
అత్తను చంపి..పోలీసులకు లొంగిపోయిన కోడలు
పాతకక్షలు, ఆస్తి తగాదాలు వెరసి ఒక హత్యకు కారణమయ్యాయి.
వంగూరు (మహబూబ్‌నగర్) : పాతకక్షలు, ఆస్తి తగాదాలు వెరసి ఒక హత్యకు కారణమయ్యాయి. అత్తను హత్య చేసిన ఓ కోడలు, పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి నేరం అగీకరించింది. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... మిట్టసదగోడు గ్రామానికి చెందిన జెల్లర్ల అంతయ్య, జంగమ్మ(60) దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందరి వివాహాలు జరిగాయి. కాగా పెద్ద కొడుకు పర్వతాలు, చిన్న కొడుకు బక్కయ్యలకు కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. వారం క్రితం వారు పరస్పరం దాడి చేసుకున్నారు. గాయాలపాలైన పర్వతాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
అయితే గొడవ విషయంలో జంగమ్మ చిన్న కొడుకుకే మద్దతిస్తోందని పర్వతాలు, అతని భార్య వెంకటమ్మ ఆగ్రహంతో ఉన్నారు. ఆమె వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బు, ఆస్తి కూడా అతనికే దక్కుతుందని వారి అనుమానం. ఆ అక్కసుతో వెంకటమ్మ శనివారం ఉదయం ఇంటిముందు గిన్నెలు కడుగుతున్న అత్త జంగమ్మను గొడ్డలితో నరకగా ఆమె అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. అనంతరం వెంకటమ్మ ఇతరుల సాయంతో బైక్‌పై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.