే ఇన్‌లెట్‌ టన్నెల్‌ పనుల వద్ద ప్రస్తుతం భారీగా సీపేజీ ఉండటంతో నిమిషానికి 9,600 లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తోంది. ప్రస్తుతం ఏజెన్సీ వద్ద 6 వేల లీటర్ల మేర మాత్రమే నీటిని తోడే సామర్ధ్యం ఉండటంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే డీ వాటరింగ్‌ చేయడం కష్టం. అదే జరిగితే టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ పూర్తిగా మునిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ వర్గాలు చెబుతున్నాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top